Begin typing your search above and press return to search.

సీజేపీపై బ్రిజ్ భూషణ్ సంచలన ఆరోపణలు.. అంతర్జాతీయ కుట్రపై అనుమానాలు

దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై నగరాల్లో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ‘లహరా దో తిరంగా’ నిరసన ప్రదర్శనలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

By:  Tupaki Desk   |   16 Oct 2026 7:43 PM IST
సీజేపీపై బ్రిజ్ భూషణ్ సంచలన ఆరోపణలు.. అంతర్జాతీయ కుట్రపై అనుమానాలు
X

దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై నగరాల్లో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ‘లహరా దో తిరంగా’ నిరసన ప్రదర్శనలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నిరసనలపై భారతీయ జనతా పార్టీ మాజీ ఎంపీ, సీనియర్ నేత బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అత్యంత సంచలన వ్యాఖ్యలు చేశారు. సీజేపీ ఆందోళనలు, నిరసనల వెనుక అంతర్జాతీయ బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హస్తం ఉందని, ఆయన ఆదేశాల మేరకే సీజేపీ ఉద్యమం నడుస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన బ్రిజ్ భూషన్ సీజేపీ ఆందోళనలను దేశానికి వ్యతిరేకంగా సాగుతున్న ఒక పెద్ద కుట్రగా అభివర్ణించారు.

ఈ సందర్భంగా బ్రిజ్ భూషణ్ మాట్లాడుతూ, నిరసనల ముఖ్య ఉద్దేశం కేవలం రాజకీయ వ్యతిరేకత మాత్రమే కాదని, దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును భయపెట్టాలనే స్పష్టమైన దురుద్దేశంతోనే ఈ ర్యాలీలను ప్లాన్ చేశారని ఆరోపించారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో సుప్రీంకోర్టును టార్గెట్ చేస్తూ ఇలాంటి ప్రదర్శనలు జరగడం ఎప్పుడూ చూడలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఈ ఆందోళనల ద్వారా భారతదేశంలో అశాంతిని సృష్టిస్తూ, మన దేశాన్ని బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ల సరసన నిలబెట్టేలా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో వ్యాపారం చేయాలని భావించే విదేశీ శక్తులు తమ సొంత నిబంధనలు, షరతులతోనే ఇక్కడ వ్యవహరించాలని చూస్తున్నాయని, అలాంటి వారే ఈ నిరసనలకు నిధులు అందిస్తూ ఆజ్యం పోస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.

శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్ 'స్టార్‌లింక్'ను భారత్‌లో ప్రవేశపెట్టే విషయంలో ఎదురవుతున్న తీవ్ర జాప్యంపై ఎలాన్ మస్క్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. భారత్‌కు చెందిన ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని లక్ష్యంగా చేసుకుని, వారు తమ గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవడానికి విదేశీ సంస్థలను అడ్డుకుంటున్నారని మస్క్ ఆరోపణలు గుప్పించారు. స్థానిక మార్కెట్ నిబంధనలు, పాలసీ నిర్ణయాలను అడ్డం పెట్టుకుని తన వ్యాపారాన్ని అడ్డుకుంటున్నారని భావిస్తున్న మస్క్, పరోక్షంగా రాజకీయ విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్రంగా పరిగణించబడుతోంది.

మరోవైపు, మస్క్ వ్యాఖ్యలపై స్పందించిన భారతీయ నేతలు, అధికార వర్గాలు, విదేశీ టెక్ దిగ్గజాలు తమ వ్యాపార ప్రయోజనాల కోసం భారత సార్వభౌమాధికారాన్ని శాసించలేరని తేల్చిచెప్పాయి. చట్టం ముందు ఏ విదేశీ బిలియనీర్ ప్రత్యేకం కాదని, దేశీయ భద్రత, చట్టాలకు కట్టుబడి మాత్రమే ఎవరైనా ఇక్కడ వ్యాపారం చేయాల్సి ఉంటుందని నేతలు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే సీజేపీ చేపడుతున్న నిరసనలకు విదేశీ నిధులు లేదా మద్దతు ఉందనే ఆరోపణలు రావడం, భారత ఆర్థిక వ్యవస్థ, న్యాయ వ్యవస్థను ప్రభావితం చేసేందుకు అంతర్జాతీయ శక్తులు కుట్ర పన్నుతున్నాయనే అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోందని అంటున్నారు.

ఈ ఆరోపణల నడుమ ఢిల్లీ, ముంబైలలో సీజేపీ నిరసనల నేపథ్యంలో పోలీసులు భద్రతను అత్యంత కఠినతరం చేశారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఢిల్లీ కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌లో 'తిరంగా మార్చ్'కు పిలుపునివ్వగా, జాతీయ జెండాను ఎగురవేయడం ప్రతి పౌరుడి ప్రజాస్వామ్య హక్కు అని ఆయన పేర్కొన్నారు. అయితే ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఢిల్లీ పోలీసులు అభిజీత్ నివాసానికి చేరుకుని మార్చ్ నిర్వహించవద్దంటూ నోటీసులు జారీ చేశారు. అంతేగాక, న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ "అడ్మినిస్ట్రేటివ్ కారణాల" దృష్ట్యా సెంట్రల్ పార్క్‌ను మూసివేయగా, ఢిల్లీ పోలీసులు దాదాపు 6,000 మంది పోలీసులను, పారామిలిటరీ బలగాలను మోహరించారు. ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో నిరసన తెలిపేందుకు ముంబై పోలీసులు అనుమతినిచ్చారు. మొత్తానికి ఒక విదేశీ టెక్ కుబేరుడి వ్యాపార ప్రయోజనాలు, దేశీయ రాజకీయ నిరసనలు జాతీయ భద్రత ఒకదానితో ఒకటి ముడిపడటం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది.