Begin typing your search above and press return to search.

కేసీయార్ స్పీచుల్లో పెద్దగా పస కనబడటంలేదట!

రోజుకు మూడు నియోజకవర్గాల్లో బహిరంగసభల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికి సుమారు 60 నియోజకవర్గాల్లో ప్రచారాన్ని పూర్తిచేశారు.

By:  Tupaki Desk   |   15 Nov 2023 11:30 AM GMT
కేసీయార్ స్పీచుల్లో పెద్దగా పస కనబడటంలేదట!
X

ఇపుడిదే అంశంపై బీఆర్ఎస్ పార్టీలో చర్చ బాగా పెరిగిపోతోంది. అభ్యర్ధులను అన్నీ పార్టీలకన్నా ముందే ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల ప్రచారంలోకి వెళ్ళద్దని కేసీయారే ఆదేశించారు. పదిరోజుల తర్వాత ప్రచారం చేసుకోమని చెప్పారు. దాంతో అభ్యర్ధులందరు ప్రచారంలోకి దిగేశారు. అక్టోబర్ 15వ తేదీ నుండి కేసీయార్ స్వయంగా ప్రచారానికి శ్రీకారంచుట్టారు. రోజుకు మూడు నియోజకవర్గాల్లో బహిరంగసభల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికి సుమారు 60 నియోజకవర్గాల్లో ప్రచారాన్ని పూర్తిచేశారు.

రెండు రోజుల క్రితమే రెండో విడత ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. ఇదే సమయంలో అభ్యర్ధులు కూడా చాలా జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇన్నిరకాలుగా పార్టీ జనాల్లోకి వెళుతున్నా ఆశించిన స్ధాయిలో జనాల్లో సానుకూల స్పందన కనబడటంలేదనే టాక్ పెరిగిపోతోంది. కారణం ఏమిటంటే కేసీయార్ స్పీచుల్లో పెద్దగా పస కనబడటంలేదట. ఎంతసేపు చేసిన ఆరోపణలనే మళ్ళీ మళ్ళీ చేస్తుండటం, పదేళ్ళ పాలనలో అవినీతి, అరాచకాలు పెరిగిపోవటమే కారణమని సమాచారం. అవినీతికి, అరాచకాలకు పాల్పడిన సిట్టింగ్ ఎంఎల్ఏలకే కేసీయార్ మళ్ళీ టికెట్లు ఇవ్వటంతోనే జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోతోంది.

ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోవటంతో బ్యారేజి కుంగింది. ఈ విషయమై జనాల్లో బాగా నెగిటివ్ ప్రచారం పెరిగిపోయింది. దీనిపై ఏమి మాట్లాడలో తెలీక అసలా విషయమై ఎక్కడా కేసీయార్ ప్రస్తావించటంలేదు. కాంగ్రెస్, బీజేపీపైన పసలేని ఆరోపణలు చేస్తున్నారని జనాలు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో కూతురు కవిత అరెస్టును తప్పించేందుకు బీజేపీతో కేసీయార్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారన్న కాంగ్రెస్ ఆరోపణలను జనాలు నమ్ముతున్నారు.

దాంతో ఒకేసారి ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందనే మౌత్ ప్రచారం బాగా పెరిగిపోతోంది. ఇదే విషయంపై ఇపుడు పార్టీలో కూడా చర్చ పెరిగిపోతోంది. దీనికితోడు కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు, విమర్శలు జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి. రేవంత్ ఆరోపణలు, విమర్శలు పదునుతేలినట్లు జనాభిప్రాయం. ఇలాంటి అనేక కారణాలతో బీఆర్ఎస్ గ్రాఫ్ పెరగలేదనే చర్చలు పెరిగిపోతున్నాయి. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.