Begin typing your search above and press return to search.

అలంపూర్ లో తమ్ముడు.. సిర్పూర్ లో అన్న.. భలే పోరాటం

అయితే, ఈ రెండు నియోజకవర్గాలకు ప్రస్తుతం లింకు కుదిరింది. అదెలాగంటే.. స్వయానా అన్నదమ్ములు వీటిలో పోటీ చేస్తున్నందున.

By:  Tupaki Desk   |   15 Nov 2023 7:08 AM GMT
అలంపూర్ లో తమ్ముడు.. సిర్పూర్ లో అన్న.. భలే పోరాటం
X

తెలంగాణ రాష్ట్రంలో ఆ నియోజకవర్గం ఓ చివరన ఉంటే.. ఈ నియోజకవర్గం మరో చివరన ఉంది.. రెండింటికీ భౌగోళికంగా ఎంత దూరం ఉందో.. కల్చరల్ పరంగానూ అంతే దూరం ఉంది.. ఒకటి రాయలసీమ సరిహద్దులో ఉంటే.. మరోటి మహారాష్ట్రకు అత్యంత సమీపంలో ఉంది. అయితే, ఈ రెండు నియోజకవర్గాలకు ప్రస్తుతం లింకు కుదిరింది. అదెలాగంటే.. స్వయానా అన్నదమ్ములు వీటిలో పోటీ చేస్తున్నందున.

ఆ కొసన అలంపూర్

తెలంగాణ సరిహద్దులో.. ఏపీలోని రాయలసీమ ముఖ ద్వారమైన కర్నూలుకు కూతవేటు దూరంలో ఉంటుంది అలంపూర్. మరీ ముఖ్యంగా అలంపూర్ చౌరస్తా నుంచి చూస్తే.. కర్నూలు జిల్లా కనిపించేంద దూరంలోనే ఉంటుంది. అలంపూర్.. జోగుళాంబ అమ్మవారు కొలువైన శక్తిపీఠం. అష్టాదశ శక్తిపీఠాల్లో ఇది ఒకటి. ఈ నియోజకవర్గం 2009కి ముందు జనరల్ గా ఉంది. 2009లో ఎస్సీలకు రిజర్వ్ అయింది. నాటి తొలి ఎన్నికల్లోనే డాక్టర్ ప్రసన్నకుమార్ టీడీపీ తరఫున పోటీ చేశారు. నాడు మహా కూటమి పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించిన ఈ స్థానంలో.. రాజేంద్రనగర్ వ్యవసాయ వర్సిటీ ప్రొఫెసర్ గా ఉన్న డాక్టర్ ప్రసన్న పోటీ చేశారు. అయితే, కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ అబ్రహం చేతిలో పరాజయం పాలయ్యారు.

ఈ చివరన సిర్పూర్

తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ లో ఉన్న నియోజకవర్గం సిర్పూర్ కాగజ్ నగర్. జనరల్ స్థానమైన ఇక్కడినుంచి కోనేరు కోనప్ప మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆంధ్రా పారంతానికి చెందినప్పటికీ.. సిర్పూర్ లో దశాబ్దాల కిందటనే స్థిరపడి మంచి పేరు తెచ్చకున్నారు కోనప్ప. రోజూ వెయ్యి మందికి నిత్యాన్నదానం చేస్తూ సేవా తత్పరత చాటుకున్నారు. 2004లో కాంగ్రెస్ నుంచి 2014లో బీఎస్పీ నుంచి, 2018లో బీఆర్ఎస్ నుంచి గెలిచారు కోనప్ప. మరోసారి బీఆర్ఎస్ తరపునే పోటీ చేస్తున్నారు. అయితే, కోనప్పను సవాల్ చేస్తూ.. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ బరిలో దిగారు. వాస్తవానికి ఎస్సీ సామాజిక వర్గానికి డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఏదైనా రిజర్వుడ్ నియోజవకర్గాన్ని ఎంచుకునే వీలుంది. అందులోనూ ఆయన సొంత నియోజకవర్గం అలంపూర్ ఎస్సీ రిజర్వుడ్. కానీ, ప్రవీణ్ కుమార్ మాత్రం సిర్పూర్ (జనరల్)ను ఎంచుకుని ప్రత్యేకత చాటుకున్నారు.

ఉన్నత విద్యావంతులు.. ఉన్నతాధికారులు

డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ ప్రసన్నకుమార్ స్వయానా అన్నదమ్ములు. వీరిలో ప్రవీణ్ కుమార్ పెద్దవారు. సివిల్ సర్వీస్ (ఐపీఎస్) సాధించిన ప్రవీణ్ ఉమ్మడి ఏపీ, తెలంగాణలో పోలీస్ ఉన్నతాధికారిగా పనిచేశారు. రెండేళ్ల కిందట పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఆ పార్టీని రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం చేశారు. ప్రసన్నకుమార్ 2009లో ఓటమి తర్వాత మరోసారి ఉద్యోగ బాధ్యతల్లోకి వెళ్లినట్లు తెలిసింది. ఇప్పుడు బీఎస్పీ తరఫున అలంపూర్ నుంచి బరిలో దిగారు. మరి వీరిద్దరి రాజకీయ భవితవ్యం ఏమిటో డిసెంబరు 3న తేలనుంది.