Begin typing your search above and press return to search.

సీఎం కవిత...పక్కాగా రాసిపెట్టుకోవచ్చుట !

నిజంగా 2023లో బీఆర్ఎస్ మూడోసారి గెలిచి వస్తే కనుక ఈపాటికి కేటీఆర్ సీఎం అయ్యేవారు.

By:  Tupaki Desk   |   3 July 2025 9:27 AM IST
సీఎం కవిత...పక్కాగా రాసిపెట్టుకోవచ్చుట !
X

తెలంగాణాకు బాపు అని బీఆర్ఎస్ పార్టీ అభిమానులు చెప్పుకుని మురిసిపోతారు. ఆయనే కేసీఅర్. ఆయనకు ఇద్దరు బిడ్డలు ఉంటే కేటీఆర్ బీఆర్ఎస్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన మంత్రిగా సుదీర్ఘ కాలం పనిచేశారు. మంత్రిగా కీలక శాఖలు చేపట్టారు. పార్టీలో కూడా పట్టు సంపాదించారు. ఇక ఆయన కాబోయే సీఎం అని చాలా కాలంగా ప్రచారం సాగుతూ వచ్చింది.

నిజంగా 2023లో బీఆర్ఎస్ మూడోసారి గెలిచి వస్తే కనుక ఈపాటికి కేటీఆర్ సీఎం అయ్యేవారు. కానీ అది మరో అయిదేళ్ళకు వాయిదా పడింది. అయినా కానీ కేటీఅర్ ఏనాడూ తాను తెలంగాణాకు సీఎం అవుతాను అని ఎక్కడా చెప్పుకోలేదు. కానీ కేసీఆర్ కుమార్తె కవిత మాత్రం తప్పకుండా సీఎం అయి తీరుతాను అని అంటున్నారు పక్కాగా రాసిపెట్టుకోవచ్చు అన్నట్లుగానే ఆమె చెబుతున్నారు.

విషయానికి వస్తే ఒక ఇంటర్వ్యూలో కవితను మీరు తెలంగాణాకు సీఎం అవుతారా అంటే తప్పకుండా అని బదులివ్వడం విశేషం. అంతే కాదు తెలంగాణాలో మరో పదేళ్లకో పదిహేనేళ్ళకో తాను సీఎం అయి తీరుతాను అని ఆమె ధీమాగా చెప్పారు. రాజకీయాల్లో ఎవరైనా ఎదగాలనే కోరుకుంటారు కదా అని ఆమె అన్నారు. అందువల్ల తాను సీఎం గా ఎదగాలి అన్నదే లక్ష్యం ఉందని ఆమె కచ్చితంగా చెప్పారు.

అంత ధీమాగా ఆత్మవిశ్వాసంతో చెప్పినందుకు కవితను మెచ్చుకుని తీరాలి. ఇక ఆమె తాను సీఎం అయ్యే దాన్ని చాలా లాంగ్ టెర్మ్ డ్రీం గానే పెట్టుకున్నారు కాబట్టి అప్పటివరకూ వేచి చూడాల్సిందే. ఇక తాను బీఆర్ఎస్ లోనే ఉన్నాను అని కవిత అంటున్నారు. నేను అదే పార్టీ అదే రక్తం. ఎందుకా డౌట్ అని మీడియానే ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ లో పునాది నుంచి తాను ఉన్నాను అని ఆమె చెప్పడం కూడా విశేషం.

బీఆర్ఎస్ నా పార్టీ అని ఆమె బల్లగుద్ది మరీ చెబుతున్నారు. పార్టీ నిర్మాణంలో నా పాత్ర నిన్నా ఉంది నేడూ ఉంది రేపూ ఉంటుందని చెబుతున్నారు. పార్టీలో ఉన్న సమస్యల మీద చర్చించి పరిష్కరించుకోవాలని ఆమె అనడం విశేషం. తాను కేసీఅర్ కి ఎప్పటి నుంచో లేఖలు రాస్తున్నాను అని అది కొత్త విషయం కాదని కవిత అన్నారు. తన తండ్రితో మాట్లాడేందుకు అవకాశం లేదా అన్న దానికి ఆమె బదులిస్తూ లేఖల ద్వారానే విషయం బాగా అర్ధం అవుతుంది అని అన్నారు.

ఇక తనను అరెస్ట్ చేస్తారు అని ముందే కేసీఆర్ చెప్పారని కవిత చెప్పడం విశేషం. గత ఏడాది జనవరిలోనే తనను పిలిచి అరెస్టు చేస్తారు అని చెప్పారని గుర్తు చేసుకున్నారు. ధైర్యంగా ఉండాలని కోరారు తన పదవికి రాజీనామా చేయాలని అడిగితే అక్కరలేదని చెప్పారని అన్నారు. నా తప్పు ఏమీ లేదని కూడా చెప్పారు. న్యాయపరంగానే పోరాడుదామని చెప్పారని కవిత చెప్పారు. ఇక తాను జైలులో అనేక రకాలైన బాధలు అనుభవించాను అని ఆమె అన్నారు. తనలాంటి పరిస్థితి పగవాళ్ళకు కూడా రాకూడదని కవిత అన్నారు.

ఇక కేసీఆర్ సీఎం గా ఉన్నపుడు నిజమాబాద్ కి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ అడిగాను అని ఆమె చెప్పారు. అయినా ఎందుకో ఇవ్వలేదని ఆమె చెప్పారు. ఈసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే నిజామాబాద్ ని తప్పకుండా అభివృద్ధి చేస్తాను అని ఆమె చెప్పారు మొత్తానికి బీఆర్ ఎస్ లో చూస్తే కేసీఆర్ తరువాత ముగ్గురు సీఎం అభ్యర్ధులు కనిపిస్తున్నారు అని అంటున్నారు వారే కేటీఆర్ హరీష్ రావు కవిత. మరి వీరిలో ఎవరికి చాన్స్ ఉందో జనాలే చెబుతారు అని అంటున్నారు.