Begin typing your search above and press return to search.

వ‌ద‌ల బొమ్మాళీ... క‌విత‌కు మ‌ళ్లీ ఈడీ స‌మ‌న్లు

తాజాగా ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణానికి సంబంధించిన కేసులో మ‌రోసారి స‌మ‌న్లు జారీ చేసింది.

By:  Tupaki Desk   |   14 Sep 2023 9:04 AM GMT
వ‌ద‌ల బొమ్మాళీ... క‌విత‌కు మ‌ళ్లీ ఈడీ స‌మ‌న్లు
X

తెలుగు చిత్ర సీమ‌లో సంచ‌ల‌నం సృష్టించిన `అరుంధ‌తి` సినిమాలో వ‌ద‌ల బొమ్మాళీ... టైపులో తెలంగాణ రాజ‌కీయ నాయ‌కురాలు, సీఎం కేసీఆర్ గారాల‌ప‌ట్టి ఎమ్మెల్సీ క‌విత‌ను కూడా ఈడీ వ‌దిలి పెట్ట‌డం లేదు. తాజాగా ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణానికి సంబంధించిన కేసులో మ‌రోసారి స‌మ‌న్లు జారీ చేసింది. దీంతో ఇక‌, వ‌దిలిపోయిందిలే అనుకున్న కేసులో మ‌రోసారి క‌విత మెడ‌కు ఉచ్చు త‌గులుకున్న‌ట్టు అయింద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

వాస్త‌వానికి కొన్ని నెల‌ల కింద‌ట ఈడీ అధికారులు క‌విత‌ను హైద‌రాబాద్‌లోని ఇంట్లోను, ఢిల్లీలోని వారి ఆఫీస్‌లోను ఈ కేసుకు సంబంధించి మూడు సార్లు సుదీర్ఘంగా విచారించారు. ఈ క్ర‌మంలో ఒక ద‌శ‌లో క‌విత అరెస్టు ఖాయ‌మ‌ని కూడా అంద‌రూ అనుకున్నారు. అయితే, అనూహ్యంగా కొన్ని నెల‌ల పాటు ఈడీ కానీ, సీబీఐ కానీ క‌విత జోలికి రాలేదు. ఫ‌లితంగా ఇక‌, దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారిన ఈ కేసులో క‌విత కు విముక్తి ల‌భించిన‌ట్టేన‌ని అంద‌రూ భావించారు.

అయితే, అనూహ్యంగా కవితకు ఈడీ మరోసారి సమన్లు జారీ చేయ‌డం, శుక్రవారం(రేపు) ఢిల్లీలో హాజరు కావాలని ఈడీ ఆదేశించడంతో క‌విత ప‌రిస్థితి మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గత మార్చిలో మూడు సార్లు ఈడీ ముందు కవిత హాజరయ్యారు. ఆ తరువాత ఈడీ కేసు స్తబ్దుగా మారింది. ఇటీవల అరుణ్ రామచంద్రన్ పిళ్లై అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే. 164 కింద ఈడీ అధికారులకు పిళ్లై వాంగ్మూలం ఇచ్చారు.

పిళ్లై దగ్గర నుంచి ఈడీ అధికారులు రాబ‌ట్టిన స‌మాచారం ఆధారంగానే తాజాగా ఆమెకు మ‌రోసారి స‌మ‌న్లు ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. కవిత బినామీగా అరుణ్ రామచంద్రన్ పిళ్లైపై దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపిన విష‌యం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో పలువురు సౌత్ గ్రూపులోని సభ్యులు అప్రూవర్‌గా మార‌డం, పిళ్లై, మాగుంట శ్రీనివాసరెడ్డి , ఆయన కుమారుడు రాఘవరెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా లిక్కర్ కేసు మ‌రిన్ని మ‌లుపులు తిరుగుతున్న నేప‌థ్యంలో క‌విత‌కు తాజా స‌మ‌న్లు రాజ‌కీయంగా కూడా ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.