కీలక బిల్లులపై కేసీఆర్ వైఖరి ఇదేనా..? రెండు రోజులుగా పార్టీ ముఖ్యనేతలతో గులాబీ బాస్ చర్చలు..
లోక్‌సభలో ఒక్క సీటు లేకపోయినప్పటికీ, రాజ్యసభలో ఉన్న నలుగురు సభ్యులతో జాతీయ రాజకీయాల్లో తన గళాన్ని వినిపించాలని బీఆర్ఎస్ నిర్ణయించుకుంది.
By: Tupaki Political Desk | 15 April 2026 7:00 PM ISTలోక్‌సభలో ఒక్క సీటు లేకపోయినప్పటికీ, రాజ్యసభలో ఉన్న నలుగురు సభ్యులతో జాతీయ రాజకీయాల్లో తన గళాన్ని వినిపించాలని బీఆర్ఎస్ నిర్ణయించుకుంది. నియోజకవర్గాల పునర్విభజన అనేది కేవలం రాజకీయ అంశం కాదు.., అది దక్షిణాది రాష్ట్రాల ఉనికికి సంబంధించిన సమస్యగా కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో కేటీఆర్, హరీశ్ రావుతో ఆయన జరిపిన భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
మహిళా బిల్లుకు జై.. డీలిమిటేషన్‌కు నై!
దేశ వ్యాప్తంగా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై వేడి రాజుకున్న వేళ, తెలంగాణ ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ తన వైఖరిని స్పష్టం చేసింది. సంఖ్యాబలంతో సంబంధం లేకుండా, సిద్ధాంతపరంగా ఈ బిల్లులను ఎలా డీల్ చేయాలనే దానిపై గులాబీ బాస్ కేసీఆర్ తనదైన శైలిలో వ్యూహరచన చేశారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కేటీఆర్, హరీశ్ రావుకు స్పష్టం చేశారు.
మహిళా బిల్లుకు సంపూర్ణ మద్దతు
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ‘నారీ శక్తి వందన్’ బిల్లుకు బీఆర్ఎస్ మొదటి నుంచీ అనుకూలంగానే ఉంది. గతంలో ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ బిల్లు కోసం నిరసనలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా పార్టీ గుర్తు చేసుకుంది. మహిళా ఓటర్లలో సానుకూల సంకేతాలు పంపడానికి ఈ బిల్లుకు మద్దతివ్వడం బీఆర్ఎస్‌కు అనివార్యం. అందుకే రాజ్యసభలో తమకున్న నలుగురు సభ్యులు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలని కేసీఆర్ ఆదేశించారు.
అయితే, డీలిమిటేషన్ తో దక్షిణాది మనుగడపై కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై మాత్రం బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. కేసీఆర్ లేవనెత్తుతున్న ప్రధాన అభ్యంతరం ‘జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు’.
జనాభా నియంత్రణ పాటించి, అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల పెంపులో అన్యాయం జరగడం అంటే.. మంచి పని చేసినందుకు శిక్ష వేయడమేనని కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల (తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ) వాటా సుమారు 24 శాతంగా ఉంది. కొత్తగా నియోజకవర్గాలను పెంచిన తర్వాత కూడా, మొత్తం సీట్లలో దక్షిణాది వాటా ఖచ్చితంగా 24 శాతం ఉండేలా చూడాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఉత్తరాదిలో జనాభా పెరిగినందుకు అక్కడ సీట్లు పెంచి, దక్షిణాదిలో తక్కువగా పెంచితే కేంద్రంలో మన పట్టు పూర్తిగా కోల్పోతామని ఆయన హెచ్చరిస్తున్నారు.
రాజ్యసభలో ‘నలుగురు’ ఏం చేయగలరు?
లోక్‌సభలో బీఆర్ఎస్‌కు ప్రాతినిధ్యం లేకపోవడం పెద్ద లోటు. అక్కడ బిల్లు చర్చకు వచ్చినప్పుడు పార్టీ వాదన వినిపించే అవకాశం లేదు. కానీ రాజ్యసభలో ఉన్న నలుగురు సభ్యులు అత్యంత కీలకం కానున్నారు. కేవలం తమ నలుగురితోనే బిల్లును ఆపలేమని కేసీఆర్‌కు తెలుసు. అందుకే తమిళనాడులోని డీఎంకే, కేరళలోని వామపక్షాలు, కర్ణాటకలోని జేడీఎస్ వంటి దక్షిణాది పార్టీలను ఏకం చేయాలని ఆయన కేటీఆర్‌కు సూచించారు. సంఖ్యాపరంగా ఓడిపోయినా, దక్షిణాదికి జరుగుతున్న అన్యాయాన్ని పార్లమెంట్ రికార్డుల్లో నిక్షిప్తం చేయాలన్నది కేసీఆర్ ప్లాన్.
లోక్‌సభలో సభ్యులు లేకపోయినా, ఈ కీలక బిల్లుల చర్చ జరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ ముఖ్య నేతలు పార్లమెంట్ గ్యాలరీల నుండి పర్యవేక్షించే అవకాశం ఉంది. బయట మీడియా ద్వారా తమ నిరసనను గట్టిగా వినిపించాలని పార్టీ నిర్ణయించింది. డీలిమిటేషన్ వల్ల తెలంగాణలో సీట్లు పెరిగినా, జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రాముఖ్యత తగ్గిపోతుందనే పాయింట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని హరీశ్ రావుకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్ఎస్, ఇప్పుడు ఈ కీలక బిల్లుల ద్వారా మళ్లీ జాతీయ వేదికపై తన ఉనికిని చాటుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా ‘దక్షిణాది ప్రయోజనాల రక్షకులం మేమే’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లడం ద్వారా కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందాలని కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. మహిళా బిల్లుకు మద్దతు, డీలిమిటేషన్‌కు వ్యతిరేకత అనే ఈ 'డబుల్' స్ట్రాటజీ బీఆర్ఎస్‌కు రాజకీయంగా ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి.
