బీఆర్ ఎస్‌కు ప్రజలపై ప్రేమ తగ్గలేదు సరే.. మరి మీమాటేంటి కేటీఆర్?
బీఆర్ ఎస్ పార్టీపై ప్రజలకు ప్రేమ తగ్గలేదని మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రేమతో తమకు ప్రజలు చూస్తున్నారని.. వచ్చే రెండేళ్లలోనే తమ పార్టీ తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.
By: Tupaki Desk | 28 Sept 2026 3:00 PM ISTబీఆర్ ఎస్ పార్టీపై ప్రజలకు ప్రేమ తగ్గలేదని మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రేమతో తమకు ప్రజలు చూస్తున్నారని.. వచ్చే రెండేళ్లలోనే తమ పార్టీ తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. ఓకే.. ఇంత వరకు బాగానే ఉంది.. కానీ.. ప్రజల సమస్యలపై గళం వినిపించే విషయంలో బీఆర్ ఎస్ తరఫున పోరాటాలు ఏవీ అన్నదే ప్రశ్న. అయితే..దీనికి మేం చేస్తున్నాంకదా.. అనే సమాధానం రావొచ్చు.
కానీ, క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి.. దళితులు తమ సమస్యలకు సమాధానం లేక అలమటిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవలే తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు.. కవిత నల్లగొండ సహా.. కరీంనగర్ జిల్లాల్లో పర్యటించిన రైతులను పరామర్శించారు. సింగరేణిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నలు సంధించారు. దళిత వాడల్లోనూ ఆమె పర్యటించారు. అంటే.. ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నట్టే కదా?.
మరి బీఆర్ ఎస్ పార్టీ ప్రజల తరఫున ఏం చేసినట్టు. కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పండుగపై నల్లచొక్కాలు ధరించి నిరసన తెలిపారు. కానీ, రైతులు ధాన్యం కొనే దిక్కలేక.. మహబూబాబాద్‌లో రోడ్లపై పారబోసినప్పుడు కేటీఆర్ కానీ, హరీష్‌రావు కానీ.. స్పందించారా? ఇక, రైతులపై లాఠీ చార్జి జరిగిన ఇదే జిల్లాలో రైతుల పక్షాన ఎవరు గళం వినిపించారన్నది ప్రశ్న. మొత్తంగా.. ప్రజలపై బీఆర్ ఎస్‌కు ఆశలు ఉన్నాయి.. ప్రేమ ఉన్నది.. అని చెప్పుకొనే వారు.. ప్రజల సమస్యలపై ఏమేరకు గళం వినిపిస్తున్నారన్నది కూడా అదే ప్రజలు పరిశీలిస్తారు.
తమకు అవకాశం లేనప్పుడు.. ప్రజల పంచన చేరడం.. అవకాశం ఉన్నప్పుడు.. అంతా తామే చేశామని చెప్పుకోవడం రాజకీయ నాయకుల లక్షణమే. అయితే.. బీఆర్ ఎస్ పార్టీ పుట్టుకే ఉద్యమం నుంచి ప్రారంభమైంది. అదే ప్రజలు.. ఈ పార్టీని స్వాగతించారు. కానీ.. ప్రజలతో ఎప్పుడైతే.. బంధం తెగుతూ వచ్చిందో.. అప్పుడే పార్టీకి చేటు కాలం ప్రారంభమైంది. నేడు కూడా అదే పరిస్థితి రాకుండా ఉండాలంటే.. ఇకనైనా.. ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నం చేయడం మంచిది.
