Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు ఎక్కడ? గులాబీ నేతల తీరు అనుమానాస్పదం!

తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

By:  Tupaki Desk   |   30 July 2025 7:00 AM IST
బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు ఎక్కడ? గులాబీ నేతల తీరు అనుమానాస్పదం!
X

తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత పార్లమెంటు ఎన్నికల్లో ఖాతా తెరవకపోవడంతో బీఆర్ఎస్ ఎంపీలు కేవలం రాజ్యసభకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొత్తం నలుగురు రాజ్యసభ సభ్యులు ఆ పార్టీలో ఉండగా, ఆ నలుగురు ఇటు పార్టీ కార్యక్రమాలకు అటు రాజ్యసభకు సరిగా హాజరుకావడం లేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు. దేశ రాజధానిలో పార్టీ వాయిస్ ను వినిపించాల్సిన వారు సైలెంటుగా ఉండిపోవడంపై కేడర్ తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. నామినేటెడ్ పదవులను తీసుకున్నవారు పార్టీతో దూరం పాటిస్తుండటం, హైకమాండ్ కూడా కిమ్మనకపోవడంపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది.

పత్తాలేని బీఆర్ఎస్ ఎంపీలు

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌లో నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటును కూడా గెలవలేదు. దీంతో గులాబీ పార్టీలో రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథి రెడ్డి, దామోదర్ రావు సేవలు కీలకంగా మారాయి. అయితే పార్టీ అధికారంలో ఉండగా నిత్యం తెలంగాణ భవన్ కు వచ్చిపోయిన ఈ నేతలు.. గత పార్లమెంటు ఎన్నికల అనంతరం అటువైపు చూడటమే మానేశారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. చాలాకాలంగా నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీకి అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. ప్రధానంగా ముఖ్యంగా ముగ్గురు ఎంపీలైతే బయట ఎక్కడా కనిపించడం లేదన్న చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో కూడా వీరు యాక్టీవ్‌గా పాల్గొనడం లేదంటున్నారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా, ఆయన తీరుపైనా కేడర్ సంతృప్తి లేరని చెబుతున్నారు.

నలగురిలో ఒకరు నయం

అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్‌పై విమర్శలు చేసిన, పార్టీ అధినేత కేసీఆర్‌పై ఆరోపణలు, విమర్శలు గుప్పించినా ఈ నలుగురిలో ముగ్గురు ఎంపీలు సైలెంట్‌గానే ఉంటున్నారని చెబుతున్నారు. పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా కనిపించడం లేదని, తెలంగాణ భవన్‌లో కనీసం మీడియా సమావేశం కూడా పెట్టడం లేదని చెబుతున్నారు. నలుగురిలో పార్థసారథి రెడ్డి, కేఆర్ సురేష్ రెడ్డి, దామోదర్ రావు అయితే అసలే కనిపించడం లేదని అంటున్నారు. ఇక రాజ్యసభలో కూడా బీఆర్ఎస్ ఎంపీల పర్ఫామెన్స్ అంతంత మాత్రంగానే ఉంటోందని అంటున్నారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపై రాజ్యసభలో మాట్లాడిన సందర్భాలు ఒక్కటీ చెప్పలేకపోతున్నారు. చాలా వరకు రాజ్యసభలో కూడా నోరు మెదపరని..ఒకవేళ ఎప్పుడో ఒకసారి మాట్లాడినా అది కూడా ముక్తసరిగానేనని గుర్తు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ నలుగురిలో వద్దిరాజు రవిచంద్ర, కేఆర్ సురేష్ రెడ్డిలు రాజ్యసభలో అప్పుడప్పుడు మాట్లాడినా, పార్థసారథి రెడ్డి, దామోదర్ రావు ఇప్పటివరకు మాట్లాడిన దాఖలాలే లేవట.

గరం గరంగా కేడర్

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు కార్యక్రమాల్లో కూడా ఎంపీలు కనపడట్లేదట. కేవలం అధినేత కేసీఆర్ పాల్గొనే సమావేశాల్లో తప్ప మరే కార్యక్రమానికి వీళ్లు రారరని తెలంగాణ భవన్‌లో చర్చ జరుగుతోంది. అందుకే ఈ నలుగురు ఎంపీలు అసలు పార్టీలో ఉన్నట్లా.? లేనట్లా.? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అండగా ఉండి, పార్టీ యాక్టివిటీలో పాల్గొనాల్సిన ఎంపీలు ఇలా అంటీ ముట్టనట్లు, అసలు ఉన్నారా లేరా అన్నట్లు వ్యవహరించడంతో పార్టీ ముఖ్య నేతల నుంచి క్యాడర్ వరకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఇలాంటి వారికి ఎందుకు రాజ్యసభ పదవులు కట్టబెట్టారని కార్యకర్తలు హైకమాండ్ ను ప్రశ్నిస్తున్నారు.