Begin typing your search above and press return to search.

మహారాష్ట్రలో బీఆర్ఎస్ దే అధికారమా ?

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా కేసీయార్ కేవలం ఐదు లోక్ సభ సీట్ల మీదే దృష్టిపెట్టినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి.

By:  Tupaki Desk   |   8 Aug 2023 2:30 PM GMT
మహారాష్ట్రలో బీఆర్ఎస్ దే అధికారమా ?
X

కేసీయార్ మాటలు, హామీలు అన్నీ అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తాయి. కేసీయార్ మాటలు ఎలాగుంటాయంటే ఈ నిముషంలోనో లేకపోత మరునిముషంలోనో చెప్పిన మాటలన్నీ అమల్లోకి వచ్చేయబోతున్నట్లు, ఇచ్చిన హామీలు అమలైపోయినట్లు అనిపిస్తుంది.

తీరాచూస్తే అంతా మిథ్యని తర్వాత అర్ధమవుతుంది. ఇపుడిదంతా ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అధికారం ఖాయమట. రాబోయే ఎన్నికల్లో మహారాష్ట్రలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ప్రకటించారు.

మహారాష్ట్రకు చెందిన కొందరు సర్పంచులు బీఆర్ఎస్ లో చేరారు. వీళ్ళ చేరిక సందర్భంగా అందరినీ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. వాళ్ళందరినీ అభినందిస్తు రాబోయే నెలన్నరలో మహారాష్ట్ర ప్రజల్లో మార్పు స్పష్టంగా కనబడుతుందన్నారు. తాను చేస్తున్న పర్యటనల వల్లే మహారాష్ట్ర జనాల్లో మార్పు సాధ్యమవుతుందని కేసీయార్ అన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ దే అధికారమని తేల్చిచెప్పేశారు.

ఇక్కడే కేసీయార్ మాటల్లోని డొల్లతనం బయటపడుతోంది. ఎందుకంటే మహారాష్ట్ర అసెంబ్లీలో 288 మంది ఎంఎల్ఏలున్నారు. ఇందులో సగానికిపైగా నియోజకర్గాల్లో గెలుచుకున్న పార్టీదే అధికారం. ఇపుడు బీఆర్ఎస్ వ్యవహారం చూస్తుంటే సగం సీట్లలో గెలవటం కాదు కనీసం సగం సీట్లలో పోటీకూడా చేసే అవకాశంలేదు.

అంటే 150 సీట్లలో పోటీచేసేంత సీన్ బీఆర్ఎస్ కుందా అన్నదే సందేహం. కనీసం 150 సీట్లలో కూడా గట్టి అభ్యర్ధులను నిలబెట్టలేకపోతే పోటీచేసిన సీట్లలో బీఆర్ఎస్ గెలిచేది ఎన్ని సీట్లలో ? అసలు పట్టుమని రెండు అసెంబ్లీ సీట్లలో అయినా బీఆర్ఎస్ గెలుస్తుందా ? అన్నదే సందేహం.

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా కేసీయార్ కేవలం ఐదు లోక్ సభ సీట్ల మీదే దృష్టిపెట్టినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. నాందేడ్, ఔరంగాబాద్ జిల్లాల్లోని పార్లమెంటు, అసెంబ్లీ సీట్ల మీద మాత్రమే కేసీయార్ ఎక్కువగా దృష్టిపెట్టినట్లు అర్ధమవుతోంది. ఎందుకంటే కేసీయార్ ఎక్కువగా పై జిల్లాల్లోనే పర్యటిస్తున్నారు.

అంతపెద్ద రాష్ట్రంలో కేవలం రెండు మూడు జిల్లాలకే పరిమితమైన పార్టీ రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తుందంటే ఎవరు నమ్ముతారు ? కేసీయార్ మొహంమీద ఎవరు అడగకపోవచ్చు కానీ వాళ్ళకి సందేహాలు రాకుండానే ఉంటాయా ?