బీఆర్ఎస్ ‘కారు’కు చాలా రిపేర్లు.. క్షేత్రస్థాయిలో ఎక్కడా కనిపించని కేడర్
అధికారం కోల్పోయి ఏడాదిన్నర పైనే అవుతున్నా తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల్లో ఇంకా కదలిక రావడం లేదని అంటున్నారు.
By: Tupaki Desk | 29 July 2025 1:00 AM ISTఅధికారం కోల్పోయి ఏడాదిన్నర పైనే అవుతున్నా తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల్లో ఇంకా కదలిక రావడం లేదని అంటున్నారు.కొద్ది రోజుల్లో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ కేడర్ నిస్తేజంగా ఉండిపోతుండటంతో పార్టీ హైకమాండ్ కూడా ఆందోళన చెందుతోందని చెబుతున్నారు. స్థానిక సమస్యలపై పెద్దగా ఫోకస్ చేయని బీఆర్ఎస్ లోకల్ లీడర్లు.. పార్టీ కార్యక్రమాలకు కూడా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని అంటున్నారు. దీంతో పార్టీ బాధ్యతలను భుజాలకు ఎత్తుకున్న కేటీఆర్, హరీశ్ రావు ప్రతి రోజూ స్పూన్ ఫీడింగ్ ఇవ్వాల్సివస్తోందని అంటున్నారు.
బీఆర్ఎస్ లో ఎందుకిలా..
ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో బీఆర్ఎస్ సరైన రీతిలో పనిచేయడం లేదన్న టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వంపై మీడియా సమావేశాల్లో వాడివేడి విమర్శలు చేస్తున్నా, క్షేత్రస్థాయి పోరాటాల్లో ఆ పార్టీ సరిగా వ్యవహరించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పార్టీ కేడర్ ను సమన్వయం చేయడంలో బీఆర్ఎస్ విఫలమవుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధినాయకత్వం కదిలిస్తేనే లీడర్లు కదులుతున్నారని, లేనిపక్షంలో తమకు ఏం సంబంధం లేదన్నట్లు మౌనంగా ఉండిపోవడం వల్ల క్షేత్రస్థాయిలో పార్టీకి పరిస్థితులు సానుకూలంగా మారడం లేదని అంటున్నారు.
తెలంగాణలో అధికార కాంగ్రెస్‌తో ప్రతిపక్షం బీఆర్ఎస్ ఢీ అంటే ఢీ అంటోంది. పార్టీ మీద, అధినేత మీద వస్తున్న విమర్శలు, ఆరోపణలను ఎదుర్కోవడంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావు ముందుంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వంలో ఉండగా, అధికారం అనుభవించిన చాలా మంది గులాబీ పార్టీ నేతలు ఇప్పుడు యాక్టివ్ గా లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి సవాళ్లు ఎదురైనా కేటీఆర్, హరీశ్‌రావు తప్ప మిగతా నేతలు ఎందుకు స్పందించడం లేదన్నది బీఆర్ఎస్ లో పెద్ద చర్చగా మారింది. తమ తమ జిల్లాల్లో జరుగుతున్న సంఘటలనపై కూడా కారు పార్టీ నేతలు మౌనంగా ఉండటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చెబుతున్నారు.
మాల్కాజిగిరిలో ఓ ఉదాహరణ
ఇటీవల మల్కాజ్‌గిరిలో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య వివాదం చెలరేగింది. బోనాల పండగ చెక్కుల పంపిణీలో ప్రోటోకాల్ రగడ కాస్త ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ సునీత భర్త రాము యాదవ్‌పై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు దాడి చేశారని అంటున్నారు. తమ పార్టీ నేతపై దాడి జరిగిందన్న విషయం తెలుకున్న వెంటనే ఖమ్మం పర్యటనలో ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేరుగా మల్కాజ్‌గిరిలోని కార్పొరేటల్ సునీత ఇంటికి వెళ్లి ఆమె భర్త రాము యాదవ్‌ను పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అయితే తమ పార్టీ నేతపై కాంగ్రెస్ లీడర్లు దాడి చేశారన్న విషయం తెలిసినా హైదరాబాద్‌లోని పార్టీ ముఖ్యనేతలు స్పందించలేదని చెబుతున్నారు. కనీసం ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకపోవడంతో తప్పుడు సంకేతాలు వెళుతున్నట్లు భావిస్తున్నారు.
రాము యాదవ్ పై దాడి జరిగిన తర్వాత కేటీఆర్ చెప్పేవరకు హైదరాబాద్ బీఆర్ఎస్ నేతలు కదలలేదని తెలుస్తోంది. మన పార్టీ నేతలపై దాడి జరిగితే ఎందుకు స్పందించలేదని కేటీఆర్ వారిని ప్రశ్నించినట్లు తెలంగాణ భవన్ వర్గాల సమాచారం. అందులోనూ బీసీ వర్గం నేతపై దాడి జరిగితే కనీసం పార్టీలోని ఆ సామాజికవర్గం నేతలు కూడా స్పందించరా అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కేటీఆర్ చెప్పిన తర్వాత మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్ మల్కాజ్‌గిరికి వెళ్లారని తెలుస్తోంది. ఇదే పని ముందు చేసి ఉంటే బాగుండేదన్న చర్చ పార్టీలో జరుగుతోంది.
ఏడాదిన్నరగా ఇంతే..
ఈ ఒక్క ఇష్యూలోనే కాదు చాలా అంశాల్లో, చాలా సందర్భాల్లో కేటీఆర్, హరీశ్‌రావులు మినహా మిగతా ముఖ్యనేతలంతా తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న చర్చ బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై వేధింపులు ఎక్కువయ్యాయని వాపోతోంది క్యాడర్. పార్టీ నేతలపై దాడులు, అక్రమ కేసులు పెట్టినా మిగతా నేతలు పెద్దగా స్పందించడం లేదని అంటున్నారు. అప్పుడు కూడా కేటీఆర్ లేదంటే హరీశ్‌రావులు చెబితే తప్ప ముఖ్య నేతలెవ్వరు రెస్పాండ్ కావడం లేదని చెప్తున్నారు. ఇలా ప్రతిసారి పైనుంచి ఆదేశాలు వస్తేనో.. అధిష్టానం చెబితేనో తప్ప మిగతా సందర్భాల్లో తమకెందుకులే అని పట్టీపట్టనట్లు ఉంటున్నారట బీఆర్ఎస్ నేతలు. అధికార కాంగ్రెస్, బీజేపీ నుంచి పార్టీ అధినేత కేసీఆర్ లేదంటే మిగతా వారిపై విమర్శలు, ఆరోపణలు చేసిన సందర్భాల్లోను పైనుంచి చెబితే ముఖ్యనేతలు రియాక్ట్ కావడం లేదని లేదని తెలుస్తోంది. ఇలా అన్నీ కేటీఆర్, హరీశ్‌రావులే చూసుకోవాలంటే కష్టమేనని, అన్నింటికీ వాళ్లే స్పందించాలంటే అయ్యే పని కాదని పార్టీ ముఖ్య నేతల్లో మార్పు రావాలన్న టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
