అనాథలం అంటూ ఫీలవుతోన్న బీఆర్ఎస్ టాప్ లీడర్స్... !
ఎన్నికలలో ఓటమి తర్వాత నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇటు ద్వితీయ శ్రేణి నాయకులు అందరూ పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం మానేశారు.
By: Tupaki Desk | 22 Jun 2025 11:00 PM ISTతొమ్మిదిన్నర సంవత్సరాలు పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఆ పార్టీ లీడర్లు అందరు ఏకచక్రాధిపత్యంతో పాలన చేశారు.. వారి హవా ఒక రేంజ్‌లో సాగింది.. వారు చెప్పిందే వేదమైంది. ఎప్పుడు అయితే ? కారు పార్టీ ఓడిపోయిందో ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ నేతలు అందరూ అనాధలు అయిపోయారు. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు అంటూ ఆవేదన చెందుతున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న వేళ ఆయుధాలు పూర్తిగా కిందపడేసి చేతులు ఎత్తేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ నాయకులు పూర్తిగా నిర్వేదంలోకి వెళ్లిపోయారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ లో ఏమాత్రం సౌండ్ లేదు. గత ఎన్నికలలో జిల్లాలో ఒక్క సూర్యాపేట నుంచి పోటీ చేసిన మాజీమంత్రి జగదీశ్ రెడ్డి మినహా ఎవరు విజయం సాధించలేదు.
ఎన్నికలలో ఓటమి తర్వాత నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇటు ద్వితీయ శ్రేణి నాయకులు అందరూ పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం మానేశారు. మరీ ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలు బాధ్యతారహిత్యంగా ఉన్నట్టు కేడర్ మండిపడుతోంది. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత అస్సలు తమను పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో భువనగిరి - ఆలేరు - మునుగోడు - కోదాడ - నాగార్జునసాగర్ - దేవరకొండ - నల్గొండ నియోజకవర్గాలకు చెందిన గ్రామ మండల నియోజకవర్గస్థాయి నేతలు తమను నడిపించే నాయకుడు కోసం కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న వాతావరణం ఉంది.
హుజూర్‌నగర్ లో కారు పార్టీ క్యాడర్ ఏడాదిన్నర కాలంగా స్టీరింగ్ పట్టుకునే డ్రైవర్ కోసం ఎదురు చూస్తోంది. ఇక్కడ నుంచి గెలిచిన శానంపూడి సైదిరెడ్డి పార్టీ మారిన సంగతి తెలిసిందే. సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఒకరు మాత్రమే అప్పుడ ప్పుడు నియోజకవర్గాన్ని జిల్లాను చుట్టేస్తున్నారట. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తున్నా వేళ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జిలు, మాజీ ఎమ్మెల్యేలు అసలు కనిపించకపోవడంతో కిందిస్థాయి క్యాడర్లో తీవ్రమైన అసహనం కనిపిస్తోంది.
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన హడావుడితో పాటు బాగా సంపాదించుకున్నారని ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉంటే తమను పట్టించుకోరా ? అంటూ పార్టీ అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంలో రకరకాల సమస్యలు ఉండడం, వారికి ఇటు జిల్లా వైపు చూసే తీరిక లేకపోవడంతో ఇక్కడ ఇన్చార్జిలు, మాజీ ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ క్యాడర్‌ను పూర్తిగా గాలికి వదిలేసి హైదరాబాద్ కి పరిమితం అవుతున్నారు. దీంతో జిల్లా బీఆర్ఎస్ పార్టీలో తీవ్రమైన గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి.
