బీఆర్ఎస్ చేజేతులా.. కీలక నేతలను వద్దనుకుని భంగపాటు!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు ప్రధాన సామాజికవర్గాలకు చెందిన నాయకులు తుమ్మల నాగేశ్వరావు రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి
By: Tupaki Desk | 3 Dec 2023 8:45 AM GMTవరుసగా రెండుసార్లు గెలిచిన ఆత్మవిశ్వాసమో.. మనకు ఎదురులేదన్న ఉద్దేశమో.. అధికారం ఇచ్చిన అండనో.. అందరినీ సమాధానపరచలేం అన్న భావననో..? మొత్తానికి ఈ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పలువురు కీలక నాయకులను దూరం చేసుకుంది. అది కూడా ఒకటిరెండు జిల్లాల్లో కాదు.. ప్రతి జిల్లాలోనూ ఒక్క నాయకుడినైనా వదులుకుంది. వీరిలో కొందరు కొన్ని నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలవారు కావడం గమనార్హం.
తుమ్మల, పొంగులేటిని విస్మరిస్తారా?
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు ప్రధాన సామాజికవర్గాలకు చెందిన నాయకులు తుమ్మల నాగేశ్వరావు రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వీరిలో తుమ్మలది 40 ఏళ్ల రాజకీయ అనుభవం. పలుసార్లు మంత్రిగానూ చేశారు. ఉమ్మడి ఖమ్మం వ్యాప్తంగా బలం ఉన్నవారు. కేసీఆర్ కు సమకాలీకుడు కూడా. ఇక పొంగులేటి మాజీ ఎంపీ. దాదాపు సొంత బలంతో 2014లో ఎంపీగా గెలిచిన సత్తా ఆయన సొంతం. అలాంటి వీరిద్దరినీ పువ్వాడ అజయ్ కుమార్ కోసం వదులుకుంది బీఆర్ఎస్. అందరికీ సమాధానం చెప్పలేం.. సర్దుబాటు చేయడం రాజకీయాల్లో సాధ్యం కాదని అనుకున్నా.. వీరిద్దరిలో ఒక్కరినైనా సర్దుబాటు చేయాల్సింది. అలా కాకపోగా.. తుమ్మల, పొంగులేటి వైరాలు మరిచి కాంగ్రెస్ లో చేరారు. ఉమ్మడి ఖమ్మంలో బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోయింది అంటే.. అది తుమ్మల, పొంగులేటి ప్రభావమే అని కచ్చితంగా చెప్పొచ్చు.
జూపల్లినీ వద్దనుకుని..
ఉమ్మడి మహబూబ్ నగర్ లో సీనియర్ నేత జూపల్లి క్రిష్ణారవు. కొల్లాపూర్ లో 1999 నుంచి 2014 వరకు ఓటమే లేదు. కానీ, 2018లో పరాజయం పాలయ్యారు. ఈయనపై గెలిచిన హర్షవర్ధన్ రెడ్డిని బీఆర్ఎస్ దగ్గరకు తీసింది. జూపల్లిని పక్కనపెట్టింది. దీంతో జూపల్లి తనలాంటి బాధితుడే అయిన పొంగులేటితో కలిసి నడిచారు. కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడాయన కొల్లాపూర్ లో విజయం సాధించారు. ఇక కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు కూడా ప్రభావవంతమైన నాయకుడే. ఆయనకు టికెట్ ఇవ్వకుండా బొల్లం మల్లయ్య యాదవ్ పై నమ్మకం ఉంచారు. చందర్ రావు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ లో ప్రేమ్ సాగర్ రావు దీ ఇదే బాట.
మల్కాజ్ గిరి.. మైనంపల్లి
ఉమ్మడి మెదక్ గా ఉన్నప్పుడు మెదక్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన నాయకుడు మైనంపల్లి హనుమంతరావు. ఆయన 2009 తర్వాత మల్కాజ్ గిరి పై ఫోకస్ పెట్టారు. 2018లో గెలిచారు. అలాంటి మైనంపల్లి తన కుమారుడికి మెదక్ టికెట్ కోసం పట్టుబట్టారు. ఆయనకు టికెట్ ఇచ్చినా కుమారుడికి మాత్రం ఇవ్వలేని పరిస్థితి బీఆర్ఎస్ ది. దీంతో మైనంపల్లి తనకు ఆశ కల్పించి విస్మరించారని విమర్శిస్తూ బీఆర్ఎస్ ను వీడారు. కాంగ్రె లో చేరి రెండు టికెట్లు తెచ్చుకున్నారు. ఇలా చెప్పుకొంటూ పోతే.. పలు జిల్లాల్లో ద్వితీయ శ్రేణి కేడర్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరింది.