రాజకీయ రత్నాలు: బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?
బలమైన వాగ్ధాటి.. ప్రజల్లో గట్టిగా మాట్లాడే శక్తి ఉన్న నాయకులు తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ లో చాలా మందే ఉన్నారు.
By: Tupaki Desk | 11 July 2025 6:00 PM ISTబలమైన వాగ్ధాటి.. ప్రజల్లో గట్టిగా మాట్లాడే శక్తి ఉన్న నాయకులు తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ లో చాలా మందే ఉన్నారు. గతంలో ఉద్యమం చేసిన నాటి నుంచి నేటి వరకు కూడా నాయకులు బలంగా ప్రజల్లోకి కూడా వెళ్లారు. పదేళ్లపాటు అధికారంలో ఉండేందుకు కూడా వారికి ఈ గళమే పనిచేసింది. అయితే.. ఒక్కసారి అధికారం మిస్సయిన తర్వాత.. సదరు నేతల్లో నైరాశ్యం నిండిందో.. లేక పెరుగుతున్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కొనలేకపోతున్నామన్న భావనో తెలియదు కానీ.. బీఆర్ఎస్ నాయకులు గాడి తప్పుతున్నారు.
రాజకీయ రత్నాలుగా ఒకప్పుడు వెలిగిన జగదీశ్వర్ రెడ్డి వంటివారు కూడా దారి తప్పుతున్నారు. ఈ మాట ప్రత్యర్థులు అనడం లేదు. సొంత పార్టీ నాయకులే.. చెబుతున్నారు. ఒక్క జగదీశ్వర్ రెడ్డి మాత్రమే కాదు.. మాజీ మంత్రులు కూడా ఇలానే వ్యవహరిస్తున్నారు. ఒక, కేసీఆర్ సంతానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి న అవసరం కూడా లేదు. ఎవరికి వారుగా రాజకీయాలు చేస్తున్నారు. ఒకప్పుడు వ్యూహాలపై వ్యూహాలతో ముందుకు సాగిన నాయకులు.. ఇప్పుడు సూత్రం లేని గాలిపటాల లెక్క.. గమ్యంలేని లక్ష్యాల వెంట పరుగులు పెడుతున్నారు.
ముఖ్యంగా ఓ వర్గం మీడియాను టార్గెట్ చేసుకునే గత 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీగా దెబ్బతింది. ఇది ఆ పార్టీ నాయకులకు కూడా తెలుసు. మళ్లీ ఇప్పుడు కూడా అదే తప్పు చేస్తున్నారన్న వాదనా వినిపిస్తోంది. ఇక, ప్రధానంగా ప్రభుత్వ పక్షాన్ని టార్గెట్ చేయడంలోనూ.. నాయకుల తీరు విమర్శలకు దారితీసేలా చేస్తోంది. మరికొన్ని నెల్లలోనే స్థానిక ఎన్నికలు ఉన్నాయి. వీటిలో విజయం దక్కించుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్‌లు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.
ఇలాంటి కీలక సమయంలో బీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగత అజెండాలు.. రుసరుసలతో సాధించేది ఏమీ లేకపోగా.. క్షేత్రస్థాయిలోనూ పలుచన అవుతున్నారన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. దీనిని పరిశీలించుకుని జాతి రత్నాలుగా పేరున్న వారు.. ఆ పేరును నిలుపుకొనే ప్రయత్నం చేయాలి. లేకపోతే.. మున్ముందు.. ఫేడ్ అవుట్ కావడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.
