ఆమె చుట్టే ‘బీఆర్ఎస్ బతుకమ్మ’.. ఈ సారి కవిత ప్లేస్ ను భర్తీ చేసేది ఆమె..
మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుమార్తె కల్వకుంట్ల కవిత లేకుండా బీఆర్ఎస్ పార్టీ బతుకమ్మ పండుగను నిర్వహిస్తోంది.
By: Tupaki Desk | 19 Sept 2025 10:00 PM ISTమాజీ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత జాగృతి పేరిట ప్రతి ఏటా బతుకమ్మ పండగ నిర్వహించేది. అయితే ఇది పార్టీ కార్యక్రమంలాగా సాగేది. కానీ ఇప్పుడు ఆమె పార్టీ నుంచి వెళ్లిపోవడంతో బతుకమ్మ పండగను నిర్వహించేందుకు పార్టీలో ఎవరు అర్హులు అని సెర్చ్ చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ పద్మా దేవేందర్ రెడ్డి పేరును సూచించినట్లు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.
రెండు దశాబ్దాలలో ఇదే ప్రథమం..
రెండు దశాబ్దాలలో తొలిసారిగా భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుమార్తె కల్వకుంట్ల కవిత లేకుండా బీఆర్ఎస్ పార్టీ బతుకమ్మ పండుగను నిర్వహిస్తోంది. బతుకమ్మ పండుగకు కొత్త ఇమేజ్ ఇవ్వడంలో కవిత కీలక పాత్ర పోషించిందని తెలిసిందే. వాస్తవానికి, కవిత బతుకమ్మ పండుగకు పర్యాయపదంగా మారింది, బీఆర్ఎస్ ఇన్నాళ్లూ తన రాజకీయ అవసరాల కోసం పండుగను ఉపయోగించుకుంది.
సొంత ప్రచారానికి ‘తెలంగాణ జాగృతి’
ఇప్పుడు కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లింది. తన సంస్థ ‘తెలంగాణ జాగృతి’ ద్వారా బతుకమ్మ పండుగ నిర్వహించాలని అనుకుంటుంది. అలాగే తన వ్యక్తిగత ప్రచారం చేసుకునేందుకు కూడా ఉపయోగించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఇప్పుడు బతుకమ్మ ఐకాన్ కోసం గాలించడం మొదలు పెట్టింది. ఆమె స్థానంలో ప్రత్యామ్నాయ నాయకురాలిని వెతుకుతోంది.
పద్మాదేవేందర్ కు ఎందుకు..?
పార్టీ బతుకమ్మ ప్రచారానికి కొత్త ఇమేజ్ ఇచ్చే బాధ్యతను కేసీఆర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డికి అప్పగించినట్లు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, కేటీఆర్ సన్నిహితుడైన పద్మాదేవేందర్ రెడ్డి బీఆర్ఎస్ లో చురుకుగా ఉన్నప్పుడు కవితతో పాటు బతుకమ్మ ఉత్సవాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఈ ఏడాది బీఆర్ఎస్ తరఫున పద్మాదేవేందర్ రెడ్డి బతుకమ్మ ఉత్సవాలను చూసుకుంటున్నారు.
బతుకమ్మ పాటలు ఆవిష్కరణ
గురువారం (సెప్టెంబర్ 18) తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ కు చెందిన ఇతర మహిళా సభ్యులతో కలిసి మూడు బతుకమ్మ పాటలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ జడ్పీ చైర్మన్లు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.
పార్టీ ఇమేజ్ ను పెంచుకోవాలని అనుకుంటున్న బీఆర్ఎస్
కొత్తగా విడుదలైన పాటలు మహిళలు అదే స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడటానికి సహాయపడతాయని వారు చెప్పారు. రిలీజ్ తర్వాత మహిళా నేతలు కొత్త పాటల కోసం బతుకమ్మ వాయించి సింబాలిక్ పొలిటికల్ మెసేజ్ పంపారు. చంద్రశేఖర్ రావు బతుకమ్మ, బోనాలు పండుగలను అధికారిక కార్యక్రమాలుగా చేసి, మహిళలకు చీరలను బహుమతిగా ఇచ్చి ఈ పండుగలను ప్రజా ఉద్యమంగా మార్చారని కోవాలక్ష్మి, పద్మ దేవేందర్ రెడ్డి గుర్తు చేశారు.
