కోటి కోసం కోసిన కాళ్లు: డబ్బు కోసం దారుణం!
అయితే నెయిల్ మాత్రం తన ఆరోగ్య పరిస్థితి నిజమైనదేనని, నిపుణుల సూచన మేరకే ఆపరేషన్‌కు ఒప్పుకున్నానని వాదిస్తున్నాడు.
By: Tupaki Desk | 26 July 2025 8:00 AM ISTడబ్బు మనుషులను ఎంతకైనా దిగజారుస్తుందని అనడానికి బ్రిటన్‌లో జరిగిన ఈ ఘటన ఒక నిస్సిగ్గు ఉదాహరణ. సాధారణంగా బీమా డబ్బులు అందలేదని ప్రజలు సంస్థలపై కోర్టులకు వెళుతుంటారు. కానీ ఈసారి కథ పూర్తిగా భిన్నంగా సాగింది. ఓ వ్యక్తిపై ఏకంగా బీమా కంపెనీలే మోసం కేసు దాఖలు చేశాయి. ఆ వ్యక్తి పేరు నెయిల్ హాపర్. కోట్లాది రూపాయల కోసం తన రెండు కాళ్లను స్వయంగా తొలగించుకున్నాడన్నది అతనిపై ఉన్న ప్రధాన ఆరోపణ.
లక్షల పౌండ్ల కోసం శరీర భాగాల తొలగింపు!
నెయిల్ హాపర్ లక్ష్యం ఏకంగా సుమారు రూ. 5 కోట్లు (దాదాపు 5 లక్షల పౌండ్లు) విలువ చేసే బీమా క్లెయిమ్‌ను పొందడం. ఈ దురాలోచనతో నెయిల్ ముందుగా కొన్ని వెబ్‌సైట్ల నుండి శరీర అవయవాల తొలగింపు గురించిన వీడియోలను కొనుగోలు చేశాడు. ఆ వీడియోల ఆధారంగా, తన సన్నిహితుడైన డాక్టర్ మారియస్ గుత్సావ్‌సన్ సహాయంతో తన రెండు కాళ్లను శస్త్రచికిత్స ద్వారా తొలగించుకున్నాడు. ఈ ఆపరేషన్ తర్వాత, నెయిల్ బీమా కంపెనీలను సంప్రదించి, తనకు రక్తనాళాల సమస్య ఉందని, కాళ్లను తీసివేయకపోతే ప్రాణాలకే ప్రమాదమని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే, సంస్థలకు అతని కథనంపై అనుమానం కలిగింది. ఎందుకంటే, ఇలాంటి కీలక ఆపరేషన్లకు ముందుగా బీమా కంపెనీల అనుమతి తప్పనిసరిగా ఉండాలి.
- క్లెయిమ్ తిరస్కరణ.. కేసు విచారణ
బీమా కంపెనీలు నెయిల్ క్లెయిమ్‌ను తిరస్కరించడమే కాకుండా, మోసపూరితంగా డబ్బులు పొందాలని ప్రయత్నించాడని అతనిపై కేసు వేశాయి. అంతేకాదు, మారియస్ గుత్సావ్‌సన్ అనే డాక్టర్‌ను కూడా ప్రభావితం చేసి, ఇతరుల మోకాళ్లను తొలగించేలా ప్రేరేపించాడని నెయిల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ ఆరోపణలతో పోలీసులు నెయిల్ హాపర్‌ను అరెస్ట్ చేశారు. అతను పనిచేస్తున్న రాయల్ కార్నవాల్ ఆసుపత్రి ఉద్యోగం నుంచి కూడా తొలగించబడ్డాడు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణ దశలో ఉంది.
-నెయిల్ స్పందన
అయితే నెయిల్ మాత్రం తన ఆరోగ్య పరిస్థితి నిజమైనదేనని, నిపుణుల సూచన మేరకే ఆపరేషన్‌కు ఒప్పుకున్నానని వాదిస్తున్నాడు. కాళ్లు ఉన్నప్పటి కంటే ఇప్పుడే జీవితం బాగుందని చెప్పుకొచ్చాడు. తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని అంటున్నాడు.
ఈ సంఘటన మానవ విలువల కన్నా డబ్బు విలువ ఎక్కువైపోయిన రోజులు వచ్చాయనే భావనను కలిగిస్తుంది. వైద్య వృత్తి ఏ స్థాయికి దిగజారుతుందో చూస్తే బాధ కలగక మానదు. జీవితాలను రక్షించే బాధ్యతలో ఉన్నవారే ఇలాంటి చర్యలకు పాల్పడితే, సామాజిక నైతికతపై ఎంతటి ప్రభావం ఉంటుందో ఊహించగలిగితే సరిపోతుంది.
ఈ కేసు ఫలితం ఏదైనా కావచ్చు, కానీ ఇది తప్పకుండా మనల్ని ఆలోచింపజేసే ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటనగా నిలిచిపోతుంది. డబ్బు కోసం మానవత్వం ఎంతగా దిగజారిపోతుందో ఇది కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది.
