బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ ఝలక్.. అసెంబ్లీ ఆవరణలో కలకలం
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం ముందు మెరుపు ధర్నాకు దిగారు.
By: Tupaki Desk | 4 Aug 2025 2:57 PM ISTబీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం ముందు మెరుపు ధర్నాకు దిగారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సోమవారం అసెంబ్లీకి వచ్చారు. ముందుగా స్పీకర్ ప్రసాద్ కుమార్ అనుమతి తీసుకున్న ఎమ్మెల్యేలు వినతిపత్రం ఇచ్చేందుకు అసెంబ్లీకి రాగా, స్పీకర్ కార్యాలయ సిబ్బంది వారిని అనుమతించలేదు. దీంతో తమను అవమానిస్తున్నారని ఆగ్రహం చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.
ఉదయం 11 గంటలకు అపాయింట్‌మెంట్ ఇచ్చిన స్పీకర్ అందుబాటులో లేకపోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మూడు నెలల్లోగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ ను కలిసేందుకు మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలోని ఎమ్మెల్యేల బృందం అసెంబ్లీకి వచ్చింది. తమ పార్టీ ఎమ్మెల్యేలు కలుస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పీకర్ ప్రసాద్ కుమార్ కు ముందుగా సమాచారం ఇచ్చినట్లు బీఆర్ఎస్ చెబుతోంది. అయితే స్పీకర్ అందుబాటులో లేరని ఆయన సిబ్బంది సమాచారం ఇవ్వడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమను రమ్మనమని చెప్పి స్పీకర్ కార్యాలయానికి రాకపోవడమేంటని ప్రశ్నించారు. స్పీకర్ తీరును నిరసిస్తూ అసెంబ్లీ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలను స్పీకర్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమను ఉదయం 11 గంటలకు రమ్మనిమని స్పీకర్ అపాయింట్‌మెంట్ ఇచ్చారని, చెప్పిన సమయానికి తాము వచ్చినా కార్యాలయ తలుపులు కూడా తీయలేదన్నారు.
