Begin typing your search above and press return to search.

ఎన్టీయార్ ని గుర్తుకు తెచ్చిన కేసీయార్....భయపెడుతున్న యాంటీ సెంటిమెంట్...?

కేసీయార్ డిప్యూటీ స్పీకర్ గా ఉంటూ సిద్ధిపేటలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఆనాటి సాహసం

By:  Tupaki Desk   |   23 Aug 2023 3:41 AM GMT
ఎన్టీయార్ ని గుర్తుకు తెచ్చిన కేసీయార్....భయపెడుతున్న యాంటీ సెంటిమెంట్...?
X

కేసీయార్ జనం నాయకుడు. ఉద్యమ నాయకుడు. ఆయన ఎన్ని సార్లు తెలంగాణా నలుగు చెరగులలో తిరిగారో చెప్పడానికి లెక్క లేదు. ఆయన గ్రామ పంచాయతీ వార్డు నుంచి కూడా కలియతిరిగారు గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ ఆయన కంటే ఎవరికీ ఎక్కువగా తెలియవు అంటారు. జగన్ గుండె చప్పుడుని పట్టుకున్న నేతగా కేసీయార్ ని చెబుతారు. అలాంటి కేసీయార్ తీసుకున్న ఆవేశ పూరిత నిర్ణయాలు అనేకం. అవన్నీ ఉమ్మడి ఏపీని ఏలిన మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీయార్ ని గుర్తుకు తెస్తాయి.

కేసీయార్ డిప్యూటీ స్పీకర్ గా ఉంటూ సిద్ధిపేటలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఆనాటి సాహసం. అప్పట్లో చంద్రబాబు బలమైన సీఎం. అలా నాటి నుంచి నేటి వరకూ కేసీయార్ తీసుకున్న ఎన్నో నిర్ణయాలు సక్సెస్ అయ్యాయి. ఒకసారి మాత్రం అంటే వైఎస్సార్ ఏలుబడిలో తన ఎమ్మెల్యేలు అందరి చేత రాజీనామా చేయిస్తే కొందరు ఓడి షాక్ తినిపించిన సందర్భాన్ని చూశారు.

ఇక చూస్తే కేసీయార్ కి 2014 ఎన్నికల్లో ఎందుకో కొంత డౌట్ ఉందేమో అందుకే మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేస్తూ గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే 63 సీట్లతో నాడు టీయారెస్ గెలవడంతో కేసీయార్ తెలంగాణా తొలి సీఎం గా ప్రమాణం చేసి రికార్డు సృష్టించారు. ఇక ఆ తరువాత 2018లో ముందస్తు ఎన్నికలకు సిద్ధపడి ఆయన మరో సాహసానికి తెర తీశారు.

నిజానికి దేశంలో మిగిలిన రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా తెలుగునాట ముందస్తు ఎన్నికలు ఎవరికీ అచ్చి రాలేదు. అలా ఎన్టీయార్, చంద్రబాబు ఓడిన ఉదంతాలు ఉన్నా కేసీయార్ ఆ యాంటీ సెంటిమెంట్ ని చేదించి మరీ ముందస్తు ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఏకంగా 88 సీట్లతో రెండవ మారు అధికారంలోకి వచ్చారు.

ఇక ఇపుడు చూస్తే దాదాపుగా తొమ్మిదిన్నరేళ్ల తరువాత అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్ధులను ప్రకటించడం దుస్సాహసం అని అంటున్నారు. పైగా కేసీయార్ పార్టీలో ఉన్న 105 మంది ఎమ్మెల్యేలలో సగానికి సగం అంటే 50 మంది దాకా తీవ్ర వ్యతిరేకత జనంలో ఎదుర్కొంటున్నారు. వారికి టికెట్లు కష్టం, ఇచ్చినా గెలుపు డౌట్ అని సర్వే నివేదికలు చెప్పినా కేసీయార్ డేరింగ్ గా వారికే టికెట్లు ఇవ్వడం అంటే అంతా ఆశ్చర్యపోతున్న పరిస్థితి.

ఇదే రకంగా 1989లో అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం ఎన్టీయార్ మొత్తానికి మొత్తం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చారు. ఆనాడు వారి పనితీరు మీద జనంలో వ్యతిరేకత ఉన్నా కూడా ఎన్టీయార్ తన మీద అతి నమ్మకంతో టికెట్లు ఇచ్చారు. అలాగే తాను హిందూపురంతో పాటు మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి నుంచి పోటీ చేసారు. ఇలా రెండు చోట్ల పోటీ చేస్తే కేవలం హిందూపురం దక్కింది. కల్వకుర్తి లో ఓటమి పలకరించింది.

కేసీయార్ కూడా తన రాజకీయ జీవితంలో మొదటి సారి రెండు అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తున్నారు. ఆయన 1985 నుంచి ప్రతీ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. అలా ఆయన 1999 వరకూ టీడీపీ తరఫున సిద్ధిపేట నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు 2001లో జరిగిన ఉప ఎన్నికల్లో సిద్ధిపేట నుంచి టీయారెస్ నుంచి గెలిచి అయిదు సార్లు జై కొట్టించుకున్నారు.

ఆ మీదట ఆయన 2004 నుంచి 2009 దాకా ఎంపీగా మహబూబ్ నగర్ కరీం నగర్ వంటి చోట్ల పోటీ చేసి గెలిచారు. ఇక 2014, 2018లలో గజ్వేల్ నుంచి పోటీ చేశారు. ఈసారి గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి పోటీ పడుతున్నారు. ఇది కేసీయార్ కి కొత్త అనుభవం. పైగా సిట్టింగులను అందరికీ టికెట్లు ఇచ్చి గెలిపించుకోవాలనుకోవడం మరో బిగ్ టాస్క్. దీన్ని కేసీయార్ ఎలా అధిగమిస్తారు అన్నదే ఇపుడు అందరి మదిలో మెదులుతున్న ఆలోచన. నాడు ఎన్టీయార్ ఈ ఫీట్ లో ఫెయిల్ అయి యాంటీ సెంటిమెంట్ ని ముందుంచారు.

మరి దాన్ని కేసీయార్ చేదిస్తారా అన్నదే ప్రశ్నగా ముందుకు వస్తోంది. అయితే కేసీయార్ అపర రాజకీయ చాణక్యుడు. ఆయన డేరింగ్ వెనక విపక్షాల చీలిక వ్యవహారం ఉంది. బీజేపీ కాంగ్రెస్ పోటీ పడి రెండవ ప్లేస్ లోనే ఉంటాయని, మళ్లీ తానే హ్యాట్రిక్ కొడతాను అన్న ధైర్యమే ఆయన్ని ఈ సాహసానికి పురిగొల్పింది అని అంటున్నారు. సో కేసీయార్ హ్యాట్రిక్ విక్టరీ సాధిస్తే ఆయనను మించిన బహు మొనగాడు వేరొకరు ఉండరని భావించాల్సిందే.