Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కొంపముంచుతున్న ఇంటి మ‌నిషి?

మంచిర్యాల జిల్లా చెన్నురు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే మందమర్రిలో తాజాగా అమానుష ఘటన చోటుచేసుకుంది

By:  Tupaki Desk   |   4 Sep 2023 6:18 AM GMT
కేసీఆర్‌ కొంపముంచుతున్న ఇంటి మ‌నిషి?
X

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఓట్ల లెక్కలు, రాజకీయ ఎత్తుగడల విషయంలో పాలిటిక్స్ గురించి కనీస అవగాహన ఉన్న వారెవ‌రికీ సందేహాలు ఉండవు. ఎందుకంటే, అంతటి వ్యూహాలు ఆయన సొంతం. అయితే ప్రస్తుతం తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాలు రాష్ట్రంలో కీలకమైన వ‌ర్గంగా ఉన్న‌ దళితులను పార్టీకి దూరం చేసేలా మారుతున్నాయంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కుటుంబానికి, ఆయన తనయుడు కేటీఆర్ కు అత్యంత నమ్మినబంటుగా ఉన్న ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలో జ‌రుగుతున్న అమాన‌వీయ ఘ‌ట‌న‌లు బీఆర్ఎస్‌కు దిమ్మ‌తిరిగేలా మారుతున్నాయ‌ని చెప్తున్నారు.

మంచిర్యాల జిల్లా చెన్నురు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే మందమర్రిలో తాజాగా అమానుష ఘటన చోటుచేసుకుంది. మేకల మండిలో చోరీకి పాల్పడ్డారని పేర్కొంటూ ఇద్దరు దళితులని తలకిందులుగా విడదీసి వారి మొహాలు కమిలిపోయేలా మంటతో కాల్చిన ఘటన సభ్యసమాజం సిగ్గుపడేలా చేసింది. ఎంతో అమానవీయంగా జరిగిన ఈ దారుణం దళితుల్లో ఆగ్రహావేశాలకు కారణమైంది. సహజంగానే ప్రభుత్వం చర్యలపై అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే అట్రాసిటీ కేసు నమోదుతోనే దర్యాప్తు కొనసాగుతుంది. ఇదే సమయంలో ఈ అంశం రాజకీయ దుమారంగా మారింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి నమ్మినబంటుగా ఉండే మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే సుమన్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గం పరిధిలోకి ఈ మందమర్రి పట్టణం రావ‌డంతో విప‌క్షాలు ఘాటుగా స్పందిస్తున్నాయి. ద‌ళిత సామాజిక‌వ‌ర్గానికే చెందిన సుమన్ ప్రాతినిధ్యం వహిస్తుండడం, అత్యంత అవమానవీయ ఘటనలో దళితులు బాధితులుగా ఉన్న నేపథ్యంలో సుమన్ స్పందన ఏంటి అనేది విపక్షాలు వేస్తున్న ప్ర‌శ్న‌. ఇటీవలే చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఓ రైతు త‌న పొలంలో ఆవు మేసింద‌ని పేర్కొంటూ ఓ ద‌ళితుడిని క‌ట్టేసి కొట్టారు. తాజాగా ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. దీంతో స‌హ‌జంగానే విపక్షాలకు బాల్క‌ సుమన్‌ టార్గెట్ అయ్యారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి సుమన్ సన్నిహితులు కావడంతో సహజంగానే మిగతా పార్టీల సైతం ఈ ఘటనలను అవకాశంగా తీసుకుంటున్నాయి. అమాన‌వీయంగా జ‌రిగిన ఈ ఘటనపై ప్రత్యక్షంగా గాని సోషల్ మీడియా ద్వారా కానీ సుమన్ స్పందించకపోవడంపై సైతం విప‌క్ష పార్టీలు విస్మ‌యం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సమయంలో మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్‌కు చైర్మన్ లేకపోవడాన్ని కూడా ప్రతిపక్ష పార్టీలు త‌ప్పుప‌డుతున్నాయి. కాగా దళిత బంధు ప్రవేశపెట్టడం ద్వారా ఎస్సీ నోట్లను తమ పార్టీకి గంపగుత్తగా పడేలా చేసుకునేందుకు కేసీఆర్ వేసిన వ్యూహాన్ని ఇలాంటి సంఘటనలు ఫలితం ఇవ్వకుండా చేస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.