Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు కనిపించిన బ్రిటన్ యువరాణి.. పుకార్లకు చెక్ పడినట్లే

అవును.. నెలల తరబడి బయట ప్రపంచానికి కనిపించని బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ మీద వస్తున్న పుకార్లు అన్ని ఇన్ని కావు.

By:  Tupaki Desk   |   20 March 2024 4:30 PM GMT
ఎట్టకేలకు కనిపించిన బ్రిటన్ యువరాణి.. పుకార్లకు చెక్ పడినట్లే
X

అవును.. నెలల తరబడి బయట ప్రపంచానికి కనిపించని బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ మీద వస్తున్న పుకార్లు అన్ని ఇన్ని కావు. తాజాగా వీటికి చెక్ పడేలా ఆమె కెమేరా కంటికి చిక్కారు. దీంతో.. గడిచిన కొన్ని రోజులుగా యువరాణి ఆరోగ్యంపై పెల్లుబుకుతున్న సందేహాలకు సమాధానం లభించినట్లైంది. ఆమె బహిరంగంగా కనిపించటంపై బ్రిటిష్ మీడియా హర్షం వ్యక్తం చేసింది. కేట్ మిడల్టన్ కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో ఉండటం.. ఆమెకు సర్జరీ జరిగిందన్న వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నుంచి ఆమె కనిపించలేదు.

ఇటీవల మదర్స్ డే సందర్భంగా విడుదల చేసిన ఫోటో వివాదాస్పదం కావటం.. ఆ ఫోటోను మార్ఫింగ్ చేయాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నతో పాటు.. అసలు యువరాణి ఎక్కడున్నారు? ఆమెకు ఏమైంది? లాంటి సందేహాలు ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఆమె షాపింగ్ చేస్తూ చలాకీగా నడుస్తూ నవ్వుతూ వెళుతున్న వైనం కెమేరా కంటికి చిక్కింది. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

తన భర్త ప్రిన్స్ విలియమ్ తో కలిసి లండన్ సమీపంలోని విండర్స్ ఫార్మ్స్ లో కనిపించారు. ఒక క్రీడా కార్యక్రమానికి కేట్ మిడిల్టన్ తన భర్త.. ముగ్గురు పిల్లలతో కలిసి హాజరైనట్లుగా చెబుతున్నారు. గత డిసెంబరు నుంచి బయట ప్రపంచానికి కనిపించకుండా ఉండిపోయిన కేట్ పై బోలెడన్ని సందేహాలు వ్యక్తం కావటం తెలిసిందే. దీనికి తోడు బ్రిటిష్ రాజభవనమైన కెన్సింగ్టన్ ప్యాలెస్ లోని పలువురు ఉద్య్గోగులు సైతం తాము కేట్ మిడిల్టన్ ను చాలా రోజులుగా చూడటం లేదని చెప్పటంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆమె కెమేరా కంటికి చిక్కటంతో ఇప్పటివరకు వెల్లువెత్తుతున్న సందేహాలకు సమాధానం దొరికినట్లైంది.