Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ Vs సీఎం రమేశ్.. మాజీ ఎమ్మెల్యే గాదరికి షాక్ ఇచ్చిన ఎంపీ

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ మధ్య వివాదం మరో మలుపు తిరిగింది.

By:  Tupaki Desk   |   20 Sept 2025 1:49 PM IST
బీఆర్ఎస్ Vs సీఎం రమేశ్.. మాజీ ఎమ్మెల్యే గాదరికి షాక్ ఇచ్చిన ఎంపీ
X

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ మధ్య వివాదం మరో మలుపు తిరిగింది. బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రయత్నాలు జరిగాయని గతంలో సీఎం రమేశ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయనను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు పలు విమర్శలు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు సీఎం రమేశ్ పై విరుచుకుపడ్డారు. అయితే తనపై విమర్శలు చేసిన వారిపై ఎదురుదాడి చేసిన బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ పై మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణకు రమ్మంటూ పోలీసులు మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు పంపారు.

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేసే ప్రతిపాదనపై కేటీఆర్ తనతో చెప్పినట్లు ఎంపీ సీఎం రమేశ్ గతంలో వెల్లడించారు. తెలంగాణలో సీఎం రమేశ్ కి చెందిన కాంట్రాక్టు కంపెనీకి నామినేషన్ ప్రాతిపదికన వందల కోట్లు పనులు అప్పగించారని బీఆర్ఎస్ వర్కింగు ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు చేయడంతో సీఎం రమేశ్.. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ప్రయత్నాలు జరిగాయని ఎదురుదాడి చేశారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నేతలు ఎంపీ సీఎం రమేశ్ పై తీవ్ర విమర్శలు చేయగా, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మాత్రం వ్యక్తిగత దూషణలకు దిగడంపై ఎంపీ సీఎం రమేశ్ మనస్తాపానికి లోనయ్యారని చెబుతున్నారు.

దీంతో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ పై ఎంపీ సీఎం రమేశ్ జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆరోపించారు. వ్యక్తిగత దూషణలకు దిగిన వారిపై తాను మాట్లాడితే వారికి ఎక్కువ విలువ ఇచ్చినట్లు అవుతుందన్న భావనతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. ఎంపీ ఫిర్యాదుతో జూబ్లిహిల్స్ పోలీసులు గాదరి కిషోర్ కు నోటీసులు జారీ చేశారు. ఆదివారం ఉదయం పది గంటలకు పోలీసు స్టేషనుకు రావాలని నోటీసులు జారీ చేశారు.

ఈ పరిస్థితుల్లో సీఎం రమేశ్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య కొనసాగుతున్న వివాదం ఎటువంటి మలుపు తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది. ఫ్యూచర్ సిటీ రోడ్డు కాంట్రాక్టును సీఎం రమేశ్ కంపెనీకి అప్పగించడంతో వివాదం మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీఎం రమేశ్ కు చీకటి ఒప్పందం ఉందని కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం పెను సంచలనమైంది. బీజేపీ-కాంగ్రెస్ ముఖ్యమంత్రికి మధ్య సీఎం రమేశ్ వారదిలా పనిచేస్తున్నారన్న కోణంలో కేటీఆర్ టార్గెట్ చేయడం, ఆ ఆరోపణలను తిప్పికొట్టేందుకు బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రయత్నాలు జరిగాయని సీఎం రమేశ్ ప్రత్యారోపణలు చేయడం కాకపుట్టించింది. ఇన్నాళ్లు మాటలకే పరిమితమైన ఈ యుద్ధంలో ఇప్పుడు పోలీసు జోక్యం వరకు వెళ్లడం రాజకీయ వాతావరణాన్ని హీటెక్కిస్తోంది.