అధికారికం: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత
ఈ నెల 5న (గురువారం) మధ్యాహ్నం వేళలో ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆ వెంటనే కుటుంబ సభ్యులు ఏఐజీకి తరలించారు.
By: Tupaki Desk | 8 Jun 2025 9:15 AM ISTమూడు రోజుల క్రితం అనూహ్య రీతిలో కార్డియాక్ అరెస్ట్ కు గురై.. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే.. బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ (62) కన్నుమూశారు. ఆదివారం ఉదయం 5.45 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని వైద్యులు అధికారికంగా వెల్లడించారు.
ఈ నెల 5న (గురువారం) మధ్యాహ్నం వేళలో ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆ వెంటనే కుటుంబ సభ్యులు ఏఐజీకి తరలించారు.కార్డియాక్ అరెస్టుకు గురైనట్లుగా వైద్యులు తెలిపారు. అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తీసుకొచ్చిన ఆయనకు.. ఏఐజీ సీనియర్ వైద్యులు వైద్యాన్ని అందించారు. సీపీఆర్ చేయటంతో గుండె తిరిగి కొట్టుకోవటం.. నాడి.. బీపీ.. సాధారణ స్థితికి వచ్చినట్లుగా పేర్కొన్నారు.
ఏఐజీ ఆసుపత్రిలోని వెంటిలేటర్ పై గడిచిన మూడు రోజులుగా చికిత్స అందిస్తున్నారు. 2023అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాతనుంచి ఆయన కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మూడు నెలల క్రితం ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అప్పట్లో డయాలసిస్ చేయించుకున్నట్లుగా చెబుతున్నా.. ఆయన ఈ విషయాన్ని వెల్లడించలేదు. అస్వస్థతో ఉన్నట్లుగా చెప్పినా.. తాను ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పేవారు. అయితే.. ఏఐజీ ఆసుపత్రిలో చేరి.. అక్కడి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత నుంచి తన జీవనశైలిలో చాలా మార్పులు చేసుకున్నట్లు చెబుతారు.
తాజాగా గుండెపోటు రావటంతో ఆసుపత్రిలో చేరిన ఆయన్ను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా.. ఫలితం లేకుండాపోయింది. సీనియర్ నాయకుడిగా సుపరిచితుడైన ఆయన 2014లో తెలుగుదేశం పార్టీ తరఫు తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత అప్పటి టీఆర్ఎస్.. ఇప్పటి బీఆర్ఎస్ లో చేరారు. 2018లో జరిగిన ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వరుసగా మూడోసారి 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
