Begin typing your search above and press return to search.

బీఫారాలు ఇవ్వకుండా అభ్యర్థులకు షాకివ్వనున్న బీఆర్ఎస్.. కాంగ్రెస్!

ఇప్పటివరకు కాంగ్రెస్ 100 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. మిగిలిన 19 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సి ఉంది. దీనిపై పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతోంది.

By:  Tupaki Desk   |   6 Nov 2023 4:31 AM GMT
బీఫారాలు ఇవ్వకుండా అభ్యర్థులకు షాకివ్వనున్న బీఆర్ఎస్.. కాంగ్రెస్!
X

ఎన్నికల వేళ చోటు చేసుకునే కొన్ని సిత్రాలు అనూహ్యంగా ఉంటాయి. మిగిలిన రంగాలతో పోలిస్తే రాజకీయ రంగంలో ఎప్పుడైనా.. ఏమైనా జరగొచ్చు. అంతేకాదు.. కొందరు నేతలకు లక్ అలా వచ్చి ఇలా పోతుంటుంది. మరికొందరికి ఇందుకు భిన్నంగా బ్యాడ్ లక్ వెంటాడుతుంటుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించిన కొన్ని స్థానాలకు మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం జోరందుకుంది. ఇందుకు తగ్గట్లే.. అభ్యర్థుల్ని ప్రకటించిన అధికార బీఆర్ఎస్ తో పాటు విపక్ష కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు ఆసక్తికరంగా మారింది. కొందరు అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తోంది.

ఇప్పటివరకు కాంగ్రెస్ 100 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. మిగిలిన 19 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సి ఉంది. దీనిపై పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతోంది. నామినేషన్ల ప్రక్రియ మొదలై.. పలువురు నామినేషన్లు వేస్తున్న వేళలో.. ఇంకా అభ్యర్థుల్ని ఫైనల్ చేయకపోవటంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఉత్కంట అంతకంతకూ పెరుగుతోంది. టికెట్ ఆశావాహుల పరిస్థితి చెప్పాల్సిన అవసరమే లేదు. మరో జాబితా ఈ రోజు (సోమవారం) విడుదల అవుతుందని చెబుతున్నారు. ఈ రోజు విడుదలయ్యే జాబితాతో పాటు మరో జాబితా కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే కొడంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ ను అనూహ్యంగా నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నుంచి కూడా బరిలోకి దింపుతున్నట్లుగా చెబుతున్నారు. ఇదే స్థానం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అదే జరిగితే..మొత్తం ఎలక్షన్ లో ఈ నియోజకవర్గం హైలెట్ కావటం ఖాయం. ఈ స్థానం నుంచి సీటు ఆశిస్తున్న మాజీ మంత్రి షబ్బీర్ అలీకి నిజామాబాద్ అర్బన్ పేరు ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు. బాన్సువాడలో బాలరాజు.. ఏనుగు రవీందర్ రెడ్డిల మధ్య పోటీ ఉంది. పటాన్ చెర్వులో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన కాట శ్రీనివాస్ పేరుతో పాటు నీలం మధు పేరు వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే ప్రకటించిన 100 స్థానాల్లోని అభ్యర్థుల్లో కొందరిని మార్చే వీలుందన్న మాట వినిపిస్తోంది. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ప్రకటించిన వంద స్థానాల్లో ఐదారు స్థానాల్లో అభ్యర్థులు మారే వీలుందన్న మాట వినిపిస్తోంది. ఇందులో ఉమ్మడి మహబూబ్ నగర్ తో పాటు.. రంగారెడ్డి.. అదిలాబాద్ జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో.. మరింత ఉత్కంట పెరుగుతోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో అందరి కంటే ముందు అభ్యర్థుల్ని ఫైనల్ చేసిన అధికార బీఆర్ఎస్ లోనూ విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించి.. పలువురు నామినేషన్లు వేసినప్పటికి.. అందుకు భిన్నంగా కొందరు అభ్యర్థులకు మాత్రం ఇప్పటికి బీఫారం ఇవ్వకపోవటం గమనార్హం. అలంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంను అభ్యర్థిగా ప్రకటించినా.. ఇప్పటివరకు బీఫారం ఇవ్వలేదు. ఈ అభ్యర్థిని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి వ్యతిరేకిస్తుండటం.. బీఫారం పెండింగ్ లో పడింది. అంతేకాదు.. హైదరాబాద్ గోషామహల్ లో అభ్యర్థిని ఇంకా ఫైనల్ చేయలేదు. పాతబస్తీలో మజ్లిస్ గెలిచే ఏడు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించినా.. వారికి బీఫారాలు ఇవ్వకుండా పెండింగ్ పెట్టటం ఆసక్తికరంగా మారింది.