Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ పై ఎందుకు దాడి చేశారు? అసలేమైంది?

రాజకీయ కక్షలు కొత్తేమీ కాదు. మామూలుగా ఒక పార్టీపై మరో పార్టీ దాడులు చేసుకుంటూనే ఉంటాయి

By:  Tupaki Desk   |   13 March 2024 5:23 PM IST
బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ పై  ఎందుకు దాడి చేశారు? అసలేమైంది?
X

రాజకీయ కక్షలు కొత్తేమీ కాదు. మామూలుగా ఒక పార్టీపై మరో పార్టీ దాడులు చేసుకుంటూనే ఉంటాయి. ఈ కోణంలో హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ పై గత రాత్రి యూసుఫ్ గూడ చెక్ పోస్ట్ వద్ద దాడి జరిగింది. కొందరు మహిళలు ఆమెను అడ్డగించి ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఫ్లెక్సీల తొలగించే క్రమంలో ఈ వివాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ దేదీప్య రావుకు కొందరు ఫోన్ చేసి తమ ప్రాంతంలో మున్సిపల్ అధికారులు ఫ్లెక్సీలు తొలగిస్తున్నారని సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె అక్కడకు బయలుదేరిన కొద్ది సేపటికే ఆ కాలనీ మహిళలు సుమారు 40 మంది ఆమెను అడ్డగించారు. దీంతో గొడవ ముదిరి దాడికి దారి తీసింది.

ఇందులో కాంగ్రెస్ నాయకుల హస్తం ఉందని ఆమె ఆరోపిస్తున్నారు. కావాలనే తనపై దాడి చేయించారని ఆమె జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనపై దాడి జరుగుతుంటే ఆపాల్సింది పోయి చాలా మంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారని అక్కసు వెళ్లగక్కింది. ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

మహిళా కార్పొరేటర్ అయిన తనకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. కాంగ్రెస్ నాయకుల ప్లాన్ లో భాగంగానే తనపై ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని వాపోయింది. మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తనపై జరుగుతున్న దాడిని ఆపకపోయినా వీడియోలు తీయడంపై నిరసన వ్యక్తం చేసింది.

దీనికి కారణమైన వారిని అంత తేలికగా విడిచిపెట్టబోమని తేల్చింది. కుట్రపూరితంగా దాడికి పాల్పడంపై కన్నీటి పర్యంతమైంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన మహిళా కార్పొరేటర్ కు జరిగిన అవమానంగా అభివర్ణించింది. మహిళలపై దాడులు చేయించడం కాంగ్రెస్ కు ఉన్న అలవాటే అని ఆరోపించింది. ఈ ఘటన నగరంలో సంచలనంగా మారింది.