తాళి కట్టే వేళ 'లవ్' బాంబ్.. చివరి నిముషంలో వధువు సంచలన నిర్ణయం!
సినిమాల్లో చూసినట్లుగానే.. పెళ్లి మండపంలో సరిగ్గా తాళి కట్టే సమయానికి అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
By: Tupaki Desk | 24 May 2025 2:16 PM ISTసినిమాల్లో చూసినట్లుగానే.. పెళ్లి మండపంలో సరిగ్గా తాళి కట్టే సమయానికి అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. పెళ్లి చేసుకోనంటూ వధువు మొండికేయడంతో వరుడితో పాటు, బంధువులు, పెద్దలు అందరూ నిర్ఘాంతపోయారు. ఈ ఘటన మే 23న హాసన్ పట్టణంలో జరిగింది.
హాసన్‌లోని ఆదిచుంచనగిరి కల్యాణమండపంలో పల్లవి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు వేణుగోపాల్‌ల వివాహం ఘనంగా జరుగుతోంది. శాస్త్రోక్తంగా అన్ని పూజలు, సంప్రదాయాలు పూర్తయ్యాయి. వధూవరులను పెళ్లి వేదికపైకి తీసుకువచ్చారు. ఇంకేముంది, మాంగళ్య ధారణ కార్యక్రమం పూర్తి చేయడమే తరువాయి. సరిగ్గా అదే సమయంలో వధువు పల్లవి సడన్‌గా "ఈ పెళ్లి నాకు వద్దు!" అని తేల్చి చెప్పింది. అందరూ అవాక్కయ్యారు.
లవర్ ఉన్నాడు.. అతడినే చేసుకుంటా!
పల్లవి అక్కడితో ఆగకుండా.. "నేను వేరే అబ్బాయిని ప్రేమిస్తున్నాను, అతడినే పెళ్లి చేసుకుంటాను!" అని తెగేసి చెప్పింది. వెంటనే తన గదిలోకి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు ఎంత బుజ్జగించినా ఆమె వినలేదు. విషయం పోలీసుల దాకా వెళ్లింది. పోలీసులు వచ్చి రాజీ ప్రయత్నాలు చేసినా, పెళ్లికూతురు అస్సలు మెట్టు దిగలేదు.
లక్షలు ఖర్చు.. పరువు పోయింది!
ఇంత పెద్ద నాటకం జరగడంతో వరుడు వేణుగోపాల్ కూడా తీవ్ర అవమానానికి గురయ్యాడు. "ఈ పెళ్లి నేను చేసుకోను!" అని స్పష్టంగా చెప్పేశాడు. ఈ పరిణామాలతో వధువు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పల్లవి మనసు మాత్రం కరగలేదు. పల్లవికి ప్రేమ వ్యవహారం ఉందని తమకు అస్సలు తెలియదని బంధువులు చెప్పారు. తెలిసుంటే ఈ పెళ్లి కుదిర్చేవాళ్లమే కాదని అన్నారు.
తల్లిదండ్రులు షాక్‌లో ఉండటంతో ఏమీ మాట్లాడలేకపోయారు. పెళ్లి కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు. అన్ని రకాలుగా నష్టపోయారు. పెళ్లికొడుకు తరఫు వారు కూడా బాగా ఖర్చు చేశారు. ఆ మొత్తాన్ని పెళ్లికూతురు కుటుంబం నుంచి ఇప్పించాలని పోలీసులను కోరారు. పరువు తీశావు కదే! అని బంధువులు తిట్టుకుంటూ వెళ్లిపోయారు. ఈ ఘటనతో పెళ్లి మండపం రణరంగంగా మారింది. మరి ఈ పరిణామాల తర్వాత పల్లవి ఏం చేయబోతోంది? ఆమె ప్రేమించిన యువకుడు ఎవరు? అనేది తెలియాల్సి ఉంది.
