Begin typing your search above and press return to search.

జుంపింగ్ జపాంగ్ : అధికారం కోసం ఎంత పెద్ద జంప్ అన్నా చేసేస్తున్నారా ?

ఇలా తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో నేతలంతా మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.

By:  Tupaki Desk   |   31 March 2024 2:30 PM GMT
జుంపింగ్ జపాంగ్ : అధికారం కోసం ఎంత పెద్ద జంప్ అన్నా చేసేస్తున్నారా ?
X

మీ ఇంటికొస్తే ఏమిస్తారు. మా ఇంటికొస్తే ఏం తెస్తారు అనే సామెతను నిజం చేస్తున్నారు. రాజకీయ నాయకులు సొంత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నారు. తాము ఎన్నికల్లో గెలిస్తే పార్టీ అధికారంలోకి రాకపోతే పరిస్థితి ఏమవుతుందోననే బెంగతో అధికార పార్టీలోకి వలస వెళ్తున్నారు. ఈ తంతు దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. దీంతో రాజకీయ నేతల తీరుకు సొంత పార్టీ వారే ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక చోట కాదు అన్ని చోట్ల ఇదే సంప్రదాయం నడుస్తోంది. దీంతో పార్టీల్లో గొడవలు జరుగుతున్నాయి. పార్టీ మారిన వారి సభ్యత్వాలు రద్దు చేయాలని స్పీకర్ ను కలుస్తున్నారు.

క్షేత్రస్థాయిలో గెలుపు కోసం అందరు పాటుపడినా గెలిచిన తరువాత తమ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో వారి దారి వారే చూసుకుంటున్నారు. అధికార పార్టీలోకి వెళ్లేందుకు వెనకాడటం లేదు. దీంతో గెలిపించిన పార్టీనే నట్టేట ముంచుతున్నారు. తమ స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. తమ కేడర్ తో సహా జంపు జలానీలుగా అవతారమెత్తుతున్నారు.

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నా అది పనిచేయడం లేదు. పార్టీ మారిన వారి సభ్యత్వాలను రద్దు చేయాలని గతంలో కాంగ్రెస్ వారు డిమాండ్ చేస్తే ఇప్పుడు బీఆర్ఎస్ వారి వంతవుతోంది. బీఆర్ఎస్ నేతలు ఉన్నా అది అధికార పార్టీకి చుట్టంగానే ఉంటోంది. ఇంతవరకు పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకున్న సందర్భాలు లేవు. దీంతో నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అని సెటైర్లు వేస్తున్నారు.

దానం నాగేందర్, కేశవరావు, కడియం శ్రీహరి లాంటి మహామహులే పార్టీని వీడారు. ఇంకా కొందరు కూడా పార్టీకి టాటా చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. చెరువు నిండితేనే పక్షులు, కప్పలు, కీటకాలు చేరతాయి. అదే చెరువు ఎండిపోతే అన్ని వలస వెళతాయి. అలాగే అధికార పార్టీలో చేరేందుకు నేతలు నిర్ణయం తీసుకుంటున్నారు. తమ స్వార్థం కోసమే పార్టీ నుంచి వెళ్లిపోతున్నారు.

ఇలా తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో నేతలంతా మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. దీనిపై కేటీఆర్ స్పీకర్ కు ఫిర్యాదు చేయడం గమనార్హం. వారి సభ్యత్వాలను రద్దు చేయాలని విజ్ణప్తి చేశారు. కాంగ్రెస్ వారేమో మీరు అధికారంలో ఉండగా చేసిందేమిటని ప్రశ్నిస్తున్నారు. దీంతో రెండు పార్టీలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.