Begin typing your search above and press return to search.

87 మందితో 21న బీఆర్ఎస్ జాబితా.. 23 టికెట్లు డౌటేల?

23లో సిటింగ్ లు ఎందరో? బీఆర్ఎస్ పెండింగ్ పెట్టనున్న23 సీట్లలో సిటింగ్ ఎమ్మెల్యేలు ఎందరనేది చూడాల్సి ఉంది

By:  Tupaki Desk   |   18 Aug 2023 6:00 PM IST
87 మందితో 21న బీఆర్ఎస్ జాబితా.. 23 టికెట్లు డౌటేల?
X

బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కు సెటిమెంట్లు అధికం. ఏ పనైనా సరే ముహూర్త బలం చూసుకుని మరీ మొదలుపెడతారు. ఇప్పుడు అత్యంత కీలకమైన అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులనూ మాంచి ముహూర్తంలో వెల్లడించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 21న సోమవారం 87 మందితో బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను వెల్లడించనున్నట్లు సమాచారం. వాస్తవానికి శ్రావణ శుక్రవారం అంటే.. ఈ రోజే జాబితా ప్రకటించాలని నిర్ణయించినా, చివరి నిమిషంలో ఆగిపోయింది. పూర్తిస్థాయిలో అధికారిక సమాచారం కాకున్నప్పటికీ వచ్చే సోమవారం బీఆర్ఎస్ తొలి జాబితా బయటకు రావడం ఖాయమని అంటున్నారు.

నాడు 105.. నేడు 87 మాత్రమేనా? 2018లో అనూహ్యంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సీఎం కేసీఆర్.. మహా కూటమి (కాంగ్రెస్-టీడీపీ-బీఆర్ఎస్)ను ఢీకొన్నారు. గట్టి పోటీ ఎదురైన నాడు ఏకంగా 105 స్థానాలకు అభ్యర్థులను ఒకేసారి ప్రకటించారు. కానీ ఈసారి 87 పేర్లనే వెల్లడించనున్నారు. అప్పటికంటే 18 మంది అభ్యర్థులను తక్కువగా ప్రకటించనున్నారు. దీనికి అనేక కారణాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ సిటింగ్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత, వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్నందున ప్రభుత్వంపై సహజంగా ఉండే వ్యతిరేకత తదిదర అంశాల నేపథ్యంలోనే ఆచితూచి అడుగులు వేస్తున్నట్లుగా స్పష్టమవుతోంది.

ఎంఐఎం పోగా..? తెలంగాణలో మొత్తం సీట్లు 119. ఇందులో 7 స్థానాలు ఎటుతిరిగీ మజ్లిస్ వే. ఈసారి ఆ పార్టీ మరిన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలనుకుంటోంది. ఆ లెక్కన 9 స్థానాలను టార్గెట్ చేసిందనుకున్నా.. మిగిలినవి 110. ఇప్పుడు బీఆర్ఎస్ 87 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించనుంది. అంటే 23 సీట్లలో పోటీచేయబోయేది ఎవరనేది పెండింగ్ లో ఉంచనుంది. 2108లో గట్టి పోటీ ఉండగానే కేవలం 14 సీట్లలోనే అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించించింది. ఇప్పుడు ఆ సంఖ్య 23కు చేరింది.

23లో సిటింగ్ లు ఎందరో? బీఆర్ఎస్ పెండింగ్ పెట్టనున్న23 సీట్లలో సిటింగ్ ఎమ్మెల్యేలు ఎందరనేది చూడాల్సి ఉంది. అసలు 20 మంది సిటింగ్ లకు టికెట్ డౌట్ అని కథనాలు వస్తున్నాయి. తొలి జాబితాగా 87 మంది పేర్లను వెల్లడించనున్నారు. ఇక్కడే 23 మందికి టికెట్ కట్ అని తెలుస్తోంది. వీరిలో పలువురు సీనియర్లతో పాటు తొలిసారి గెలిచినవారూ ఉన్నారు. గమనార్హం ఏమంటే ఇతర పార్టీల నుంచి వచ్చినవారికీ టికెట్ ఈసారి ఇవ్వబోవడం లేదు. ఇలాంటివారిలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ ఉన్నారు. రాములు నాయక్ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి బీఆర్ఎస్ లో చేరారు. చందర్ ఫార్వర్డ్ బ్లాక్ తరఫున నెగ్గారు.