Begin typing your search above and press return to search.

'సినిమా' కష్టాలన్నీ బీఆర్ఎస్ కే..

ఇక కేసీఆర్ ముద్దుల కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయ్యారు. దాదాపు 5 నెలలు ఆమె ఢిల్లీ జైలులో ఉన్నారు.

By:  Tupaki Desk   |   9 Jun 2025 1:00 AM IST
సినిమా కష్టాలన్నీ బీఆర్ఎస్ కే..
X

ఎవరికైనా వ్యక్తిగతంగా ఒకటికి రెండు మూడు కష్టాలు ఎదురైతే.. వాటిని తెలుగు రాష్ట్రాల్లో ‘సినిమా’ కష్టాలు అంటుంటారు. రానురాను ఇదో నానుడిగానూ మారిపోయింది. ఇక ఇలాంటి సినిమా కష్టాలే ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ను చుట్టుముట్టాయి. 20 నెలల కిందట జరిగిన ఎన్నికల్లో ఓటమితో ఈ కష్టాలు మొదలయ్యాయి. వాస్తవానికి ఏ పార్టీకైనా ప్రతిపక్షంలో ఉండగా ఇబ్బందులు సహజం. అంతకుముందు అధికారంలో ఉండి ప్రతిపక్షాన్ని వేధించి ఉంటే.. వీరు ప్రతిపక్షంలోకి వచ్చాక కష్టాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు బీఆర్ఎస్ విషయానికి వస్తే అదే జరుగుతోంది.

2023 డిసెంబరులో ఫలితాలు వెలువడడం ఆలస్యం అప్పటి ప్రగతి భవన్ ను ఖాళీ చేసి ఫాంహౌస్ కు వెళ్లిపోయారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కానీ, బ్యాడ్ లక్ వెంటాడి అక్కడ కిందపడ్డారు.

సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట కుంగిన కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ ను కుప్పకూల్చింది అనే వాదన ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే కాళేశ్వరం కుంగుబాటుపై కమిషన్ వేసింది. దీనికితోడు బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్, విద్యుత్తు ఒప్పందాల పైనా విచారణ జరుగుతోంది.

ఇక కేసీఆర్ ముద్దుల కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయ్యారు. దాదాపు 5 నెలలు ఆమె ఢిల్లీ జైలులో ఉన్నారు.

ఈలోగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన లాస్య ప్రియ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. వీటికి మధ్యలోనే బీఆర్ఎస్ నుంచి వరుసగా ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు.

ఇక గాయంతోనే లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్ కు ఫలితాలు చేదు అనుభవాన్ని ఇచ్చాయి. బీఆర్ఎస్ ఏర్పాటు నుంచి తొలిసారి ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయింది. అత్యంత కష్ట కాలంలోనూ ఒక్క సీటయినా గెలిచిన బీఆర్ఎస్ కు 2024 లోక్ సభ ఎన్నికలు మాత్రం ’డకౌట్’ చూపించాయి.

అటు ఎమ్మెల్యేల జంపింగ్ లు, ఇటు కవిత అరెస్టు, కేసీఆర్ గాయం, లోక్ సభ ఎన్నికల్లో జీరో మధ్యనే బీఆర్ఎస్ ను ’కారు’ కష్టాలు చుట్టుముట్టాయి. ఫార్ములా వన్ కారు రేసులో అవినీతి జరిగిందంటూ తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై చర్యలకు గవర్నర్ అనుమతి కూడా పొందింది తెలంగాణ ప్రభుత్వం. కేసీఆర్ రేపోమాపో కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరుకానున్నారు.

కవిత తిరుగుబాటు..

ఇన్ని కష్టాలు, ఇబ్బందుల నడుమ గత నెల రోజులుగా కవిత తిరుగుబాటు బీఆర్ఎస్ లో కలకలం రేపింది. దాదాపు కవిత బీఆర్ఎస్ నుంచి వేరుకుంపటి పెట్టే స్థాయికి వెళ్లారు. ఇదంతా టీ కప్పులో తుఫాను అని సరిపెట్టుకునే పరిస్థితి లేదు. తాజాగా జూబ్లీహిల్స్ నుంచి హ్యాట్రిక్ (ఒకసారి టీడీపీ, రెండుసార్లు బీఆర్ఎస్) కొట్టిన మాగంటి గోపీనాథ్ హఠాన్మరణం బీఆర్ఎస్ కు మరో దెబ్బనే. గ్రేటర్ హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన నియోజక వర్గం జూబ్లీహిల్స్. ఇక్కడ కీలక నాయకులను ఓడించి బీఆర్ఎస్ పట్టు నిలిపారు గోపీనాథ్. అలాంటి నాయకుడు మరణం కారు పార్టీకి తీరని లోటే.

కొసమెరుపు: ఇన్ని సినిమా కష్టాల మధ్య బీఆర్ఎస్ కు నిజమైన సినిమా కష్టం కూడా వచ్చింది. అదేమంటే.. టాలీవుడ్ ప్రముఖ కుటుంబాన్ని బీఆర్ఎస్ హయాంలో కీలక మంత్రి ఇబ్బంది పెట్టారంటూ తెలంగాణ మంత్రి ఆరోపించారు. ఇది పెద్ద దుమారమే రేపింది. అందుకే బీఆర్ఎస్ కు సినిమా కష్టాలు అనేది.