Begin typing your search above and press return to search.

బీఆర్‌ఎస్‌ కి మరో భారీ షాక్‌.. బీజేపీలోకి బీఆర్‌ఎస్‌ ఎంపీ!

లోక్‌ సభ ఎన్నికల ముంగిట బీఆర్‌ఎస్‌ కు మరో బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన జహీరాబాద్‌ సిట్టింగ్‌ ఎంపీ బీబీ పాటిల్‌ బీఆర్‌ఎస్‌ కు రాజీనామా ప్రకటించారు.

By:  Tupaki Desk   |   1 March 2024 11:22 AM GMT
బీఆర్‌ఎస్‌ కి మరో భారీ షాక్‌.. బీజేపీలోకి బీఆర్‌ఎస్‌ ఎంపీ!
X

లోక్‌ సభ ఎన్నికల ముంగిట బీఆర్‌ఎస్‌ కు మరో బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన జహీరాబాద్‌ సిట్టింగ్‌ ఎంపీ బీబీ పాటిల్‌ బీఆర్‌ఎస్‌ కు రాజీనామా ప్రకటించారు. అంతేకాకుండా ఆయన ఢిల్లీలో బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్, పార్టీ తెలంగాణ ఇంచార్జి తరుణ్‌ చుగ్, తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జహీరాబాద్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా పాటిల్‌ బరిలోకి దిగుతారని సమాచారం.

కాగా బీఆర్‌ఎస్‌ రాజీనామా చేసిన బీబీ పాటిల్‌ తన రాజీనామా లేఖను అధ్యక్షుడు కేసీఆర్‌ కు పంపించారు. తనకు పార్టీలో అవకాశం కల్పించినందుకు «ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. 2019 ఎన్నికల్లో జహీరాబాద్‌ నుంచి బీఆర్‌ఎస్‌ ఎంపీగా బీబీ పాటిల్‌ విజయం సాధించారు.

కాగా, ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే బీజేపీ లోక్‌ సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించనుందని టాక్‌ నడుస్తోంది. దేశవ్యాప్తంగా 100 మంది అభ్యర్థుల పేర్లతో బీజేపీ తొలి జాబితాను ప్రకటిస్తుందని సమాచారం. ఇందుకుగాను ఆ పార్టీ అగ్ర నాయకత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిందని తెలుస్తోంది. తొలి జాబితాలో అభ్యర్థుల పేర్ల ఖరారు కోసం ఇప్పటికే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) సమావేశమైంది.

తొలి విడతలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను రెండు మూడు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. గత లోక్‌ సభ ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో గెలిచిన సీట్లు, పార్టీ బలహీనంగా ఉన్న సీట్లలో ముందు అభ్యర్థులను ప్రకటిస్తారని అంటున్నారు. ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తే వారి ప్రచారానికి కనీసం 50 రోజుల సమయం దొరుకుతుందని అంటున్నారు.

కాగా, బీజేపీ తొలి జాబితాలో తెలంగాణ నుంచి సుమారు 8 మంది అభ్యర్థులు ఖరారైనట్లు చెబుతున్నారు. సీట్లు ఖరారైన వారిలో సికింద్రాబాద్‌ నుంచి కిషన్‌రెడ్డి, నిజామాబాద్‌ నుంచి ధర్మపురి అరవింద్, కరీంనగర్‌ నుంచి బండి సంజయ్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, హైదరాబాద్‌ నుంచి మాధవీలత, మహబూబ్‌ నగర్‌ నుంచి డీకే అరుణ, నాగర్‌ కర్నూల్‌ నుంచి భరత్‌ ప్రసాద్‌ ఉన్నట్లు సమాచారం.