Begin typing your search above and press return to search.

కేసులు.. ఆరోపణలతో సుర్రుమంటున్న ఆ నియోజకవర్గ రాజకీయం

తెలంగాణ నట్టనడుమున ఉండే నియోజకవర్గం సూర్యపేట. ఇక్కడి నుంచి మంత్రి జగదీశ్ రెడ్డి ఎమ్మెల్యేగా వరుసగా రెండుసార్లు గెలిచారు

By:  Tupaki Desk   |   31 Aug 2023 10:57 AM GMT
కేసులు.. ఆరోపణలతో సుర్రుమంటున్న ఆ నియోజకవర్గ రాజకీయం
X

నట్టనడుమ నల్లగొండ.. ''సుట్టుముట్టు... '' అంటూ తెలంగాణలో నిజాంకు వ్యతిరేకంగా పాడిన పాటల్లో ఆ నియోజకవర్గం పేరుంటుంది.. దీనికితగ్గట్లే ఇప్పుడా నియోజకవర్గ రాజకీయాలను వివాదాలు చుట్టుముట్టాయి. ఇరు వర్గాల వైపు నుంచి ఆరోపణలు కేసులతో అధికార బీఆర్ఎస్ సుర్రుమంటుంది.

రాజకీయాల్లో విభేదాలు సహజం. అది సొంత పార్టీలో ఉన్నా.. వేరే పార్టీ వారయినా సరే.. ఇక ప్రత్యర్థులపై పై చేయి సాధించేందుకు అనుసరించే ఎత్తుగడల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి ప్రయత్నమే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఆ కీలక నియోజకవర్గంలో జరిగింది. అయితే ఇది అనుకోని మలుపు తిరిగింది.

బీఆర్ఎస్ టికెట్ లొల్లి

తెలంగాణ నట్టనడుమున ఉండే నియోజకవర్గం సూర్యపేట. ఇక్కడి నుంచి మంత్రి జగదీశ్ రెడ్డి ఎమ్మెల్యేగా వరుసగా రెండుసార్లు గెలిచారు. తెలంగాణ ప్రభుత్వంలో ఆయనది కీలక పాత్ర. బీఆర్ఎస్ అదినేత, సీఎం కేసీఆర్ కు ఆయన అత్యంత సన్నిహితులు. జగదీశ్ రెడ్డికి పార్టీలోనూ గట్టి పట్టుంది. కాగా, ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ సూర్యపేట టికెట్ ఆశించారు. కానీ, బీఆర్ఎస్ నుంచి జగదీశ్ రెడ్డి కే టికెట్ దక్కింది. అయితే ఇక్కడే కథ మలుపు తిరిగింది.

జానయ్య దందాలు.. ఆయనపై కేసులు

సూర్యపేట నాయకుడిగా ఉన్న జానయ్య రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నయ్య తమను మోసం చేసి భూములు గుంజుకున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు. 2006లో సూర్యపేటలో 11 ఎకరాలను జానయ్య లే అవుట్ వేసి విక్రయించారని.. వాటిని తాము కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పటికీ జానయ్య అధికార బలంతో బినామీ పేర్ల కింద రిజిస్రేషన్ చేయించుకున్నారని కొందరు చెబుతున్నారు. కాగా , ఇదే ఆరోపణలో జానయ్యపై ఆరేడు కేసులు నమోదయ్యాయి. పదుల సంఖ్యలో కేసులు పెట్టినట్లు ఆరోపణలు వస్తున్నా అది వాస్తవం కాదని తెలుస్తోంది.

మంత్రి పై సంఘాల ఆరోపణలు

జానయ్య మీద కేసుల నమోదు వెనుక మంత్రి జగదీశ్ రెడ్డి హస్తం ఉందని బీసీ, యాదవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఒకప్పటి అనుచరుడైన ఆయన వ్యవహారాలు మంత్రికి తెలియకుండానే సాగాయా? అని ప్రశ్నిస్తున్నాయి. మొత్తానికి ఇలా సూర్యపేట రాజకీయం రంజుగా మారింది. చివరకు మంత్రి-జానయ్య మధ్య సయోధ్య కుదురుతుందో లేదో చూడాలి.