బావా బామ్మర్దులను కలిపిన కవిత.. ఆ ఇద్దరి మధ్య విభేదాలకు ఫుల్ స్టాప్!
కొంతకాలంగా బీఆర్ఎస్ లో కేటీఆర్, హరీశ్ రావు మంచి దోస్తులుగా మారిపోయారు. ఒకరిపై ఒకరు ఈగ వాలనీయడం లేదని చెబుతున్నారు.
By: Tupaki Desk | 28 July 2025 4:00 PM ISTతెలంగాణలో ప్రతిపక్షం బీఆర్ఎస్ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ సైలెంటుగా ఉండటంతో పార్టీ నాయకత్వం కోసం కోల్డ్ వార్ జరుగుతోందన్న ప్రచారం ఉంది. బీఆర్ఎస్ అధినేత వారసత్వం కోసం కొడుకు, కూతురు, మేనల్లుడు మధ్య చాలాకాలంగా పోటీ ఉందని చెబుతున్నారు. అయితే ఈ తెరచాటు యుద్ధంలో అధినేత కేసీఆర్ కూతరు కవిత దూకుడు పెంచడంతో మిగిలిన ఇద్దరు ఒక్కటయ్యారా? అన్న చర్చ మొదలైంది. బీఆర్ఎస్ వర్కింగు ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ మంత్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి హరీశ్ రావు ఒకరికొకరు అన్నట్లు రాజకీయం చేస్తుండటం ఆసక్తి రేపుతోంది. అధికారంలో ఉండగా, ఆధిపత్యం కోసం పరితపించిన ఇద్దరూ చేతులు కలపడం వెనుక కవిత దూకుడు కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
దోస్త్ మేరా దోస్త్
కొంతకాలంగా బీఆర్ఎస్ లో కేటీఆర్, హరీశ్ రావు మంచి దోస్తులుగా మారిపోయారు. ఒకరిపై ఒకరు ఈగ వాలనీయడం లేదని చెబుతున్నారు. ఇద్దరూ ఒకే ఎజెండాతో పనిచేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారును టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు. ఇంతకు ముందులా కాకుండా బావబామ్మర్దులు ఇప్పుడు తరుచూ కలుసుకోవడం చర్చనీయాంశమవుతోంది. ప్రతి విషయంపై ఇద్దరూ చర్చించుకుని ఏకతాటిపై నిర్ణయాలు తీసుకుంటున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇలా ఇద్దరూ కలవటానికి కవిత వ్యవహారమే కారణమన్న టాక్ ఉంది. కొంత కాలంగా అసంతృప్తి రాగం ఆలపిస్తున్న కవితకు చెక్ పెట్టడమే ప్రస్తుతం ఇద్దరి టార్గెట్ గా మారిందన్న టాక్ ఎక్కువగా వినిపిస్తోంది.
గత విభేదాలను పక్కనపెట్టి..
కేటీఆర్, హరీశ్ రావు మధ్య కొత్తగా పెరిగిన సానిహిత్యంతో గత విభేదాలు పక్కన పెట్టినట్లేనని అంటున్నారు. బీఆర్ఎస్ లో అధినేత కేసీఆర్ వారసత్వం కోసం మేనల్లుడు హరీశ్ రావు, కుమారుడు కేటీఆర్ చాలాకాలంగా ప్రయత్నాలు చేశారు. కాబోయే సీఎం అన్న ఎలివేషన్ కోసం ఇద్దరూ పరితపించేవారు. పార్టీలో కేసీఆర్ తర్వాత సీనియర్ హరీశ్ రావు. ఆయనకు మాస్ ఇమేజ్ కూడా ఉందని అంటారు. అయితే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీలో పట్టుపెంచుకున్న కేటీఆర్ భావి నేతగా ఎదగాలని ఆశపడుతున్నారు. దీంతో గతంలో ఇద్దరూ వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించేవారు. కానీ, కవిత ఎంట్రీ తర్వాత పరిస్థితి మారిపోయిందని అంటున్నారు. కవిత లెటర్ లీక్ అయినప్పటి నుంచి ఈ ఇద్దరి బంధం మరింత బలపడిందని ఇటీవల జరుగుతున్న పరిణామాలు రుజువు చేస్తున్నట్లు చెబుతున్నారు. కవిత లేఖ తర్వాత హరీశ్‌రావు ఇంటికి వరుసగా రెండుసార్లు వెళ్లిన కేటీఆర్ ఆయనతో ప్రత్యేకంగా భేటీ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ఇద్దరూ కేసీఆర్‌తో కూడా పలుసార్లు భేటీ అయినట్లు చెబుతున్నారు. ఇంతకు ముందు ఎవరి కార్యక్రమాలు వారివి అన్నట్లుగా పనిచేసేవారని కానీ ఇప్పుడు సమన్వయంతో ముందుకు వెళ్తున్నారని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. గతంలో అత్యవసరమైతే తప్ప ఇద్దరు ఒకే వేదిక మీద కనిపించేవారు కాదన్న విషయం చెబుతున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జాయినింగ్స్ అయినా..ప్రభుత్వ విధానాలపై స్పందించాలన్నా ఇష్యూ బేస్డ్‌గా ఇద్దరు కలిసి చర్చించుకుని నిర్ణయం తీసుకొంటున్నారని సమాచారం.
ఫ్యామిలీతో కవితకు గ్యాప్
కేటీఆర్, హరీశ్ బంధం బలపడడానికి ఎమ్మెల్సీ కవితనే కారణమని అంటున్నాయి తెలంగాణ భవన్ వర్గాలు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ లీక్ తర్వాత ఫ్యామిలీతో, పార్టీతో ఆమెకు గ్యాప్ వచ్చిందని చెబుతున్నారు. కుటుంబంతోపాటు పార్టీ కూడా ఆమెను దూరం పెట్టిందని సమాచారం. కేటీఆర్ టార్గెట్‌గా కవిత చేసిన వ్యాఖ్యలు, ఆమె తీరు పార్టీకి ఇబ్బందికరంగా మారడంతోపాటు కాంగ్రెస్, బీజేపీకి అస్త్రంగా మారినట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగానే రాజకీయ ప్రత్యర్థులు ప్రతి అంశానికి కవితతో ముడిపెట్టి బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ అపోజిషన్‌లో ఉన్న సమయంలో..ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కవిత ఇష్యూ కేసీఆర్ ఫ్యామిలీకి, పార్టీకి హెడెక్‌గా మారింది. అయితే కవిత ఇష్యూతో అలర్ట్ అయిన కేటీఆర్, హరీశ్..కుటుంబంతో పాటు పార్టీలో ఏ చిన్న గ్యాప్ లేకుండా జాగ్రత్తపడాలని నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలోనే పార్టీకి సంబంధించిన ప్రతి అంశాన్ని ఇద్దరు కలిసి చర్చించుకోవాలని నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ఇలా కేటీఆర్, హరీష్ కలిసి మెలిసి తిరగడంపై పార్టీ క్యాడర్, లీడర్లు ఖుషీ అవుతున్నారు.
