Begin typing your search above and press return to search.

ఆంధ్రాను ఫుల్లుగా వాడేస్తున్న బీయారెస్...అంత మ్యాటర్ ఉందా...?

బీయారెస్ కష్టం కృషి కూడా హైదరాబాద్ అభివృద్ధిలో ఉండవచ్చు కానీ తామే లేకపోతే హైదరాబాద్ పని సరి అనడం ఏ రకమైన రాజకీయం అని ప్రశ్నిస్తున్నారు.

By:  Tupaki Desk   |   27 Oct 2023 10:05 PM IST
ఆంధ్రాను ఫుల్లుగా వాడేస్తున్న బీయారెస్...అంత మ్యాటర్ ఉందా...?
X

దాదాపుగా పదేళ్ళ క్రితం వరకూ ఏపీ తెలంగాణా రెండూ ఒక్కటే. అపుడే అభివృద్ధి అంతా మూటకట్టుకుని హైదరాబాద్ లో కేంద్రీకృతం అయింది. దాని ఫలితంగానే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కూడా వచ్చిందని అంతా అంటారు. ఇక రాజధాని ఉన్న చోట నుంచి సెపరేట్ స్టేట్ నినాదం రావడం ప్రపంచంలో ఒక వింత అయితే రాజధాని లేకుండా రాష్ట్రాన్ని ముక్కలు చేయడం వింతలో కెల్లా వింత.

అలా అన్ని విధాలుగా విభజన గాయాలతో ఏపీ కునారిల్లింది. ఏపీలో రెండు బలమైన సామాజిక వర్గాలు రెండు పార్టీల మధ్య రాజకీయం రచ్చకెక్కి రాజధాని అన్నది కూడా అందులో పడి నలుగుతోంది. ఈ నేపధ్యంలో పొరుగున ఉన్న తెలంగాణాకు ఆల్ రెడీ హైదరాబాద్ వంటి విశ్వనగరం ఉంది. అందులో అరవై ఏళ్ల ఏపీ జనాల రెక్కల కష్టం కూడా ఉంది. అయితే ఈ రోజు అది తెలంగాణాకు రాజధాని కాబట్టి క్రెడిట్ మొత్తం వారిదే.

సరే ఏపీకి పదేళ్ళ కాలంలో రాజధానిని ఏర్పాటు చేసుకోలేకపోవడం ఆంధ్రా రాజకీయ వైఫల్యం అయితే ఆ వైఫల్యాల నుంచి కొత్త ఫలితాలను తనకు అనుకూలంగా వాడుకోవాలని బీయారెస్ చూడడమే ఇపుడు అసలైన పాలిటిక్స్. బీయారెస్ మంత్రులు నేతలు ఎప్పుడూ ఏపీని పోల్చుతూ మేము సూపర్ సుమా అంటూంటారు. అది నీటి ప్రాజెక్టుల విషయం అయినా లేక వ్యవసాయ ఉత్పత్తులు అయినా లేక పరిశ్రామిక ఐటీ అభివృద్ధి అయినా. అయినా ఒక స్థిరమైన అభివృద్ధి హైదరాబాద్ లో ఉంది కాబట్టి దాని చుట్టూ మరింతగా ప్రగతి సాగడం సహజమైన పరిణామం.

అయితే దాన్ని తమ ఘనతగా చెప్పుకోవడంలో తప్పులేదు కానీ మేము రాకపోతే తెలంగాణా ఏపీలాగ మారుతుంది అని భయపెట్టడం, ఏపీని తక్కువ చేసి చూపించడమే దారుణమైన రాజకీయం అని అంటున్నారు. ఈసారి బీయారెస్ అధికారంలోకి రాకపోతే హైదరాబాద్ కూడా అమరావతిగా మారిపోతుందని హరీష్ రావు అంటున్నారు. మరి ఆయన ఏ లెక్కలతో ఇలా అంచనా కట్టారో తెలియదు కానీ ఎక్కడ హైదరాబాద్, మరెక్కడ అమరావతి అని అంటున్నారు

అమరావతి ఇంకా పుట్టీ పుట్టని వ్యవహారం. అది షేపూ రూపూ లేని ప్రాంతం. దానికీ అన్ని విధాలుగా అభివృద్ధి చెంది నాలుగు వందల ఏళ్ల నుంచి బలంగా తన ఉనికిని చాటుకుంటూ వస్తున్న హైదరబాద్ కి ఎక్కడ పోలిక అని అంటున్నారు అంతా. బీయారెస్ రాకపోతే హైదరాబాద్ అభివృద్ధి ఢమాల్ అంటుందని హరీష్ రావు భయపడుతున్నారంటే దానికి అర్ధం ఉందా అని కూడా అంటున్నారు.

