Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ దాడులు.. ఇంతకీ ఎవరా నేత?

ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేసిన వేళ.. అధికార బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే ఇంట్లో జరిగిన ఐటీ సోదాల విషయం గుట్టుగా ఉంచేస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది

By:  Tupaki Desk   |   6 Oct 2023 4:49 AM GMT
బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ దాడులు.. ఇంతకీ ఎవరా నేత?
X

ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేసిన వేళ.. అధికార బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే ఇంట్లో జరిగిన ఐటీ సోదాల విషయం గుట్టుగా ఉంచేస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ మహానగరంలోని ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో పెద్ద ఎత్తున సోదాల్ని చేపట్టారు. అంతేకాదు.. నగరంలోని వివిధ కార్యాలయాల్లోనూ దాడులు చేపట్టినట్లుగా తెలుస్తోంది. నగరంలోని పలు కార్యాలయాలతో పాటు.. శివార్లలోని చిట్ ఫండ్ కంపెనీలే లక్ష్యంగా వంద టీంలు ఏక కాలంలో ఐటీ సోదాలు చేపట్టినట్లుగా తెలుస్తోంది.

హైదరాబాద్ నగరంలోని మొత్తం పద్నాలుగు ప్రాంతాల్లో ఈ తనిఖీలు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. కొందరు వ్యాపారవేత్తల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు. కూకట్ పల్లిలోని ఇందూ ఫార్చూన్ ఫీల్డ్స్.. యూసఫ్ గూడలోని పూజా క్రిష్ణ చిట్ ఫండ్స్.. శంషాబాద్ లోని ఈకాం కంపెనీ మేనేజర్ ఇంటితో పాటు కొందరు కాంట్రాక్టర్ల ఇళ్లల్లోనూ సోదాలు జరిగాయి.

తాజాగా జరిగిన ఐటీ దాడులు అధికార పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. జూబ్లీహిల్స్.. బంజారాహిల్స్.. అమీర్ పేట.. ఎల్లారెడ్డి గూడ.. యూసఫ్ గూడ.. కేపీహెచ్ బీ కాలనీతో పాటు శంషాబాద్ తో సహా వివిధ ప్రాంతాల్లో సోదాల్ని చేపట్టారు. కీలక ఎన్నికలు రోజుల్లోకి వచ్చేసిన వేళ.. చోటు చేసుకున్న ఈ సోదాలు హాట్ టాపిక్ గా మారాయి. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే నివాసంలో సోదాలు జరిగినా.. ఆ వివరాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకోవటం ఏమిటన్నది ప్రశ్నగా మారింది. ఐటీ శాఖ సైతం దీనికి సంబంధించిన ఎలాంటి నోట్ రిలీజ్ చేయలేదని చెబుతున్నారు. ఇంత గుట్టుచప్పుడు కాకుండా ఉండటంపై ఆసక్తి వ్యక్తమవుతోంది. ఇంతకూ ఎవరా అధికార పార్టీ ఎమ్మెల్యే అన్నది చర్చగా మారింది.

విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సెంట్రల్ హైదరాబాద్ లోని ఒక ఎమ్మెల్యే అని.. మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. 2014 ఎన్నికల తర్వాత పార్టీలోకి మారిన ఎమ్మెల్యేగా చెబుతున్నారు. ఎన్నికల వేళ జరిగిన ఈ సోదాల సమాచారం బయటకు పొక్కితే ఇబ్బందికరంగా మారుతుందన్న ఉద్దేశంతో గుట్టుగా ఉంచినట్లుగా చెబుతున్నారు.