Begin typing your search above and press return to search.

భారీగా తగ్గిన బీఆర్ఎస్ జోరు.. ఒక్కో మున్సిపాలిటీ నుంచి ఒకే ఒక్క సీటు..

రాష్ట్ర ఆవిర్భావానికి ప్రతీకగా ఎదిగిన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ఇప్పుడు తన రాజకీయ ప్రయాణంలో అత్యంత క్లిష్ట దశను ఎదుర్కొంటోంది.

By:  Tupaki Political Desk   |   14 Feb 2026 10:59 AM IST
భారీగా తగ్గిన బీఆర్ఎస్ జోరు.. ఒక్కో మున్సిపాలిటీ నుంచి ఒకే ఒక్క సీటు..
X

రాష్ట్ర ఆవిర్భావానికి ప్రతీకగా ఎదిగిన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ఇప్పుడు తన రాజకీయ ప్రయాణంలో అత్యంత క్లిష్ట దశను ఎదుర్కొంటోంది. ఉద్యమ పునాది మీద నిర్మితమైన పార్టీగా.., పదేళ్లపాటు అధికారాన్ని నిలబెట్టుకున్న శక్తిగా.., తెలంగాణ రాజకీయాలను ఏకపక్షంగా ప్రభావితం చేసిన సంస్థగా బీఆర్‌ఎస్‌కు ఉన్న చరిత్ర ప్రత్యేకం. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాతి పరిణామాలు ఆ పార్టీకి వరుస హెచ్చరికలు చేస్తున్నాయి.

దెబ్బమీద దెబ్బలు..

అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం ఒక దెబ్బ అయితే, వెంటనే జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో 17లో ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం పెద్ద దెబ్బ. అధికారాన్ని కోల్పోయిన వెంటనే కేంద్ర స్థాయిలో కూడా ప్రాతినిధ్యం లేకపోవడం పార్టీకి మానసికంగా, వ్యూహాత్మకంగా భారంగా మారింది. ప్రజల్లో మార్పు కోరిక ఎంత బలంగా ఉందో ఆ ఫలితాలు స్పష్టం చేశాయి.

సిట్టింగ్ స్థానంలోనూ వెనుకడుగే..

ఇదే సమయంలో జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక మరింత మరింత ప్రతిష్టాత్మకంగా మారింది. సిట్టింగ్‌ స్థానం కోల్పోవడం కేవలం ఓటమి కాదు.. అది పట్టుదల తగ్గిందనే సంకేతం. శక్తివంతమైన పట్టణ నియోజకవర్గంలో ఓటమి పార్టీ నగర రాజకీయాల్లో ప్రభావం తగ్గుతోందన్న అభిప్రాయాన్ని బలపరిచింది.

నీరు గారుతున్న ఉత్సాహం..

తాజాగా మునిసిపల్‌ ఎన్నికల ఫలితాలు కూడా ఆశించినంత ఉత్సాహాన్ని ఇవ్వలేదు. 13 మునిసిపాలిటీలలో గెలుపు సాధించినా, గత వైభవంతో పోలిస్తే ఇది గణనీయమైన వెనుకడుగు. ముఖ్యంగా ఖమ్మం వంటి బలమైన ప్రాంతాల్లో ఎదురైన పరాజయాలు పార్టీకి సంకేతాత్మకంగా కనిపిస్తున్నాయి. మరింత ఆసక్తికర విషయం ఏంటంటే మరో 13 మునిసిపాలిటీల్లో ఒక్కో అభ్యర్థి మాత్రమే గెలవడం పార్టీని కలవరపెడుతుంది. ఎల్లారెడ్డి, సుల్తానాబాద్‌, యాదగిరిగుట్ట, వడ్డేపల్లి, పెద్దపల్లి, మధిర, కొడంగల్‌, నందికొండ, మంథని, హాలియా, చొప్పదండి, భూత్పూర్‌, ఆత్మకూరు వంటి ప్రాంతాల్లో ఈ స్థితి కనిపించడం పార్టీ బలహీనతను ప్రతిబింబిస్తోంది.

కనిపించని దూకుడు..

2021లో మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ చూపిన దూకుడు ఇప్పుడు కనిపించడంలేదు. అప్పట్లో ఉన్న కేడర్‌ ఉత్సాహం, నాయకత్వ కేంద్రీకరణ, అభ్యర్థుల ఎంపికలో చురుకుదనం.. ఇవన్నీ ఇప్పుడు పునర్మూల్యాంకనం చేయాల్సిన అంశాలుగా మారాయి. అధికారంలో ఉన్నప్పుడు సహజంగా లభించే పరిపాలనా ఆధిక్యం లేకపోవడం కూడా ప్రభావం చూపుతున్నదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఇది మార్పు దశా..?

అయితే ఇది అంతమా? లేక మార్పు దశనా? చరిత్ర చెబుతున్నది ఏంటంటే, తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతాయి. ఒక దశలో శూన్యంలా కనిపించిన శక్తులు మళ్లీ పుంజుకున్న ఉదాహరణలున్నాయి. బీఆర్‌ఎస్‌కు స్వీయ విశ్లేషణ అవసరం. ప్రజల అసంతృప్తికి కారణాలు ఏంటి? కేడర్‌ స్థాయిలో ఉన్న లోపాలు ఏంటి? కొత్త నాయకత్వానికి స్థానం కల్పించాలా? మళ్లీ ప్రజా సమస్యలపై దూకుడుగా వ్యవహరించాలా? వంటి ప్రశ్నలకు సమాధానం కనుగొనాల్సిన సమయం.

రాజకీయాల్లో విజయాలు, పరాజయాలు సహజం. కానీ వరుస పరాజయాలు ఎలాంటి సందేశాలు ఇస్తాయో చెప్పకనే అర్థం చేసుకోవచ్చు. వ్యూహం మారాలి, ప్రజా అనుసంధానం బలపడాలి, అంతర్గత ఐక్యత అవసరం. బీఆర్‌ఎస్‌ ఇప్పుడు అదే దశలో ఉంది. ఈ దశను పునర్నిర్మాణంగా మలుచుకుంటుందా? లేక మరింత క్షీణత వైపు సాగుతుందా? అనేది రాబోయే ఎన్నికలే నిర్ణయిస్తాయి.