Begin typing your search above and press return to search.

అప్పుడే శాపనార్థాలా ? బాగా కాలుతున్నట్టు ఉంది!

శుభం పలకరా పెళ్ళికొడకా అంటే.... అన్న సామెతలో చెప్పినట్లుగా ఉంది ప్రతిపక్షాల వ్యవహారం. తాజాగా జరిగిన తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది.

By:  Tupaki Desk   |   7 Dec 2023 6:02 AM GMT
అప్పుడే శాపనార్థాలా ? బాగా కాలుతున్నట్టు ఉంది!
X

శుభం పలకరా పెళ్ళికొడకా అంటే.... అన్న సామెతలో చెప్పినట్లుగా ఉంది ప్రతిపక్షాల వ్యవహారం. తాజాగా జరిగిన తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవం ఏర్పాట్లు కూడా ఘనంగానే జరిగాయి. ఈ సమయంలో ప్రతిపక్షాలు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయి. ఇంకా రేవంత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోలేదు, ప్రభుత్వం కూడా ఏర్పడలేదు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని శాపనార్ధాలు మొదలయ్యాయి.

బీఆర్ఎస్ మాజీ ఎంఎల్ఏ షకీల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలల్లో కూలిపోతుందని శపించారు. బీజేపీ ఎంఎల్ఏ రాజాసింగ్ మాట్లాడుతు ఏడాదిలోగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవటం ఖాయమని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ కు చెందిన మరో నేత మాట్లాడుతు ఆరుమాసాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి మళ్ళీ కేసీయారే సీఎం అవుతారట. రాజకీయాల్లో విపరీత ధోరణులు పెరిగిపోతున్నాయనటానికి ఇవే నిదర్శనాలు. ఎన్నికలన్నాక గెలుపోటములు చాలా సహజం.

తాము ఓడిపోయినంత మాత్రాన గెలిచిన పార్టీకి శాపనార్ధాలు పెట్టడం ఏమిటో బీఆర్ఎస్ నేతలకే తెలియాలి. బీఆర్ఎస్ వరుసగా రెండు ఎన్నికల్లో గెలిచినపుడు కాంగ్రెస్ నేతలు ఎప్పుడూ ఇలా శాపనార్ధాలు పెట్టలేదు. ఎన్నికలు వచ్చినపుడు కేసీయార్ ను ప్రజలే దించేస్తారని పదేపదే చెప్పేవారంతే. గెలవగానే కేసీయార్ ప్రభుత్వం కూలిపోతుందని ఎప్పుడూ మాట్లాడలేదు. అయినా పిల్లి శాపానికి ఉట్టి పడిపోతుందా అన్నట్లుగా నేతలు శాపనార్ధాలు పెడితే ప్రభుత్వం పడిపోతుంది. కాకపోతే మాట్లాడిన నేత మానసిక స్ధితే జనాలముందు బయటపడిందంతే.

రాజాసింగ్ అయితే ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు. నిజానికి రెండూ కూడా విచిత్రమనే చెప్పాలి. కాంగ్రెస్ నేతలు ఐకమత్యం ఉన్నంతవరకు పార్టీలో చీలికరాదనే అనుకోవాలి. పార్టీలో చీలిక రానపుడు ప్రభుత్వం పడిపోయే అవకాశంలేదు. అయినా ప్రజాబలంతో అధికారంలోకి రావాలని రాజాసింగ్ కోరుకోవాలి కాని ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకోవటం, చెప్పటం ఏమిటో అర్ధంకావటంలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతే 39 సీట్లున్న బీఆర్ఎస్ కు అవకాశం ఉంటుందేమో కానీ 8 సీట్లలో గెలిచిన బీజేపీకి ఎలాగ అవకాశముంటుంది ?