కేసీఆర్ గారూ.. ఇదేదో పెద్ద చిక్కేనే!
కానీ, పోలీసుల నుంచి అనుమతులు రాలేదు. దీంతో కోర్టు వరకు విషయం చేరింది. దీనిపై ప్రస్తుతం విచారణ వాయిదా పడింది. ఈ నెల 22 న జరిగే అవకాశం ఉంది.
By: Tupaki Desk | 22 April 2025 5:15 AM ISTబీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌కు కొత్త చిక్కే వచ్చిపడింది. ప్రస్తుతం ఈ నెల 27న పార్టీ ఆవిర్భవించి.. పాతికేళ్లు అయిన సందర్భంగా పెద్ద ఎత్తున రజతోత్సవాలునిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిని వరంగల్‌లో నిర్వహించాలని ప్లాన్ చేశారు. కానీ, పోలీసుల నుంచి అనుమతులు రాలేదు. దీంతో కోర్టు వరకు విషయం చేరింది. దీనిపై ప్రస్తుతం విచారణ వాయిదా పడింది. ఈ నెల 22 న జరిగే అవకాశం ఉంది.
ఇదిలావుంటే.. మరోవైపు.. పార్టీ నాయకుల మధ్య కార్యక్రమం నిర్వహణ విషయంలో సమన్వయ లోపం కనిపిస్తోంది. నాయకులు కార్యకర్తలను పోగేసే క్రమంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా కూడా వ్యవహరిస్తున్నారు. దీంతో వారిని అదిలించి.. కదిలించి.. కార్యక్రమాలు సక్సెస్ చేయడం ఇప్పుడు సవాలుతో కూడుకున్న వ్యవహారంగా మారింది.
మరోవైపు.. తాజాగా.. రాజకీయ విమర్శలు వేడెక్కుతున్నాయి. ``రజతోత్సవం ఎవరికి?`` అంటూ.. కాంగ్రెస్ , బీజేపీల నుంచి ఎద్దేవాలు.. విమర్శలు వినిపిస్తున్నాయి. ``టీఆర్ ఎస్ పార్టీ పుట్టి ఉంటే.. దానికి పాతికేళ్ల పండగ చేయాల. టీఆర్ ఎస్ పార్టీ లేదాయె. మరి ఎవరికి చేస్తున్న్రు`` అంటూ.. నాయకులు మూతి సాగదీసి మరీ నిలదీస్తున్నారు. ఇక, బీజేపీ నాయకుల వాదన కూడా ఇలాన ఉంది. బీఆర్ ఎస్ పార్టీ పుట్టి మూడు శుక్రవారాలు కూడా కాకుండానే రజతోత్సవమా? అంటూ.. ప్రశ్నిస్తున్నారు.
ఇక, పాంప్లేట్‌లు, బ్యానర్లలోనూ.. ఏం రాయలన్న విషయంపై సొంత పార్టీ నాయకులు కూడా తర్జన భర్జన పడుతున్నారు. టీఆర్ ఎస్ అని రాయాలా? లేక బీఆర్ ఎస్ అని రాయాలా.. అని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి టీఆర్ ఎస్ లేదు. ప్రస్తుతం బీఆర్ ఎస్ మాత్రమే ఉంది. కానీ, ఇది పుట్టి పాతికేళ్లు అవలేదు. అయితే.. ఈ రాజకీయ గందరగోళం వెనుక.. బీజేపీ శక్తులు ఉన్నాయని బీఆర్ ఎస్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికి బీఆర్ ఎస్ అనే ఖరారు చేశారు.
