గులాబీ పార్టీ తగ్గిపోతోంది
భారతీయ రాష్ట్ర సమితికి ప్రస్తుతం రాజకీయంగా గడ్డు రోజులు గడుస్తున్నాయి. 2023లో ఆ పార్టీ ఓటమి పాలు కావడంతో మొదలైన ప్రతికూలత ఇంకా కొనసాగుతూనే ఉంది.
By: Satya P | 20 Feb 2026 9:18 AM ISTభారతీయ రాష్ట్ర సమితికి ప్రస్తుతం రాజకీయంగా గడ్డు రోజులు గడుస్తున్నాయి. 2023లో ఆ పార్టీ ఓటమి పాలు కావడంతో మొదలైన ప్రతికూలత ఇంకా కొనసాగుతూనే ఉంది. 2024లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 17 ఎంపీ సీట్లకు గానూ బీజేపీ కాంగ్రెస్ చెరి ఎనిమిది సీట్లు గెలుచుకుంటే మజ్లిస్ ఒక సీటు దక్కించుకుంది. బీఆర్ ఎస్ అయితే బోణీ కొట్టలేకపోయింది. ఇక రాజ్యసభలోనే బీఆర్ఎస్ కి ప్రాతినిధ్యం ఉంది. అక్కడ ఆ పార్టీకి నలుగురు ఎంపీలు ఉన్నారు. అయితే వీరిలో ఒకరు ఈ ఏడాది ఏప్రిల్ లో పదవీ విరమణ చేయడంతో ముచ్చటగా ముగ్గురు మాత్రమే బీఆర్ఎస్ కి ఎగువ సభలో ఉంటారు అని అంటున్నారు.
ఆయన రిటైర్మెంట్ తో :
ఇక ఉమ్మడి ఏపీ శాసన సభలో స్పీకర్ గా పనిచేసిన సురేష్ రెడ్డి ఏప్రిల్ లో బీఆర్ ఎస్ నుంచి పదవీ విరమణ చేస్తున్నారు. దాంతో ఈ సీటు బలం ఉన్న మేరకు కాంగ్రెస్ కే వెళ్ళబోతోంది. ఆ విధంగా బీఆర్ఎస్ నుంచి ఒక ఎంపీ తగ్గిపోతారు ఇక బీఆర్ఎస్ నుంచి ఉన్న రాజ్య సభ ఎంపీల లిస్ట్ చూస్తే వద్ధిరాజు రవిచంద్ర 2030 ఏప్రిల్ దాకా కొనసాగుతారు. అలాగే బి. పార్థసారధి రెడ్డి, డి దామోదర రావుల పదవీకాలం జూన్ 2028 దాకా ఉంది. ఈ ముగ్గురే బీఆర్ఎస్ కి జాతీయ స్థాయిలో గొంతు వినిపించే వారుగా ఉండబోతున్నారు.
పెరగనున్న కాంగ్రెస్ :
అదే సమయంలో తెలంగాణా నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ ఎంపీల బలం పెరగనుంది. ఇప్పటికి ఆ పార్టీ నుంచి ముగ్గురు ఎంపీలు ఉన్నారు. అందులో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, ఎం అనిల్ కుమార్ యాదవ్ పదవీ కాలం 2030 ఏప్రిల్ దాకా ఉంది. అభిషేక్ సింఘ్వీ పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్ తో ముగుస్తోంది. ఆ స్థానంతో పాటు బీఆర్ఎస్ నుంచి రిటైర్ అవుతున్న స్థానాన్ని కలుపుకుని రెండు సీట్లలో కూడా కాంగ్రెస్ నుంచి ఎంపీలు అయ్యేందుకు చాన్స్ ఉంటుంది. అలా తెలంగాణాలో మొత్తం ఏడుగురు రాజ్యసభ సభ్యులు ఉంటే కాంగ్రెస్ కి నలుగురు బీఆర్ఎస్ కి ముగ్గురు ఎంపీలు ఉంటారు అన్న మాట.
జాతీయ స్థాయిలో :
ఇక చూస్తే బీఆర్ఎస్ అని పేరు మార్చి జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని ఆ పార్టీ అధినాయకత్వం ఒకనాడు ఎంతో ప్రయత్నం చేసింది. ఎన్నో ఆలోచనలు కూడా చేసింది. 2024 ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడవచ్చు అని అపుడు బీఆర్ఎస్ లాంటి పార్టీలకు ప్రాధాన్యత దక్కుతుందని వ్యూహాలు రచించింది. కానీ చివరికి చూస్తే తెలంగాణాలో అధికారం పోయింది. లోక్ సభలో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇపుడు రాజ్యసభలో ముగ్గురుకి బలం పడిపోయింది. దాంతో జాతీయ స్థాయిలో గులాబీ పార్టీ ప్రభ వెలసిపోతోంది అని అంటున్నారు.
