Begin typing your search above and press return to search.

మహా టీవీ ఆఫీస్‌పై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి: ఆస్తుల ధ్వంసం, ఉద్రిక్తత

గత కొన్ని రోజులుగా కేటీఆర్‌పై మహా టీవీలో తప్పుడు కథనాలు ప్రసారం అవుతున్నాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

By:  Tupaki Desk   |   28 Jun 2025 3:50 PM IST
మహా టీవీ ఆఫీస్‌పై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి: ఆస్తుల ధ్వంసం, ఉద్రిక్తత
X

ఫోన్ ట్యాపింగ్ అంశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్ల తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ ఆగ్రహించిన బీఆర్ఎస్ కార్యకర్తలు శుక్రవారం మహా టీవీ కార్యాలయంపై దాడి చేశారు. ఈ దాడిలో ఆఫీస్ అద్దాలు, కార్లు, స్టూడియో ధ్వంసమయ్యాయి. కార్యకర్తలు ఆఫీసులోకి ప్రవేశించి నిరసన తెలపడం, ఆస్తులను ధ్వంసం చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

గత కొన్ని రోజులుగా కేటీఆర్‌పై మహా టీవీలో తప్పుడు కథనాలు ప్రసారం అవుతున్నాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మహా టీవీ ఆఫీస్ ముందు ధర్నాకు దిగిన గులాబీ పార్టీ నేతలు, ఆ తర్వాత ఆఫీసులోకి చొరబడి దాడికి పాల్పడ్డారు. మహా న్యూస్ సిబ్బంది తమపై "ఓవర్‌గా రియాక్ట్" అయ్యారని కార్యకర్తలు ఆరోపించారు.

ఈ దాడిలో మహా న్యూస్ ఆఫీస్ అద్దాలు, రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేటీఆర్ పట్ల తప్పుడు వార్తలు ప్రసారం చేయడమే ఈ దాడికి కారణమని బీఆర్ఎస్ కార్యకర్తలు స్పష్టం చేశారు. ఈ సంఘటనపై మహా న్యూస్ చీఫ్ వంశీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

- దాడిని ఖండించిన పవన్ కళ్యాణ్:

మహా టీవీపై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. మీడియాను సమాజానికి నాలుగో స్తంభంగా అభివర్ణించిన ఆయన, మీడియాపై దాడి చేయడం తగదని వ్యాఖ్యానించారు. అందరూ సంయమనం పాటించాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.