Begin typing your search above and press return to search.

క్విడ్‌ ప్రో కో అంటే ఇదేనా కేటీఆర్‌?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   22 March 2024 10:30 AM GMT
క్విడ్‌ ప్రో కో అంటే ఇదేనా కేటీఆర్‌?
X

ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రూ.100 కోట్ల మనీలాండరింగ్‌ లో కవిత ప్రమేయానికి సంబంధించి పక్కా ఆధారాలు ఉన్నాయని ఈడీ చెబుతోంది.

మరోవైపు కవిత అన్న, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నీతి సూక్తులు, ధర్మ పన్నాలు, నైతిక విలువలు అంటూ ధర్మోపదేశాలు చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమపై కక్ష సాధిస్తోందని ఆరోపిస్తున్నారు. అధికారం పోయినా.. ఆయనలో రాచరిక అహంభావ ఛాయలు పోలేదని కాంగ్రెస్, బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్టోలర్‌ బాండ్స్‌ వ్యవహారం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) జారీ చేసిన ఎలక్టోరల్‌ బాండ్స్‌ ద్వారా వివిధ కంపెనీలు వందల కోట్ల రూపాయలను ఆయా పార్టీలకు విరాళాల రూపంలో అందించాయని అభియోగాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ క్రమంలో తెలంగాణలో కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ కు కూడా భారీ ఎత్తున ఎలక్టోరల్‌ బాండ్స్‌ రూపంలో వందల కోట్ల రూపాయలు విరాళాలుగా అందాయని వెల్లడైంది. అయితే ఇప్పుడు ఇందులో క్విడ్‌ ప్రోకో (నీకేంటి.. నాకేంటి) కూడా ఉందని చెబుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన టెక్స్‌ టైల్‌ గ్రూపు.. కిటెక్స్‌.. బీఆర్‌ఎస్‌ పార్టీకి రూ.25 కోట్లు విరాళంగా ఇచ్చిందని తేలింది. ఒక పార్టీకి విరాళం ఇవ్వడంలో ఏ తప్పూ లేకపోయినా.. విరాళమిచ్చినందుకు ప్రతిఫలంగా ఈ సంస్థకు గత కేసీఆర్‌ ప్రభుత్వం భూములు కట్టబెట్టడమే వివాదం రేపుతోంది.

కిటెక్స్‌ సంస్థ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు నవంబర్‌ లో బీఆర్‌ఎస్‌ కు రూ.25 కోట్లు విరాళమిచ్చింది. ఇందుకు ప్రతిఫలంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట హవేలిలో కాకతీయ టెక్స్‌ టైల్‌ పార్కు కోసం రైతుల నుంచి సేకరించిన 187 ఎకరాల భూమిని కిటెక్స్‌ సంస్థకు అప్పనంగా కట్టబెట్టింది.

ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత విరాళమిచ్చిందో వెల్లడవుతుండటంతో బీఆర్‌ఎస్‌ ఇరుకునపడింది. తాము తెలంగాణ అభివృద్ధికి నిజమైన కర్మ, కర్త, క్రియలమంటూ చెప్పుకుంటూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన పనులేంటో బయటపడుతున్నాయి. తమ పార్టీకి రూ.25 కోట్ల విరాళం ఇచ్చినందుకు కేసీఆర్‌ ప్రభుత్వం అప్పనంగా 187 ఎకరాల రైతుల భూములను క్రిటెక్స్‌ కు కట్టబెట్టిందని తేటతెల్లమైంది. మరి దీన్ని క్విడ్‌ ప్రోకో కాక ఏమంటారో చెప్పాలని కేటీఆర్‌ ను ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి.