Begin typing your search above and press return to search.

ఆ రోజు నుంచి టీఆర్ఎస్ గా బీఆర్ఎస్ ?

భారత రాష్ట్ర సమితి షార్ట్ కట్ లో బీఆర్ఎస్ అచ్చి రాలేదు. 2022 అక్టోబర్ నెల విజయదశమి వేళ పేరు మార్చారు

By:  Tupaki Desk   |   10 April 2024 3:44 AM GMT
ఆ రోజు నుంచి టీఆర్ఎస్ గా బీఆర్ఎస్ ?
X

భారత రాష్ట్ర సమితి షార్ట్ కట్ లో బీఆర్ఎస్ అచ్చి రాలేదు. 2022 అక్టోబర్ నెల విజయదశమి వేళ పేరు మార్చారు. ఇక మీదట మనది జాతీయ పార్టీ అన్నారు. ఇంకేముంది కేసీఆర్ జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతారు అని కూడా ఆశలు పెట్టుకున్నారు. 2024 ఎన్నికల నాటికి తెలంగాణలో మూడవసారి గెలిచి జాతీయ రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషించడానికి బీఆర్ ఎస్ గా పేరు మార్చారు.

అదేదో సామెత మాదిరిగా కొత్త దాని కోసం చూస్తే ఉన్నది కూడా పోయింది అన్నట్లు అయింది. బీఆర్ఎస్ ని పేరు పెట్టిన క్షణం నుంచే కష్టాలు మొదలయ్యాయి. లిక్కర్ స్కాం అపుడే మొదలైంది. ఆ తరువాత చూస్తే పార్టీ పరంగా కష్టాలు వేధించాయి. ఇక 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా అధికారం దూరం అయింది.

దాంతో బీఆర్ఎస్ పేరు తమ కొంప ముంచింది అని పార్టీ వర్గాలు అంతా ముక్త కంఠంతో అంటున్న మాట. సమయం లేదు ఇక పేరు మార్చాల్సిందే. తెలంగాణా గొంతుకగా ఆత్మగా పార్టీ ఉండాలి అంటే కచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉండాల్సిందే అని అంటున్నారు.

టీఆర్ఎస్ 2001లో మొదలైంది. 2022 దాకా చూస్తే ఎదుగుదలే తప్ప ఇబ్బందులు లేకుండా కొనసాగింది. అలా పార్టీకి ఊతమిచ్చేలా టీఆర్ఎస్ పేరు బలం కలసి వచ్చింది అని అంటున్నారు. దాంతో ఈసారి జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ వద్దు అని టీఆర్ఎస్ గానే వెళ్లాలని కూడా పార్టీ వారు అధినేతను తొందర పెడుతున్నారు.

దాంతో ఈ నెల 27న తెలంగాణా రాష్ట్ర సమితి 24వ వార్షికోత్సవ వేడుకలు జరుగుతాయి. ఆ సమావేశాల్లోనే బీఆర్ఎస్ పేరు కాస్తా టీఆర్ఎస్ గా మారుతుందని అంటున్నారు. అది మంచి ముహూర్తం అని పార్టీ వేదిక మీదనే సర్వ సభ్య సమావేశంలో నిర్ణయం తీసుకుంటే మే లో ఎన్నికలలోగా టీఆర్ఎస్ గా మార్పు ఉంటుందని దాంతో అదృష్టం కలసి వచ్చి అనుకున్న స్థాయిలో ఎంపీ సీట్లు సాధించే వీలు ఉంటుందని భావిస్తున్నారుట.

మొత్తం మీద బీఆర్ఎస్ అంటూ హడావుడి చేసి పట్టుమని రెండేళ్ళు కాకుండానే తిరిగి టీఆర్ఎస్ గా పూర్వ నామధేయంలోకి ఆ పార్టీ వెళ్లిపోతోంది. చిత్రమేంటి అంటే 2024 ఎన్నికల్లో బీఆర్ఎస్ గా ఒక జాతీయ పార్టీగా మారి ఏపీ ఎన్నికల్లో పోటీ చేద్దామని కేసీఆర్ అనుకున్నాను. ఆయన మహారాష్ట్ర వెళ్లారు. బీహార్ వెళ్లారు, ఇతర రాష్ట్రాలు తిరిగారు.

సాటి తెలుగు రాష్ట్రం అయిన ఏపీకి ఆర్భాటంగా రావాలనుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో పాలు పంచుకోవాలని చూసారు. అమరావతిలో కానీ విశాఖలో కానీ భారీ మీటింగ్ కేసీఆర్ పెట్టాలనుకున్నారు. ఏపీలో బీఆర్ఎస్ శాఖను ప్రారంభించారు. బలమైన సామాజిక వర్గాలను ఆకర్షించాలని చూశారు. అన్నీ అనుకూలించినట్లు అయితే తెలంగాణాలో బీఆర్ఎస్ గెలిచి ఉంటే ఏపీలో కూడా కేసీయార్ హడావుడి ఈసారి ఎన్నికల్లో వేరే లెవెల్ లో ఉండేది. ఇపుడు బీఆర్ఎస్ ప్యాకప్ చెప్పి టీఆర్ఎస్ గా రాబోతున్న నేపధ్యంలో ఇక ఏపీ అవసరం కానీ ఏపీలో కేసీఆర్ పార్టీ పర్యటనలకు కానీ అసలు అవకాశం కానీ ఉండబోదని అంటున్నారు.