Begin typing your search above and press return to search.

కేసీఆర్ వెంటే ఆ ఐదుగురు?

బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయా? రాష్ట్ర రాజకీయాలపై ఈ సభ ప్రభావం చూపుతుందా? అంటే అవుననే సమాధానం బలంగా వినిపిస్తోంది

By:  Tupaki Desk   |   25 April 2025 11:00 PM IST
BRS Jubilee May Reshape Telangana Politics
X

బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయా? రాష్ట్ర రాజకీయాలపై ఈ సభ ప్రభావం చూపుతుందా? అంటే అవుననే సమాధానం బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తిరిగి మాతృసంస్థ బీఆర్ఎస్ లోకి రాబోతున్నారనే ప్రచారం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ వేదికగా ఈ రీఎంట్రీ ఉండబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఎమ్మెల్యేల ఇటీవల కాలంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.., కాంగ్రెస్ పార్టీలో ఇమడలేకపోతున్న ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ క్రమంలోనే వారు కేసీఆర్, కేటీఆర్‌తో సంప్రదింపులు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ ఐదుగురిలో దానం నాగేందర్ ఒకరు. ఇటీవల కాలం వరకు బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేసిన దానం నాగేందర్, ఇప్పుడు కేటీఆర్‌పై సానుకూల ధోరణిని కనబరుస్తున్నారు. బీఆర్ఎస్ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తారని, కేసీఆర్‌ను చాలా కాలం తర్వాత చూడటానికి ప్రజలు ఆసక్తిగా ఉన్నారని, సభ కచ్చితంగా విజయవంతం అవుతుందని మీడియా తో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అంతేకాకుండా, పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ చేసిన రీట్వీట్‌పై కూడా దానం నాగేందర్ స్పందిస్తూ, అందులో తప్పేమీ లేదని, ఆమె నిజాన్నే షేర్ చేశారని వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి.

మరోవైపు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తాను ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేవలం మర్యాదపూర్వకంగానే కలిశానని, తాను కాంగ్రెస్ లో చేరలేదని వాదిస్తున్నారు. బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన ఆయన, ఆ తర్వాత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినప్పటికీ, తాజా పరిణామాల నేపథ్యంలో తిరిగి బీఆర్ఎస్ లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

గతంలోనే పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా తిరిగి బీఆర్ఎస్ లోకి రావాలని చూస్తున్నారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరితో పాటు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా బీఆర్ఎస్ లోకి తిరిగొచ్చే ప్లాన్‌లో ఉన్నారని సమాచారం.

అంతా ప్లాన్ ప్రకారం జరిగితే, వరంగల్ లో జరిగే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ వేదికగా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు తిరిగి కారెక్కడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంటే, కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కలవరం సృష్టిస్తోంది.

మొత్తానికి, బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ కేవలం వేడుక మాత్రమే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు వేదిక కాబోతుందని అంచనా వేస్తున్నారు.