Begin typing your search above and press return to search.

రూ.2 కోట్లు ఖర్చు.. టికెట్ దక్కక తీవ్ర నిరాశలో ఆ ఉన్నతాధికారి

తెలంగాణలో అధికార పార్టీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన సీనియర్ అధికారి ఒకరు ఇప్పుడు తీవ్ర నిరాశలో ఉన్నట్లుగా సమాచారం

By:  Tupaki Desk   |   7 Oct 2023 6:57 AM GMT
రూ.2 కోట్లు ఖర్చు.. టికెట్ దక్కక తీవ్ర నిరాశలో ఆ ఉన్నతాధికారి
X

తెలంగాణలో అధికార పార్టీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన సీనియర్ అధికారి ఒకరు ఇప్పుడు తీవ్ర నిరాశలో ఉన్నట్లుగా సమాచారం. ఎంతో హడావుడి చేసి ఇక టికెట్ నాకే అని ధీమా వ్యక్తం చేసి.. ఫ్లెక్సీలు కట్టి బ్యానర్లు పెట్టిన ఆ ఉన్నతాధికారి ఇప్పుడంతా రివర్స్ అయ్యేసరికి మౌనం దాల్చారు. వాస్తవానికి తెలంగాణలో ఆ నియోజకవర్గం కొంత ప్రత్యేకమైనది. అధికార బీఆర్ఎస్ కు 2014లో ఆ జిల్లాలో దక్కిన ఏకైక నియోజకవర్గం అది. దీనికి కారణం అది తెలంగాణ వాదం పెద్దగా లేని జిల్లా కావడమే. అయితే, ఆ తర్వాత వేరే పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలను చేర్చుకుని, మరో సీనియర్ నాయకుడిని చేరదీసి.. అత్యంత బలోపేతం అయింది. 2018 నాటికి పటిష్ఠంగా కనిపించినా.. వర్గ పోరుతో ఆ జిల్లాలో మళ్లీ ఒక్క సీటుకే పరిమితమైంది.

ఓడి గెలిచిన సీటు

2018 ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ అభ్యర్థి ఆ నియోజకవర్గంలో పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినప్పటికీ, చివరకు బీఆర్ఎస్ లో చేరారు. అలా ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఓడి గెలిచినట్లయింది. చిత్రమేమంటే.. ఇటీవల కోర్టు తీర్పు రీత్యా అక్కడి ఎమ్మెల్యే ఎన్నిక రద్దయింది. కానీ, ఆ ఎమ్మెల్యే సుప్రీం కోర్టు వరకు వెళ్లి ఉపశమనం పొందారు. కాగా, ఇదే నియోజకవర్గంపై కన్నేసిన తెలంగాణ ఉన్నతాధికారి ఒకరు చాలా హంగామా చేశారు. తన సొంత ప్రాంతం అదే కావడంతో అక్కడ సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఓ ఉన్నతాధికారిగా కాకుండా రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తున్నట్లు ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చినా ఎక్కడా తగ్గలేదు. అధినేతకు పాదాభివందనం సహా రాజకీయంగా ప్రకటనలు చేస్తూ వివాదాస్పదుడయ్యారు. అయినా, అసెంబ్లీ టికెట్ వస్తుందనే ఆశతో వీటన్నిటినీ భరించారు.

చివరకు సిటింగ్ కే అవకాశం

కుమారుడిపై తీవ్ర ఆరోపణలు వచ్చిన్నప్పటికీ బీఆర్ఎస్ అధిష్ఠానం సిటింగ్ ఎమ్మెల్యేకే టికెట్ ఇవ్వడంతో ఆ ఉన్నతాధికారి హతాశుడైనట్లు సమాచారం. వాస్తవానికి ఎమ్మెల్యే కుమారుడి మీద వచ్చిన అభియోగాల నేపథ్యంలో టికెట్ తనకే వస్తుందని ఆ ఉన్నతాధికారి మనసులో అంచనా వేసుకున్నారు. ఆయన సామాజికవర్గం ఓట్లు కూడా అక్కడ ఎక్కువగా ఉండడంతో తనకు టికెట్ అని కూడా పెద్దఎత్తున అంచనా వేసుకున్నారు. దీనికితోడు మూడేళ్ల కిందట విపత్తు సంభవించినప్పుడు తరచూ మీడియా ముందుకు వచ్చి ప్రజలను చైతన్యవంతులను చేసిన ఆయన చాలా ఫేమస్ అయ్యారు. ఈ మేరకు వచ్చిన పేరునూ ఎన్నికల్లో టికెట్ దక్కేందుకు ఉపయోగించుకుందామని భావించారు. కానీ, అదేమీ జరగలేదు.

రూ.2 కోట్లు పాయె..

'కొత్త' అభ్యర్థిగా తనకు టికెట్ ఖాయమని నమ్మిన ఉన్నతాధికారి నియోజకవర్గంలో ఏకంగా రూ.2 కోట్ల వరకు ఖర్చు చేసినట్లుగా సమాచారం. సమావేశాలు, ఫ్లెక్సీలు, సామాజిక సేవా కార్యక్రమాలు, పర్యటనలు తదితర కార్యక్రమాలకు ఈ డబ్బంతా ఖర్చు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇంతచేసినా టికెట్ మాత్రం దక్కకపోవడంతో ఆయనలో నిరాశ ఆవహించిందని.. ఇటీవల బయట ఎక్కడా కనిపించనిది అందుకేనని తెలుస్తోంది.

ఇంకా చాన్సుంది..

తెలంగాణలో సింగరేణి ప్రభావం ఉండే ఆ నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే వయోధికుడు. ఈసారి ఆయనకు టికెట్ రాదని తొలుత భావించారు. అయితే వచ్చినప్పటికీ ఇదే చివరిసారి అని తెలుస్తోంది. ఇక సిటింగ్ ఎమ్మెల్యేపై పోటీ చేసి ఓడిన అభ్యర్థి నియోజకవర్గానికి ఎప్పుడో కాని రారు అనే పేరుంది. ఈ నేపథ్యంలో చక్కగా ప్లాన్ చేసుకుంటే ఆ ఉన్నతాధికారికి వచ్చే ఎన్నికల నాటికైనా అవకాశం ఉండొచ్చు.