Begin typing your search above and press return to search.

లక్షన్నర సుపారీ, కర్రలతో దాడి..వరుడిని హత్య చేసేందుకు వధువు యత్నం!

పుణెలో పెళ్లికి సిద్ధమైన ఒక వధువు, తన కాబోయే భర్తను హతమార్చడానికి హంతకులను నియమించిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

By:  Tupaki Desk   |   4 April 2025 5:00 PM IST
లక్షన్నర సుపారీ, కర్రలతో దాడి..వరుడిని హత్య చేసేందుకు వధువు యత్నం!
X

పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండాలని తీసుకునే పవిత్రమైన నిర్ణయం. అయితే, పుణెలో జరిగిన ఓ ఘటన, వివాహ బంధంలో ఎంత ప్రమాదం దాగి ఉందో చూపిస్తుంది. పెళ్లి పీటలెక్కాల్సిన వధువు, తన కాబోయే భర్తను హతమార్చడానికి హంతకులను నియమించడం సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రేమ పెళ్లి లో పగ, ద్రోహం, నేరం కలగలసి ఒక భయానక కథను తలపించేలా ఈ ఘటన జరిగింది.

పుణెలో పెళ్లికి సిద్ధమైన ఒక వధువు, తన కాబోయే భర్తను హతమార్చడానికి హంతకులను నియమించిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేయగా, ప్రధాన నిందితురాలు మయూరి దంగ్డే పరారీలో ఉంది. మయూరి దంగ్డే, సాగర్ కదమ్‌ల వివాహం మార్చి 12న జరగాల్సి ఉంది. అయితే, ఈ పెళ్లి సంబంధం పట్ల మయూరి అసంతృప్తి వ్యక్తం చేయడంతో వివాహం రద్దయింది. అయినప్పటికీ, మయూరి తన పగ తీర్చుకోవడానికి సాగర్‌పై దాడి చేయించడానికి పన్నాగం పన్నింది.

మార్చి 28న సోలాపూర్-పుణె హైవేపై ఖామ్‌గావ్‌లోని హోటల్ సాయి మిసల్ సమీపంలో సాగర్‌పై కొంతమంది వ్యక్తులు కర్రలతో దాడి చేశారు. మయూరికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఈ దాడిలో సాగర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై సాగర్ ఫిర్యాదు చేయడంతో యవత్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

విచారణలో ఆదిత్య దంగ్డే (19) అనే వ్యక్తి, మయూరి దంగ్డే, సందీప్ గావ్డేల ఆదేశాల మేరకు తాను, మరో ముగ్గురు కలిసి దాడి చేసినట్లు అంగీకరించాడు. సాగర్‌ను హతమార్చడానికి మయూరి, సందీప్ గావ్డే రూ. 1.50 లక్షలు సుపారీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో సందీప్ దాదా గావ్డే, శివాజీ రామదాస్ జారే, ఇంద్రభాన్ సఖారాం కోల్పే, సూరజ్ దిగంబర్ జాదవ్ లను పోలీసులు అరెస్టు చేశారు. దాడికి ఉపయోగించిన వాహనం, కర్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇన్‌స్పెక్టర్ నారాయణ్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ, ఈ దాడికి సంబంధించి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, పరారీలో ఉన్న ప్రధాన నిందితురాలు మయూరి దంగ్డే కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ కేసులో ఇంకా ఎవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పుణెలో తీవ్ర సంచలనం రేపింది. పెళ్లి పీటలెక్కాల్సిన వధువు, వరుడిపై దాడి చేయించడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.