హైదరాబాద్ అభివృద్ధి ఎవరు పాలకులు వచ్చినా మరో అడుగు ముందుకు పడుతునే ఉంటుంది తప్ప ఆగేది కాదని కూడా అంటున్నారు. ఎందుకంటే అది దేశంలోని అతి పెద్ద మెట్రో సిటీస్ లో ఒకటి. కోటికి పైగా జనాభా ఉంటూ ప్రగతిపధంలో దూసుకుని పోతున్న హైదరాబాద్ ని అమరావతితో పోల్చడం ద్వారా హరీష్ రావు చెప్పదలచుకున్నది ఏంటి అంటే ఇదంతా బీయారెస్ వల్లనే అని అనడం. అలా అని విశ్వసించడానికి జనాలు సిద్ధంగా ఉన్నారా అన్నదే ప్రశ్న.

బీయారెస్ కష్టం కృషి కూడా హైదరాబాద్ అభివృద్ధిలో ఉండవచ్చు కానీ తామే లేకపోతే హైదరాబాద్ పని సరి అనడం ఏ రకమైన రాజకీయం అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఏపీలో పగతనం ఉంది, తెలంగాణాలో పనితనం ఉంది హరీష్ రావు అంటున్నారు.తాము తలచుకుంటే చాలా మంది ప్రతిపక్ష నేతలు జైలులో ఉండేవారు అని కూడా ఆయన చెబుతున్నారు. మరి ఎందుకు తలచుకోలేదో ఆయనే చెప్పాలని కూడా ప్రశ్నలు వస్తున్నాయి.

అవినీతి చేసిన వారిని ఉదారంగా వదిలేశారా లేక అవినీతి చేయలేదని భావించారా లేక ఊరకే కేసులు పెట్టకుండా రాజనీతిని ప్రదర్శించారా అన్నది హరీష్ రావే చెప్పాలని అంటున్నారు. ఏపీలో ఏమే లేవు అన్నీ తెలంగాణాలో ఉన్నాయని అవి కూడా తాము వచ్చాకనే అని బీయారెస్ ప్రచారం చేసుకోవడం బాగానే ఉంది కానీ దానికి ఏపీని ఎందుకు మధ్యన లాగుతున్నారు స్వామీ అనే అంటున్నారు అంతా.

దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిక పెట్టుకుని చెప్పుకోవచ్చు కదా అని కూడా అంటున్నారు. విభజన వల్ల ఇబ్బంది పడుతున్న ఏపీ అభివృద్ధి అయిదు పదేళ్ళలో సాధ్యపడి హైదరాబాద్ ధీటుగా సాగుతుందని హరీష్ రావు లాంటి వారు అనుకుంటే అందులో వాస్తవాలు ఎంత ఉన్నాయన్నది కూడా జనాలు చూడరా అని అంటున్నారు. తెలంగాణా ఎన్నికల్లో అమరావతి ఆంధ్రులను తెచ్చేసి ఫుల్లుగా వాడుకుంటున్న బీయారెస్ నేతలు మరెన్ని తేస్తారో కూడా చూడాలని అంటున్నారు.

దాని కంటే ముందు ఒక్క హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చెందిందని, బీయారెస్ పాలనలో మిగిలిన తెలంగాణా అలాగే ఉండిపోయింది అన్న అక్కడి ప్రతిపక్షాల ప్రశ్నలకు హరీష్ రావు లాంటి వారు ఎలాంటి జవాబు ఇస్తారో చూడాలని అంటున్నారు.