బీఆర్ఎస్ దెబ్బేసింది...టీఆర్ఎస్ గానే ఫిక్స్ ?
బీఆర్ఎస్ అని గులాబీ పార్టీకి 2022 ప్రాంతంలో సరికొత్తగా నామకరణం చేశారు. అదే గులాబీ రంగు, అదే కారు, కానీ పేరు మారిపోవడం వల్ల జోరు చేయలేదు, 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అది భారీగా దెబ్బ కొట్టేసింది.
By: Tupaki Desk | 2 Oct 2026 9:09 AM ISTబీఆర్ఎస్ అని గులాబీ పార్టీకి 2022 ప్రాంతంలో సరికొత్తగా నామకరణం చేశారు. అదే గులాబీ రంగు, అదే కారు, కానీ పేరు మారిపోవడం వల్ల జోరు చేయలేదు, 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అది భారీగా దెబ్బ కొట్టేసింది. హ్యాట్రిక్ విజయం తధ్యమని ఎంతో ఆశ పడిన గులాబీ నేతలకు సీన్ రివర్స్ అయింది. దాంతో పాటు తత్వం నెమ్మదిగా బోధపడుతోంది. బీఆర్ఎస్ దెబ్బేసింది అని స్వయంగా కేటీఆర్ అంగీకరించటం విశేషం. కేరళలో జరిగిన ఒక కాంక్లేవ్ లో ఆయన మాట్లాడుతూ ఆ పేరు వల్ల ఇబ్బంది పడ్డామని ఒప్పుకున్నారు. జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించాలన్న ఆలోచనతోనే భారత రాష్ట్ర సమితిగా నామకరణం చేశామని చెప్పారు.
యాంటీ సెంటిమెంట్ గా :
అయితే బీఆర్ఎస్ గా పేరు మార్పుతో పెద్దగా వర్కౌట్ కాకపోగా బూమరాంగ్ అయింది అని గులాబీ పార్టీలో అనేక మంది నాటి నుంచే చెబుతూ వస్తున్నారు. మళ్లీ టీఆర్ఎస్ గానే పేరు మార్పు చేయాలని కూడా అధినాయకత్వాన్ని వారు కోరుతున్నారు. ఇక కేటీఆర్ కూడా ఈ విషయాలు ప్రస్తావించక పోయినప్పటికీ రాజకీయ తప్పిదం జరిగింది అని చెప్పుకొచ్చారు. అయితే పేరు మార్పు జరిగినా పార్టీ డీఎన్ఏ కానీ ఫిలాసఫీ కానీ అన్నీ అలాగే ఉన్నాయని అన్నారు. తమ విధానాలు ఏవీ మారనపుడు పేరు మారినా ఏదీ మారినట్లు కాదని సమర్ధించుకున్నారు. అదే సమయంలో తిరిగి టీఆర్ఎస్ గా పేరు మార్చాలని పార్టీ క్యాడర్ నుంచి డిమాండ్ గట్టిగా ఉందని ఆయన చెప్పారు. దీని మీద మాత్రం కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కేటీఆర్ చెప్పడం విశేషం. ఇక పార్టీ ఫోకస్ ని రీ సెట్ చేసుకోవాలని కూడా ఆయన చెప్పారు.
మార్పుతోనే మంచి తీర్పు :
ఇదే మాట ఇపుడు బీఆర్ఎస్ క్యాడర్ నుంచి వినిపిస్తోంది. బీఆర్ఎస్ కంటే టీఆర్ఎస్ గానే ఉంచితే తెలంగాణా సమాజం సొంతంగా భావిస్తుందని అలాగే రిసీవ్ చేసుకుంటుందని అంటున్నారు. ఆ విధంగా చేయాలని వారు కోరుతున్నారు. అయితే బీఆర్ఎస్ అగ్ర నేతగా ఉన్న కేటీఆర్ నోటి వెంట బీఆర్ఎస్ వల్ల రాజకీయంగా దెబ్బ పడింది అన్న మాట వచ్చింది కాబట్టి కచ్చితంగా టీఆర్ ఎస్ పేరుని పార్టీకి పెట్టి 2028 ఎన్నికలకు వెళ్తారు అని అంటున్నారు. అలాగైతేనే తెలంగాణా సెంటిమెంట్ నిండా ఒంటబట్టి గులాబీ పార్టీ మళ్ళీ గెలుస్తుందని కూడా భావిస్తున్నారు. అయితే ఇప్పుడు కాకపోయినా ఎన్నికల ముందు పార్టీ ప్లీనరీలో ఈ పేరు మార్పుని ఆర్భాటంగా జరిపించి ఆ జోష్ తోనే అసెంబ్లీ సమరానికి సిద్ధం అవుతారు అని అంటున్నారు.
కవితకు షాక్ గా :
అయితే తెలంగాణాలో టీఆర్ఎస్ అని షార్ట్ కట్ లో మరో పార్టీని స్థాపించి కవిత తన రాజకీయాన్ని పరీక్షించుకుంటున్నారు. తెలంగాణా రక్షణ సేన అని ఆమె పార్టీకి పేరు పెట్టారు. ఇపుడు తెలంగాణా రాష్ట్ర సమితిగా తిరిగి పేరు పెట్టుకుని టీఆర్ఎస్ గానే తమకు గుర్తింపు ఇవ్వాలని ఈసీని గులాబీ పార్టీ నేతలు కోరితే ఇబ్బంది పడేది కవిత అని అంటున్నారు. అయితే పెద్ద పార్టీ పాతికేళ్ల వయసు ఉన్న గులాబీ పార్టీ కోరితే అదే జరుగుతుందని అంటున్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గానే కాంగ్రెస్ ని ఎదుర్కోవాలని అచ్చి వచ్చిన పేరుతోనే ముందుకు సాగాలని గులాబీ పార్టీలో అంతర్మధనం సాగుతోంది అని అంటున్నారు.
