Begin typing your search above and press return to search.

మాంద్యంలోకి బ్రిటన్.. ఇబ్బందుల్లో సునాక్ సర్కార్

ఒకప్పుడు ప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేసుకున్న యూనైటెడ్ కింగ్ డమ్ అదేనండి బ్రిటన్ గడిచిన కొన్నేళ్లుగా పలు ఇబ్బందులకు గురవుతూ వస్తోంది

By:  Tupaki Desk   |   16 Feb 2024 4:13 AM GMT
మాంద్యంలోకి బ్రిటన్.. ఇబ్బందుల్లో సునాక్ సర్కార్
X

ఒకప్పుడు ప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేసుకున్న యూనైటెడ్ కింగ్ డమ్ అదేనండి బ్రిటన్ గడిచిన కొన్నేళ్లుగా పలు ఇబ్బందులకు గురవుతూ వస్తోంది. మాయదారి కరోనా ఆ దేశాన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ప్రస్తుతం మాంద్యం కోరలు ఆ దేశాన్ని.. దేశ ఆర్థిక స్థితిని ఇబ్బందికర పరిస్థితుల్లోకి తీసుకెళుతున్నాయి. దీంతో..దాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక రిషి సునాక్ సర్కారు కిందా మీదా పడుతోంది. భారత మూలాలున్న రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎంపిక కావటం తెలిసిందే.

ఆయన ఏలుబడిలో మాంద్యం నుంచి దేశాన్నిబయటపెడతానని.. దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తానని చెప్పినప్పటికీ.. ఆయన తన హామీని నెరవేర్చుకోలేని పరిస్థితి నెలకొంది. తాజాగా విడుదలైన గణాంకాల్ని చూస్తే.. దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుందన్న సంకేతాలు స్పష్టమయ్యాయి. దీనికి కారణం 2023 చివరి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లిందని గణాంకాలు తేలుస్తున్నాయి. చివరి మూడు నెలల్లో యూకే జీడీపీ 0.3శాతం క్షీణించినట్లుగా బ్రిటన్ జాతీయ గణాంక కార్యాలయం వెల్లడించింది.

పారిశ్రామికోత్పత్తి.. నిర్మాణ రంగంలో నెలకొన్న స్తబ్ధత మాంద్యానికి కారణాలుగా భావిస్తున్నారు. వాస్తవానికి జీడీపీ క్షీణత 0.1 శాతం ఉండొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేయగా.. అంతకు మించి క్షీణత ఉండటం రిషి సర్కారుకు ఇబ్బందికరంగా మారింది. ఈ ఏడాది ఎన్నికలు జరుగుతున్న వేళ.. ప్రభుత్వానికి ఈ పరిస్థితి ఊపిరి ఆడనివ్వకుండా చేస్తోంది. సాధారణంగా రెండు త్రైమాసికాల్లో జీడీపీ మందగమనం నమోదైతే దాన్ని మాంద్యంగా వ్యవహరిస్తారు. బ్రిటన్ జీడీపీ అంతకు ముందు త్రైమాసికంలోనూ 0.1 శాతం క్షీణించింది. దీంతో.. చివరి త్రైమాసికంలో మాంద్యంలోకి జారుకున్నట్లైంది. 2020 తొలి ఆర్థ భాగంలో ఒకసారి మాంద్యంలోకి జారుకోగా.. మళ్లీ ఇప్పుడే అలాంటి పరిస్థితి నెలకొంది.

రిషి సునాక్ నాయకత్వం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీకి ఈ ఎన్నికల్లో మాంద్యం పరిస్థితులు ప్రతికూలంగా మారతాయని చెబుతున్నారు. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను గాడిలోకి పెడతానన్న హామీతో అధికారంలోకి వచ్చిన సునాక్.. ఎన్నికల వేళ ప్రజలకు ఏమని సమాధానం చెబుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.. ఓవైపు ప్రతిపక్ష లేబర్ పార్టీ ప్రజాదరణలో ముందు ఉన్నట్లుగా సర్వే రిపోర్టులు చెబుతున్న వేళ.. ఆర్థిక పరిస్థితి మాంద్యంలోకి జారుకుందన్న మాట ఇబ్బందికి గురి చేసేలా మారిందని చెప్పాలి.