బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. ఎవరూ తగ్గట్లేదు!
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌ల మధ్య రాజకీయం మరింత పెరుగుతోంది.
By: Garuda Media | 18 July 2026 3:00 PM ISTతెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌ల మధ్య రాజకీయం మరింత పెరుగుతోంది. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ సహా.. పలుకార్పొరేషన్ల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాజకీయంగా ఆధిపత్యం కోసం ఇరు పక్షాలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమస్యలపై పోరుబాటకు ప్రధాన ప్రతిపక్షం రెడీ అయితే.. దీనికి విరుగుడుగా.. కాంగ్రెస్ సైత రివర్స్ పోరుబాటలకు రెడీ అయింది. ఫలితంగా ఇరు పక్షాల మధ్య రాజకీయం వేడెక్కగా.. ఎవరూ వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడంలేదు.
తాజాగా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలపై బీఆర్ఎస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. `యువ సంగ్రామ సదస్సు` పేరుతో శనివారం భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రెండున్నరేళ్ల రేవంత్ రెడ్డి పాలనలో నిరుద్యోగులు ఏ వి ధంగా మోసపోయారన్న అంశాలను ఈ సదస్సులో వివరిస్తామని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు.. జిల్లాల నుంచి కూడా యువతను సమీకరిస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే ఈ సదస్సు ద్వారా నిరుద్యోగ సమస్యలను ప్రభుత్వానికి వినిపిస్తామని బీఆర్ఎస్ చెబుతోంది.
తొలుత ఈ సదస్సుకు పోలీసులు అనుమతిఇవ్వలేదు. అయితే.. హైకోర్టుకు వెళ్లిన బీఆర్ఎస్‌కు షరతులతో కూడి న అనుమతి వచ్చింది. దీంతో సదస్సుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సదస్సుకు కేసీఆర్ రాకపోయినా.. ఆయన తరఫున సందేశం పంపుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో బీఆర్ఎస్ హయాంలో యువతను స్వయం సమృద్ధి దిశగా ప్రోత్సహించేందుకు చేపట్టిన కార్యక్రమాలు, ఇచ్చిన ఉద్యోగాలను కూడా ఈ సదస్సులో వివరించనున్నారు. తద్వారా కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయనున్నారు.
పోటీగా అధికార పార్టీ..
ఇక, బీఆర్ ఎస్ చేపట్టిన యువ సంగ్రామ సదస్సుకు పోటీగా.. అధికార కాంగ్రెస్ పార్టీ.. `నిరుద్యోగులకు పాతర` పేరు తో మరో కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది కూడా సేమ్ టు సేమ్ .. బీఆర్ఎస్ నిర్వహించే సదస్సు సమయంలోనే చేపట్టనున్నారు. గాంధీ భవన్‌లో చేపట్టే ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగులు ఏవిధంగా మోస పోయారు? ఉన్నత చదువులు చదివిన వారికి సైతం ఉపాధి లేకుండా పోయిన వైనం.. గొర్రెలు పంపిణీ చేసి.. యువతను నిర్వీర్యం చేసిన విధానం వంటివాటిని వివరించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ సదస్సుకు.. ఇటీవల ఉద్యోగాలు దక్కించుకున్న యువతను ఆహ్వానించారు. తద్వారా యువతకు రేవంత్ రెడ్డి సర్కారు చేసిన మేలును.. అదే సమయంలో బీఆర్ఎస్ చేసిన అన్యాయాలను ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఏకరువు పెట్టనున్నారు.
