Begin typing your search above and press return to search.

'ఏం ఫ‌ర్లేదు'.. చిన్న‌సారు లైట్ తీసేసుకున్నారు!

అత్యంత కీల‌క‌మైన పార్ల‌మెంటు ఎన్నిక‌ల ముందు.. తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ పార్టీ నుంచి మెజారిటీ నాయ‌కులు వెళ్లిపోయారు

By:  Tupaki Desk   |   10 April 2024 3:53 AM GMT
ఏం ఫ‌ర్లేదు.. చిన్న‌సారు లైట్ తీసేసుకున్నారు!
X

అత్యంత కీల‌క‌మైన పార్ల‌మెంటు ఎన్నిక‌ల ముందు.. తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ పార్టీ నుంచి మెజారిటీ నాయ‌కులు వెళ్లిపోయారు. హైద‌రాబాద్ న‌గ‌రంలోని పెద్ద నియోజ‌క‌వ‌ర్గం ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం కూడా.. పార్టీ నుంచి జంప్ చేసేశారు. ఎక్క‌డైనా ఏ పార్టీ అయినా.. ఇక‌.. మీద‌ట నాయ‌కుల‌ను వెళ్ల‌కుండా చూస్తామ‌ని.. అంత‌ర్గ‌తంగా ఏం జ‌రుగుతోందో దృష్టి పెడ‌తా మ‌ని చెబుతాయి. ఆ దిశ‌గా అడుగులు వేసేందుకు కూడా కార్యోన్ముఖులు కావాల్సి ఉంటుంది. కానీ, ఈ త‌ర‌హా ప‌రిస్థితి బీఆర్ ఎస్‌లో ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. వెళ్లిపోయిన నేత‌ల‌పై మాట‌ల దాడులు, ఫిర్యాదుల దాడుల‌తో స‌రిపెడుతున్నారే త‌ప్ప‌.. బుజ్జ‌గింపులు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు.

ఇక‌, తాజాగా బీఆర్ ఎస్ పార్టీ రెండో స్తానంలో ఉన్న నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ మ‌రింత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌కీయాల్లో ఉన్న నేత‌లు పార్టీలు మార‌డం స‌హ‌జ‌మేన‌ని, త‌మ పార్టీ నుంచి ఇప్ప‌టికి చాలా మంది వెళ్లిపోయిన మాట వాస్త‌వ‌మేన‌ని చెప్పారు. అయితే.. పార్టీకి ఏం ఫ‌ర్లేదని అన్నారు. తాము ఇప్పుడు వెళ్లిపోయిన నాయ‌కుల గురించి ఆలోచించే స‌మ‌యం కూడా లేద‌న్నారు. ''వెళ్లిపోయారు. నిజ‌మే. రాజ‌కీయాల్లో ఇవ‌న్నీ కామ‌నే. ఫ‌ర్లేదు. వెళ్లిపోయిన వారి గురించి ఇప్పుడు చర్చిస్తూ కూర్చును స‌మ‌యం లేదు.'' అని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ప్ర‌స్తుతం త‌మ దృష్టి అంతా.. పార్టీని బ‌లోపేతం చేయ‌డంపైనే ఉంద‌ని కేటీఆర్ చెప్పారు. ముఖ్యంగా ప్ర‌జ‌ల‌తోనే సంబంధాలు పెట్టుకునేందుకు తాము ప్లాన్ చేస్తున్నామ‌న్నారు. ''ఏ రాజ‌కీయ పార్టీలో అయినా.. అప్ అండ్ డైన్లు కామ‌నే. దీనిని మేం సీరియ‌స్గా తీసుకోవ‌డం లేదు. అయితే.. ప్ర‌జ‌ల‌తోనే మేం మ‌మేకం అవుతున్నాం. కేసీఆర్ స‌ర్‌..పార్టీ పెట్టి 24 సంవత్స‌రాలు అయ్యాయి. ఈ కాలంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఎంతో మంది వ‌చ్చారు.. వెళ్లారు. వారి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే.. టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ప్ర‌జ‌ల‌ను క‌లుసుకునే స‌మ‌యం'' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ఇక‌, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కూడా దాదాపు ఇదే పంథాలో ఉన్నార‌నే వాద‌న వినిపిస్తోంది. ఆయ‌న పెద్ద‌గా ఎవ‌రు వెళ్లినా.. ప‌ట్టించుకోవడం లేదు. అయితే... పార్టీ నుంచి వ‌స్తున్న వారిని చేర్చుకుంటున్న కాంగ్రెస్‌పై మాత్రం విరుచుకుప‌డుతున్నారు. వారికి బ‌లం లేకే.. త‌మ బ‌లాన్ని లాగేసుకుంటున్నార‌ని.. ఇటీవ‌ల రైతుల కోసం జ‌న‌గామ జిల్లాలోప‌ర్య‌టించిన సంద‌ర్భంలోనూ వ్యాఖ్యానించారు. ఇంత‌కు మించి కేసీఆర్ కూడా పెద్ద‌గా సీరియ‌స్ గా తీసుకోవ‌డం లేదు. బ‌హుశ‌.. గ‌ట్టిగా ప‌ట్టించుకుంటే.. వారి డిమాండ్ల‌ను నెర‌వేర్చాల్సి ఉంటుంద‌నో.. లేక పార్టీ డీలా ప‌డిపోయింద‌నే వాద‌న వినిపిస్తుంద‌నో భావిస్తున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.