Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ నిర్ణ‌యం: కేసీఆర్ మాట‌లు వినిపిద్దాం!

రాజ‌కీయాల్లో ఏ చిన్న అవ‌కాశం చిక్కినా త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు పార్టీలు ప్ర‌య‌త్నిస్తాయి.

By:  Garuda Media   |   23 April 2026 10:40 PM IST
బీఆర్ఎస్ నిర్ణ‌యం: కేసీఆర్ మాట‌లు వినిపిద్దాం!
X

రాజ‌కీయాల్లో ఏ చిన్న అవ‌కాశం చిక్కినా త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు పార్టీలు ప్ర‌య‌త్నిస్తాయి. అదేస‌మ‌యంలో ప్ర‌త్య‌ర్థుల‌కు వ్య‌తిరేకంగా ఏ చిన్న ఛాన్స్ చిక్కినా.. దానిని కూడా వాడుకునే ప్ర‌య‌త్నం చేస్తారు. తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ ఇప్పుడు ఈ విష‌యం పైనే దృష్టి పెట్టింది. రెండు కీల‌క అంశాల‌ను ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువెళ్లాల‌ని నిర్ణ‌యించింది. త‌ద్వారా ప్ర‌జ‌ల మ‌ధ్య చ‌ర్చ పెట్టి.. పార్టీని మ‌రింత పుంజుకునేలా చేయాల‌ని భావిస్తోంది.

1) కేసీఆర్ మాట‌లు: ఇటీవ‌ల జ‌గిత్యాల‌లో నిర్వ‌హించిన స‌భ‌లో బీఆర్ ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ 59 నిమిషాల పాటు నిర్విరామంగా ప్ర‌సంగించారు. దీనిలో తెలంగాణ ఉద్య‌మం నుంచి ఉమ్మ‌డి రా ష్ట్ర పాల‌కుల వ‌ర‌కు.. బీఆర్ ఎస్ ప్ర‌స్థానం నుంచి గత ప్ర‌భుత్వంగా తాము చేసిన మేళ్ల వ‌ర‌కు వివ‌రించారు. ఈ ప్ర‌సంగంలో కేసీఆర్‌.. ఇటీవ‌ల కాలంలో ఎప్పుడూలేనంత ఉత్సాహంగా కూడా క‌నిపించారు. చాలా కాన్ఫిడెన్స్‌గా ఆయ‌న ప్ర‌సంగం సాగింది.

దీనిని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని బీఆర్ఎస్ నిర్ణ‌యించింది. గ్రామాలు, మండ‌లాలు, జిల్లాల స్థాయిలో సోష‌ల్ మీడియా వేదిక‌గా.. కేసీఆర్ ప్ర‌సంగంలోని కీల‌క అంశాల‌ను 40-50 వ‌ర‌కు ఏర్చి కూర్చి ప్ర‌చారంలోకి తీసుకురావాల‌ని నిర్ణ‌యించింది. ముఖ్యంగా హైడ్రాను ప‌క్క‌న పెట్టేందుకు చేస్తామ‌న్న తొలి సంత‌కం.. తెలంగాణ ఉద్య‌మం.. స‌హా.. స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించ‌నున్నారు. వీటిని ప్ర‌జ‌ల్లోకి ప‌దే ప‌దే తీసుకువెళ్లనున్నారు. దీంతో శ్రేణులు మ‌రింత ఉత్తేజ‌మ‌వుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.

2) కాళేశ్వ‌రం క‌మిష‌న్‌: తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువెళ్లాల‌ని మాజీ మంత్రి, బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణ‌యించారు. కాళేశ్వ‌రంలో అవినీతి చోటు చేసుకుందని ఆరోపిస్తూ.. ప్ర‌భుత్వం నియ‌మించిన పీసీ ఘోష్ క‌మిష‌న్ రిపోర్టును హైకోర్టు ప‌క్క‌న పెట్టింది. అంతేకాదు.. ఎలాంటి నిబంధ‌న‌లు పాటించ‌లేద‌ని ఆక్షేపించింది. దీనిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకున్న బీఆర్ ఎస్‌.. ''ఇదీ కేసీఆర్‌పై జ‌రుగుతున్న కుట్ర‌'' అంటూ.. ప్ర‌భుత్వంపై ప్ర‌చారం చేయాల‌ని.. గ్రామ గ్రామాన ఈ విష‌యాన్నీ ప్ర‌జ‌ల‌కు చేరువ చేయాల‌ని నిర్ణ‌యించింది.