Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ లో చీలిక...కవిత సొంత పార్టీ ?

గులాబీ పార్టీలో అలజడి రేగింది. అది అలజడి కంటే కూడా పెను తుపాను ముందు ఒక మాదిరిగా వీచిన గాలి అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   23 May 2025 5:00 AM IST
బీఆర్ఎస్ లో చీలిక...కవిత సొంత పార్టీ ?
X

గులాబీ పార్టీలో అలజడి రేగింది. అది అలజడి కంటే కూడా పెను తుపాను ముందు ఒక మాదిరిగా వీచిన గాలి అని అంటున్నారు. కేసీఆర్ ముద్దుల కుమార్తెగా ఉన్న కవిత ఏకంగా తండ్రి వ్యవహార శైలినే ప్రశ్నిస్తూ బాహాటంగా లేఖ రాశారు అంటే పార్టీలో అంతర్గతమైన ఘర్షణలు తారస్థాయికి చేరాయని అంటున్నారు.

ఇక కవిత లేఖ ఇలా బయటకు వచ్చిందో లేదో తెలంగాణా రాజకీయం వేడెక్కింది. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ అంది వచ్చిన ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నంలో ఉన్నారు. బీఆర్ఎస్ లో చీలికకు ఇది ఆరంభం అని ప్రత్యర్థి పార్టీలు జోస్యం చెబుతున్నారు.

ఇక కవిత రాసిన లేఖ మీద తెలంగాణా అసెంబ్లీలో బీజేపీ పక్ష నాయకుడు మహేశ్వరరెడ్డి ఘాటుగానే స్పందించారు. బీఆర్‌ఎస్‌లో నాలుగు స్తంభాలాట అని ముందే చెప్పామని అన్నరు. అంతే కాదు కవిత లేఖ విషయం గురించి కూడా పది రోజుల ముందే చెప్పామని అంటున్నారు.

బీఆర్ఎస్ లో పుట్టిన ముసలం ఇదని అన్నారు. అవినీతి సొమ్ము పంపకాల్లో జరిగిన పంచాయితీ వల్లనే అదంతా అని ఆయన అంటున్నారు. ఇక కవిత బయటకు వెళ్లి కొత్త దుకాణం పెడుతారని కూడా మహేశ్వరరెడ్డి జోస్యం చెప్పారు. అంతే కాదు త్వరలో ఇంకొక ప్రకంపన జరగబోతుందని కూడా ఆయన అంటున్నారు.

లోకల్‌బాడీ ఎన్నికల్లో కవిత సొంత అభ్యర్థులను నిలబెడతారని ఆయన జరగబోయే దాని గురించి ముందే చెబుతున్నారు. ఇక కవిత లేఖపై స్పందించిన కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమె అన్నీ వాస్తవాలే చెప్పారు అని అన్నారు.

చాలా తొందరలోనే కేటీఆర్‌కు బీఆర్ఎస్ పగ్గాలు అప్పగిస్తారని ఆయన చెబుతున్నారు. ఈ విషయం మీదనే కవిత హరీష్‌రావు ఆందోళనలో ఉన్నారని ఆయన చెబుతూ పార్టీలో ఇది సంక్షోభానికి దారి తీస్తోందని అన్నారు. ఇక కవిత రాసిన లేఖలో తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు రాశారని దానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇలా కవిత లేఖ మీద తెలంగాణా రాజకీయాల్లో ఎవరికి తోచిన తీరున వారు కామెంట్స్ చేస్తున్నారు. అయితే కేటీఆర్‌ కి తొందరలో పార్టీ పగ్గాలు అప్పగించడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. అందుకే నచ్చని వారు ఇలా అసమ్మతి గళం వినిపిస్తున్నారని ఇక తొందరలో హరీష్ రావు కూడా తన గొంతుక విప్పుతారు అని అంటున్న వారూ ఉన్నారు.

మొత్తానికి గులాబీ తోటలో గుబులు రేగుతోంది. కేటీఆర్ కి పార్టీ పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయిస్తున్నారు అన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో మరిన్ని ఆసక్తికరమైన సంచలనమైన పరిణామాలు బీఆర్ఎస్ లో చోటు చేసుకుంటాయని అంటున్నారు. అవేమిటో చూడాల్సిందే మరి.