కౌంటింగ్ కేంద్రాలను ఖాళీ చేస్తున్న బీఆర్ ఎస్ నాయకులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. తుది దశకు చేరుతున్న నేపథ్యంలో బీఆర్ ఎస్ నేతలు.. కౌంటింగ్ కేంద్రాలను ఖాళీ చేస్తున్నారు
By: Tupaki Desk | 3 Dec 2023 7:04 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. తుది దశకు చేరుతున్న నేపథ్యంలో బీఆర్ ఎస్ నేతలు.. కౌంటింగ్ కేంద్రాలను ఖాళీ చేస్తున్నారు. ఆలేరు.. పాలేరు.. సహా.. దాదాపు 50 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఇంటికి వెళ్లిపోయారు. ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ ఎస్ అభ్యర్థులు ఏకంగా 10 వేల ఓట్ల మెజారిటీ తేడాతో రెండో స్థానం, 20 వేల ఓట్ల మెజారిటీతో మూడో స్థానానికి పడిపోయారు.
దీంతో ఇక, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉండడం ఇష్టం లేక.. చాలా మంది వచ్చిన దారినే వెనక్కి వెళ్లిపోతున్న దృశ్యాలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. ఆలేరు కౌంటింగ్ కేంద్రం నుండి బయటికెళ్ళి పోతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి కన్నీరు పెట్టుకున్నంత పనిచేశారు. ఎన్నికల పోలింగ్ వేళ హల్చల్ చేసిన ఆమె భర్త.. మహేందర్ రెడ్డి కూడా పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.
ప్రజల తీర్పును గౌరవించాలని చెప్పిన సునిత.. రెండుసార్లు టిఆర్ఎస్ కు అవకాశమిచ్చిన ప్రజలు మూడోసారి మార్పు కోరుకుంటున్నారని వెల్లడించడం గమనార్హం. ఇక, పాలేరు నియోజకవర్గంలో బీఆర్ ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ నేత కందాల ఉపేందర్‌రెడ్డి ఏకంగా 12 వేల ఓట్ల మెజారిటీ వెనుక బడ్డారు. ఇక్కడ పొంగులేటి.. దూకుడు కొనసాగుతోంది. దీంతో ఉపేందర్‌రెడ్డి కూడా.. పోలింగ్ కౌంటింగ్ కేంద్రాల నుంచి తన బిచాణా సర్దేశారు.
కూకట్ పల్లిలో జనసేన నాయకులు ఇంటి ముఖం పట్టారు. కామారెడ్డిలో కేసీఆర్ గెలుపు కోసం వేచి చూసిన బీఆర్ ఎస్ సభ్యులు, నాయకులు.. ఆయన మూడో స్థానానికి పడిపోవడంతో కిమ్మనకుండా.. ఇంటి ముఖం పట్టారు. ఇక, బీఆర్ ఎస్ ఆధిక్యంలో ఉన్న చోట మాత్రం కాంగ్రెస్ పుంజుకుంటుందనే ఆశలో అక్కడి నాయకులు ఎదురు చూస్తున్నారు.