Begin typing your search above and press return to search.

టర్కీలో బ్రిటిష్ మహిళ అనుమానాస్పద మృతి.. గుండె లేకుండా మృతదేహం అప్పగింత

టర్కీలో ఒక సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. బ్రిటన్‌కు చెందిన ఒక మహిళ హఠాత్మక మరణం తర్వాత ఆమె గుండెను తొలగించారని మీడియా నివేదికలు ఆరోపిస్తున్నాయి

By:  Tupaki Desk   |   29 May 2025 12:00 AM IST
టర్కీలో బ్రిటిష్ మహిళ అనుమానాస్పద మృతి.. గుండె లేకుండా మృతదేహం అప్పగింత
X

టర్కీలో ఒక సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. బ్రిటన్‌కు చెందిన ఒక మహిళ హఠాత్మక మరణం తర్వాత ఆమె గుండెను తొలగించారని మీడియా నివేదికలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసు మీద దర్యాప్తు జరుగుతోంది. ఇస్తాంబుల్‌లోని ఒక ప్రముఖ ఆసుపత్రి మీద ఈ కేసు విషయంలో తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సెలవులకు వెళ్లి మరణించిన బెత్ మార్టిన్

మృతురాలిని పోర్ట్స్‌మౌత్‌కు చెందిన బెత్ మార్టిన్ (28)గా గుర్తించారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన మార్టిన్, సెలవుల కోసం టర్కీకి వెళ్లింది. యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి ఇస్తాంబుల్‌కు విమానంలో ప్రయాణిస్తుండగానే ఆమెకు ఆరోగ్యం బాగోలేదనిపించింది. మొదట ఇది ఫుడ్ పాయిజనింగ్ అని భావించి ఆమె లక్షణాలను పెద్దగా పట్టించుకోలేదు. అయితే, టర్కీకి చేరుకున్న తర్వాత ఆమె పరిస్థితి చాలా వేగంగా క్షీణించింది.

ఆసుపత్రిలో మృతి.. భర్తపైనే అనుమానం!

దిగిన కొన్ని గంటల్లోనే మార్టిన్ నిస్సత్తువగా మారి, ఇస్తాంబుల్‌లోని మర్మారా యూనివర్సిటీ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చేరిన ఒక రోజు తర్వాత అంటే ఏప్రిల్ 29న ఆమె మరణించింది. ఆమె మరణించిన వెంటనే, టర్కీ అధికారులు ఆమె భర్త లూక్ మార్టిన్ ఆమెకు విషమిచ్చి ఉంటాడని అనుమానించారు. కుటుంబ సభ్యులు లూక్‌ను మొదట తన భార్య మృతదేహాన్ని చూడటానికి కూడా అనుమతించలేదు. ఆసుపత్రి అధికారులతో బతిమాలి, వేడుకున్న తర్వాత చివరకు ఆమెకు చివరిసారి వీడ్కోలు చెప్పడానికి అనుమతించారు.

"నా గుండె ముక్కలైంది": భర్త ఆవేదన

కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన క్రౌడ్‌ఫండింగ్ పేజీలో లూక్ మార్టిన్ ఎంతో భావోద్వేగమైన సందేశాన్ని రాశారు. "ఇది నా జీవితంలోనే అత్యంత దారుణమైన, ఆందోళన కలిగించిన వారం. వీటన్నిటికీ పరాకాష్ఠగా.. అమ్మ ఇక ఇంటికి రాదని నా పిల్లలకు చెప్పాల్సి వచ్చింది. అది నన్ను ముక్కలు చేసింది. నా పిల్లలు ఇంటికి వెళ్లడానికి కుటుంబ సభ్యులతో బయలుదేరుతున్నప్పుడు.. వాళ్లు నా నుంచి దూరం అవుతుంటే నా గుండె మరింత బద్దలైంది." అంటూ రాసుకొచ్చారు.

ఆటోప్సీలో షాకింగ్ నిజం

ఈ కేసు బెత్ మార్టిన్ మృతదేహం నుంచి ఆమె గుండె అదృశ్యమైందని వచ్చిన ఆరోపణలతో షాకింగ్ మలుపు తిరిగింది. ఈ ఆరోపణలు ఆమె కుటుంబానికి తీవ్ర దుఃఖం, గందరగోళాన్ని కలిగించాయి. దీనిపై విస్తృత ఆందోళన వ్యక్తమైంది. మృతదేహం నుంచి గుండె ఎలా అదృశ్యమైందనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

టర్కీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన

ఈ మేరకు టర్కీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. బెత్ మార్టిన్ "బహుళ అవయవ వైఫల్యం (multiple organ failure) కారణంగా గుండె ఆగిపోవడం (cardiac arrest)" వల్ల మరణించిందని ధృవీకరించింది. మార్మారా యూనివర్సిటీ ఆసుపత్రిలో ఆమెకు ఎటువంటి శస్త్రచికిత్సలు జరగలేదని మంత్రిత్వ శాఖ మరింత స్పష్టం చేసింది.

మార్టిన్ భర్త చెప్పిన వివరాల ఆధారంగా.. వారు ప్రయాణానికి ముందు UKలో తిన్న ఆహారం వల్ల విషప్రయోగం జరిగి ఉండవచ్చని పేర్కొన్నారు. దీనివల్ల దీనిని ఫోరెన్సిక్ కేసుగా వర్గీకరించారు. ఫోరెన్సిక్ కేస్ ప్రొసీజర్కు అనుగుణంగా ప్రాథమిక పోస్ట్‌మార్టం (కోత లేకుండా) నిర్వహించారు. అయితే, ఈ ప్రక్రియ ద్వారా మరణానికి ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించలేకపోయామని మంత్రిత్వ శాఖ అంగీకరించింది.

టర్కీ అధికారులు అప్పటి నుండి బెత్ మార్టిన్ మరణంపై అధికారిక దర్యాప్తును ప్రారంభించారు. ఆమెకు చికిత్స అందించిన మార్మారా యూనివర్సిటీ ఆసుపత్రి మీద దర్యాప్తు జరుపుతున్నారు. ఈ దారుణం వెనుక అసలు నిజాలు ఎప్పుడు బయటపడతాయో చూడాలి.